Ramoji Rao in Ramoji Film City హైదరాబాద్: ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు (Cherukuri Ramoji Rao) పార్థీవదేహానికి కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) నివాళులు అర్పించారు. న్యూఢిల్లీ నుంచి వచ్చిన నిర్మలా సీతారామన్ హైదరాబాద్ లో రామోజీ ఫిల్మ్ సిటీకి చేరుకున్నారు. అక్కడ రామోజీరావు పార్థీవదేహం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి ఆమె నివాళులర్పించారు. ప్రధానిగా మరోసారి ప్రమాణం చేయనున్న నరేంద్ర మోదీ సందేశాన్ని రామోజీరావు కుటుంబ సభ్యులకు నిర్మలా సీతారామన్ చేరవేశారు. రెండు రోజుల కిందటే మోదీ ఫోన్ చేసి రామోజీరావు ఆరోగ్యంపై ఆరా తీసినట్లు తెలిపారు. కానీ అంతలోనే విషాదం చోటుచేసుకుందని నిర్మలా సీతారామన్ అన్నారు.


రామోజీరావు మరణం తెలుగు ప్రజలతో పాటు జర్నలిజం రంగానికి తీరని లోటు అన్నారు. పలు రంగాల్లో ఆయన తనదైన ముద్ర వేశారని కొనియాడారు. కేంద్ర ప్రభుత్వ సందేశాన్ని చేరడానికి తాను ఇక్కడికి వచ్చినట్లు తెలిపారు. రామోజీరావు జర్నలిజంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చారని కొనియాడారు. సినిమా రంగంలోనూ నిర్మాతగా ఎన్నో సందేశాత్మక సినిమాలు తీసి తనదైన మార్క్ చూపించారని పలు రంగాల్లో రామోజీరావు సేవల్ని గుర్తుచేశారు. 






రామోజీరావు ఫ్యామిలీకి మోదీ సందేశం.. 
రామోజీరావు మృతి తెలుగు వారికి మాత్రమే కాదు, దేశంలోని మీడియాకు, చిత్రపరిశ్రమకు తీరని లోటు అన్నారు. రామోజీరావు మరణంపై నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారని నిర్మలమ్మ చెప్పారు. కుటుంబసభ్యులను కలిసి పరామర్శించాలని, వారికి తన ప్రగాఢ సానుభూతి తెలపాలని నరేంద్ర మోదీ ఇచ్చిన సందేశాన్ని రామోజీరావు ఫ్యామిలీకి అందించారు. కేంద్ర ప్రభుత్వం తరఫున తాను ఇక్కడికి వచ్చానని, రామోజీ కుటుంబసభ్యులను పరామర్శించాలని మోదీ తనను ఇక్కడికి పంపించారని చెప్పారు.






రామోజీరావు చేసిన సేవల్ని గుర్తించిన భారత ప్రభుత్వం దేశంలో రెండవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మ విభూషణ్‌తో సత్కరించింది. 2016లో అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతులమీదుగా రామోజీరావు పద్మ విభూషణ్‌ను అందుకున్నారని తెలిసిందే.