Rajamouli And Keeravani About Ramoji Rao: మీడియాకు, సినీ పరిశ్రమకు రామోజీ రావు అందించిన సేవలు ఎన్ని ఏళ్లు అయినా మరువలేనివి అంటూ ప్రముఖులంతా ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు. తెల్లవారుజామున రామోజీ రావు మరణించిన వార్త తెలియగానే ఎంతోమంది సినీ, రాజకీయ ప్రముఖులు ఆయనను చివరిసారిగా చూడడానికి బయల్దేరారు. ఆయన వారికి ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. అలాగే రాజమౌళి, కీరవాణి కూడా రామోజీ రావుతో తమకు ఉన్న అనుబంధాన్ని గుర్తుచేస్తూ చాలా గొప్పగా మాట్లాడారు. దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు రామోజీ రావు కుమారుడిని హత్తుకొని బోరున విలపించారు.


ఆయనకు మరణం లేదు..


ముందుగా కీరవాణి మాట్లాడుతూ ‘‘రామోజీ రావు గారిది మరణం అని నేను అనుకోవడం లేదు. ఆయనది నిర్యానం’’ అని చెప్పి ఎమోషనల్ అయ్యారు. ఆ తర్వాత రాజమౌళి కూడా రామోజీ రావు గురించి మాట్లాడారు. ‘‘ఒక్క మనిషి అన్ని రంగాల్లో, అన్ని ఇన్‌స్టిట్యూషన్స్ స్థాపించడం మామూలు విషయం కాదు. ఇన్‌స్టిట్యూషన్స్ స్థాపించడం మాత్రమే కాదు, అందులో కొత్త పద్ధతులను తీసుకొచ్చారు. ఏ రంగంలో అడుగుపెట్టినా దానిని శిఖరాలకు తీసుకెళ్లింది మాత్రం ఆ ఒక్క వ్యక్తే. ఆయన ఎంతోమందికి మార్గదర్శకంగా నిలిచారు. ఎంతోమందికి ఉపాధి కల్పించారు. అలాంటి వ్యక్తికి భారతరత్న ఇచ్చి మాత్రమే నివాళులు అర్పించగలం’’ అని అభిప్రాయం వ్యక్తం చేశారు రాజమౌళి.


భారతరత్న కచ్చితంగా ఇవ్వాలి..


‘‘ఆయను భారతరత్న కచ్చితంగా ఇవ్వాలి. రామోజీ రావు లాంటి వ్యక్తికి భారతరత్న ఇవ్వడం సముచితం అని రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు, కేంద్ర ప్రభుత్వానికి మనవి చేసుకుంటున్నాను’’ అని కోరారు రాజమౌళి. ఇంకా ఎంతోమంది ప్రముఖులు.. రామోజీ రావు పార్థివ దేహాన్ని చూడడం కోసం రామోజీ ఫిల్మ్ సిటీలోని ఆయన నివాసానికి వస్తూ ఉన్నారు. అంతే కాకుండా సోషల్ మీడియాలో కూడా ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని పోస్టులు పెడుతూ ఉన్నారు. ఇప్పటికే మెగా ఫ్యామిలీ నుండి చిరంజీవి, పవన్ కళ్యాణ్ సైతం రామోజీ రావు మృతిపై స్పందిస్తూ పోస్టులు పెట్టారు. మరికొందరు ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటున్నారు.


తలవంచని పర్వతం..


‘ఎవరికీ తలవంచని మేరు పర్వతం’ అంటూ రామోజీ రావు వ్యక్తిత్వం గురించి చెప్పారు చిరంజీవి. సినిమా ఆర్టిస్టులు మాత్రమే కాకుండా సీరియల్ ఆర్టిస్టులు కూడా ఆయన పార్థివ దేహాన్ని చూడడానికి తరలివస్తున్నారు. రామోజీ రావు స్థాపించిన ఉషాకిరణ్ మూవీస్.. కేవలం సినిమాలను మాత్రమే కాకుండా సక్సెస్‌ఫుల్ సీరియల్స్‌ను కూడా నిర్మించింది. ఇప్పటికీ ఉషా కిరణ్ మూవీస్ నిర్మాణంలో తెరకెక్కుతున్న ‘మౌనపోరాటం’ అనే సీరియల్.. ఈటీవీలో ప్రసారం అవుతుంది. సంస్థలో ఎలాంటి ఇబ్బంది వచ్చినా సీరియల్స్ షూటింగ్ మాత్రం ఎప్పుడూ ఆగనివ్వలేదు అంటూ ఆర్టిస్టులు గుర్తుచేసుకుంటున్నారు. ఆయన వల్లే ఈ సంస్థ ఇంతకాలం ప్రేక్షకులు ఆదరణ పొందిందని ప్రశంసిస్తున్నారు. ఉషా కిరణ్ మూవీస్ నిర్మాణంలోని మొదటి సినిమాలో నటించిన నరేశ్ కూడా రామోజీ రావును చివరిచూపు చూడడానికి వచ్చారు.


Also Read: ఎన్టీఆర్ to శ్రీయ - రామోజీరావు పరిచయం చేసిన నటులు.. దర్శకులు, మ్యూజిక్ డైరెక్టర్లు వీరే!