KTR demands inquiry on NEET 2024exam with high level committee: హైదరాబాద్: ప్రతిష్టాత్మక నీట్ (NEET) ఎగ్జామ్ లో జరిగిన అవకతవకలపై భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. నీట్ లో అవకతవకలపై హై లెవల్ ఎక్స్ పర్ట్ కమిటీ ద్వారా విచారణ జరిపించాలని కేటీఆర్ కేంద్రాన్ని డిమాండ్ చేశారు. నీట్ ఎగ్జామ్‌లో జరిగిన అవకతవకలపై ట్విట్టర్ వేదికగా స్పందించారు. కొత్తగా ఏర్పాటు అవుతున్న ఎన్డీయే ప్రభుత్వ ఎన్నో సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు.
అంతమందికి ఫస్ట్ ర్యాంక్ ఎలా వచ్చింది?
ఎన్డీయే ప్రభుత్వం ఎదుర్కునే సవాళ్లలో విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన నీట్ ఎగ్జామ్ రిజల్ట్ 2024 (#NEET2024result ) చాలా సున్నితమైన అంశమన్నారు. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్ కు సంబంధించిన నీట్ అంశంపై కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు. వైద్య విద్యార్థుల జీవితాలను ప్రభావితం చేసే నీట్ ఎగ్జామ్‌లో ఎన్నడూ లేని విధంగా 67 మంది విద్యార్థులు 720 కి 720 మార్కులతో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సాధించారు. ఈ ఫలితాలు గమనిస్తే ఏదో మతలబు జరిగిందని, వైద్య విద్యార్థులకు నష్టం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
నీట్ ఫలితాలలో 67 మంది విద్యార్థులకు 720కి 720 మార్కులు రాగా, చాలా మంది విద్యార్థులకు 718, 719 మార్కులు సైతం రావడం అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నీట్ లో (+4, -1) మార్కింగ్ విధానం ఉన్నందున, అసలు 718, 719 మార్కులు రావడం అనేది అసాధ్యమన్నారు. ఎవరైనా దీనిపై ప్రశ్నిస్తే 'గ్రేస్ మార్కులు' ఇచ్చామని సాకులు చెబుతున్నారు. కొంతమంది విద్యార్థులకు ఏకంగా 100 వరకు గ్రేస్ మార్కులు ఇచ్చి ఉంటారని ఆరోపించారు. అయితే ఆ గ్రేస్ మార్కుల కోసం ఏ విధానం పాటించారనేది మాత్రం చెప్పకపోవటం ఆశ్చర్యం కలిగిస్తోంది.
నీట్ రిజల్ట్స్‌ను ఎన్నికల ఫలితాల రోజే హడావుడిగా ఎందుకు విడుదల చేశారని కేటీఆర్ ప్రశ్నించారు. కొత్తగా ఏర్పడిన ఎన్డీయే సర్కార్ (NDA Governmnent) భవిష్యత్తులో మరిన్ని సవాళ్లను ఎదుర్కొవాల్సి వస్తుందని హెచ్చరించారు. నీట్ ఫలితాలతో పాటు మరికొన్ని అంశాలపై ప్రశ్నలు, డిమాండ్లను కేటీఆర్ కేంద్రం ముందు ఉంచారు.
కేంద్రానికి కేటీఆర్ ప్రశ్నలు, డిమాండ్లు.
1) ఏ ఒక్క తెలంగాణ విద్యార్థి కూడా నీట్ (NEET) లో టాప్ 5 ర్యాంక్‌లో లేకపోవడం గత 5 ఏళ్లలో ఇది తొలిసారి. నీట్ ఎగ్జామ్ లో జరుగుతున్న అవకతవకలే అందుకు కారణమని భావిస్తున్నాం.
2) నీట్ ఎగ్జామ్ ఫలితాలలో గ్రేస్ మార్కుల కేటాయింపు కోసం అనుసరించిన విధానాన్ని బయటపెట్టాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. సరైన పద్ధతిలో ప్రతి విద్యార్థికి మేలు జరిగేలా నీట్ ఉండాలని బీఆర్ఎస్ కోరుతోంది. కేవలం 1500 మంది విద్యార్థులకు మాత్రమే మేలు చేసేందుకు గ్రేస్ మార్కులు కలిపారు. అది సరి కాదు.
3) నీట్ ఎగ్జామ్ వ్యవహారంపై ఉన్నతస్థాయి నిపుణుల కమిటీతో విచారణ జరిపించాలని బీఆర్ఎస్ డిమాండ్. తాజా విధానంతో అన్యాయం జరిగిన విద్యార్థులకు న్యాయం చేయడంతో పాటు ఈ అక్రమాలకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.