Computer Science Engineering Seats: తెలంగాణలోని ఇంజినీరింగ్ కళాశాలల్లో అదనంగా మరో 10 వేల సీట్లు పెరుగనున్నాయి. ముఖ్యంగా కంప్యూటర్ సైన్స్‌, ఐటీ సంబంధిత కోర్సులకు డిమాండ్ పెరగడంతో ప్రస్తుత విద్యాసంవత్సరం(2024-25)లోనే ఈ సీట్లు అందుబాటులోకి రానున్నాయి. గతేడాది కన్వీనర్ కోటా కింద భర్తీ అయిన సీట్లలో కంప్యూటర్ సైన్స్ సీట్లదే అగ్రస్థానం. గత విద్యాసంవత్సరంలో దాదాపు 68 సీట్లు ఆ బ్రాంచీలవే కావడం విశేషం. ఈ సీట్లకు తోడు ఈసారి మరో 10 వేల సీట్లు అదనంగా రానున్నాయి. సీట్ల సంఖ్య పెరిగితే మేనేజ్‌మెంట్ కోటా సీట్లకు డిమాండ్ తగ్గే అవకాశం ఉంది. 


రాష్ట్రంలోని ఇంజినీరింగ్ కళాశాలల్లో 2023-24 విద్యా సంవత్సరంలో కన్వీనర్ కోటా (70 శాతం) కింద మొత్తం 83,766 బీటెక్ సీట్లు ఉండగా... అందులో కంప్యూటర్ సైన్స్, ఐటీ సంబంధిత బ్రాంచీల్లోనే 56,811 సీట్లు ఉన్నాయి. అంటే ఆ బ్రాంచీల వాటానే 68 శాతంతో సమానం. ఇక రాష్ట్రంలోని అయిదు ప్రైవేట్ యూనివర్సిటీలు, డీమ్డ్ వర్సిటీలను కలుపుకొంటే మొత్తం 75 శాతం వరకు సీట్లు ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 156 ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలు ఉన్నాయి. అయితే వాటిలో తగిన మౌలిక వసతుల వెసులుబాటు చూపిస్తే.. ఎన్ని సీట్లకైనా అనుమతిస్తామని ఏఐసీటీఈ వెల్లడించిన సంగతి తెలిసిందే. అంటే పెంచుకునే సీట్లకు అనుగుణంగా క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్స్, టీచింగ్ స్టాఫ్ చూపితే చాలు కొత్త సీట్లకు అనుమతి లభించనట్లే.


రాష్ట్రంలోని కాలేజీల్లో కంప్యూటర్ సంబంధిత సీట్ల (Computer Science Seats) సంఖ్య ఇప్పటికే 75 శాతానికిపైగా ఉండగా.. ఈసారి మరిన్ని సీట్లు పెరుగున్నాయి. సీట్ల సంఖ్యపై ఇప్పటివరకు ఉన్న పరిమితిని ఏఐసీటీఈ ఎత్తివేయడంతో సీట్లు భారీగా పెరునున్నాయి. నిబంధనలను పాటించే కళాశాలలకు ఒక్కో విభాగానికి 240 సీట్లకు మించి ఏఐసీటీఈ అనుమతి ఇవ్వడంలేదు. నేషనల్ బోర్డు ఆఫ్ అక్రిడిటేషన్ (NBA) గుర్తింపు ఉంటే ఆ పరిమితికి మించి సీట్లు తెచ్చుకోవచ్చు. జేఎన్‌టీయూహెచ్ పరిధిలోనే 46 వరకు అటానమస్ కళాశాలలు ఉండటం గమనార్హం. కనీసం సగం కళాశాలలు అంటే 50 కళాశాలల వరకు దరఖాస్తు చేసుకొని ఒక్కో సెక్షన్ పెంచుకున్నా 1500 సీట్లు కొత్తగా అందుబాటులోకి వస్తాయి.


గుర్తింపు తప్పనిసరి.. 
సీట్లు పెంచుకోవాలనుకునే కళాశాలలు 'న్యాక్ ఏ-గ్రేడ్' లేదా 'స్వయం ప్రతిపత్తి' హోదా తప్పనిసరిగా కలిగి ఉండాలి. అలాంటి ఇంజినీరింగ్ కాలేజీలు రాష్ట్రంలో 65పైనే ఉన్నాయి. వీటిలో 50 వరకు కళాశాలలు కంప్యూటర్ సైన్స్ సీట్ల కోసం ఏఐసీటీఈకి దరఖాస్తు చేసుకున్నాయి. ఇప్పటికే కొన్ని కాలేజీలకు అనుమతి ఇవ్వగా.. మరికొన్నింటిని పెండింగ్‌లో ఉంచారు. పరిశీలన పూర్తికాగానే వాటికి కూడా అనుమతులు వచ్చే అవకాశం ఉంది. అయితే గరిష్ఠంగా కొన్ని కళాశాలలు 300-400 కొత్త సీట్లకు దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తోంది. జూన్ 10తో అనుమతుల ప్రక్రియ ముగియనుంది. గడవు ముగిసిన తర్వాతే కొత్తగా ఎన్ని సీట్లు వచ్చాయి అన్న విషయం స్పష్టమవుతుందని రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి. ఈసారి రాష్ట్రంలో కనీసం 10 వేల వరకు కొత్త సీట్లు వచ్చే అవకాశం ఉందని అంచనావేస్తున్నారు. అంటే వాటిలో 7 వేల సీట్లను కన్వీనర్ కోటా కింద కౌన్సెలింగ్ ద్వారానే భర్తీ చేయనున్నారు. దీంతో మేనేజ్‌మెంట్ కోటా కింద సీట్ల భర్తీ ఈసారి తగ్గనుంది.


రాష్ట్రంలో తొలి ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాల..
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గమైన కొడంగల్‌లోని 'కోస్గి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల'ను ఇంజినీరింగ్ కళాశాలగా ఉన్నతీకరించిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో తొలి ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాలగా ఇది నిలిచింది. ఆ కళాశాలల్లో నాలుగు బ్రాంచీల్లో 60 సీట్ల చొప్పున మొత్తం 240 సీట్లు కొత్తగా అందుబాటులోకి రానున్నాయి. జేఎన్‌టీయూహెచ్‌కు అనుబంధంగా ఈ కళాశాల కొనసాగనుంది.


అప్పుడు 180.. ఇప్పడు 300..
గతేడాది ఖమ్మం జిల్లా పాలేరు, మహబూబాబాద్‌లలో జేఎన్‌టీయూహెచ్ అనుబంధంగా కొత్త ఇంజినీరింగ్ కళాశాలలను ప్రభుత్వం ప్రారంభించిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో శాసనసభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని హడావిడిగా కౌన్సెలింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత వాటిల్లో ప్రవేశాలకు అనుమతిచ్చారు. దీంతో కేవలం మూడేసి కోర్సుల చొప్పున ఒక్కో దాంట్లో 180 సీట్లకే ప్రవేశాలు కల్పించారు. అక్కడ సీఎస్‌ఈ, సీఎస్‌ఈ డేటా సైన్స్, ఈసీఈ బ్రాంచీలున్నాయి. ఈసారి కొత్తగా మెకానికల్, ఎలక్ట్రికల్ బ్రాంచీలు రానున్నాయి. అంటే ఒక్కో దాంట్లో 120 సీట్లు అదనంగా రానున్నాయి. దీంతో సీట్ల సంఖ్య 300కు చేరే అవకాశం ఉందని జేఎన్‌టీయూహెచ్ వర్గాలు చెబుతున్నాయి.



మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..