YSRCP Defeated because of CMO officials :  వైఎస్ఆర్‌సీపీ ఓటమికి ప్రధాన కారణాలు ఏమిటన్నదానిపై ఆ పార్టీ అగ్రనేతలు ఇంకా రివ్యూలు పెట్టుకోలేదు కానీ.. ఆ పార్టీకి చెందిన నేతలు, మాజీ ఎమ్మెల్యేలు మాత్రం.. తమ ఓటమికి కారణంగా చీఫ్ మినిస్టర్ కార్యాలయాన్ని చూపిస్తున్నారు. తమకు జగన్ ను కలిసే అవకాశం ఇవ్వకుండా చేశారని వారంటున్నారు. అంతా ధనుంజయ్ రెడ్డి చూసుకునేవారని.. తమ విజ్ఞప్తులను పట్టించుకునేవారే ఉండేవారు కాదని వారంటున్నారు. 


ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డిదీ అదే మాట


సీఎంవో తీరుపై ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి   పలు ఆరోపణలు చేశారు. సీఎంవో కార్యాలయంలో పనిచేసే అధికారుల ప్రవర్తన తీరువల్ల నియోజకవర్గ సమస్యలను నేరుగా జగన్‌కు చెప్పుకోలేక పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. నియోజకవర్గ సమస్యలను జగన్ దృష్టికి తీసుకువెళ్లేందుకు.. వెళితే సీఎంవో తీరుతో సీఎంను కలిసేందుకు వీలు అయ్యేది కాదని ఆరోపించారు. వారి ప్రవర్తన వల్ల మంత్రులు, ఎమ్మెల్యేలు సైతం ఇబ్బంది పడ్డారని, గంటల తరబడి ఎదురు చూసే పరిస్థితి ఉండేదని పేర్కొన్నారు. న్నికల్లో కూటమి ఇచ్చిన హామీలను ప్రజలు నమ్మడం వల్లే అత్యధిక స్థానాల్లో గెలుపొందిందని వెల్లడించారు.                        


ముందుగా ధనుంజయ్ రెడ్డిపై జక్కంపూడి రాజా విమర్శలు  


సీఎం జగన్‌కు అర్జీలివ్వడానికి వెళితే ఎమ్మెల్యేలను కూడా నుంచోపెట్టేవాడని రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా విమర్శించారు.   ఆయనే ముఖ్యమంత్రిలాగా తన గది ముందు గంటల తరబడి నుంచోపెట్టేవాడని ధ్వజమెత్తారు. ఇటువంటి అధికారుల వల్లే ఎక్కువ నష్టం జరిగిందన్నారు. రాజమహేంద్రవరంలో బుధవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘ఎమ్మెల్యేగా ఏదైనా సమస్య పరిష్కారం కోసం ముఖ్యమంత్రి దగ్గరకు వెళ్లి చెబితే.. ఆయన ప్రగాఢ నమ్మకంతో, గుడ్డి విశ్వాసంతో ధనుంజయ్‌ రెడ్డిని పిలవడం, ఆయనకు చెప్పడం, ఏ కాగితం అయినా ఆయన చేతిలోకి వెళితే ఇక అంతే సంగతులు. ఒకటి కాదు.. వందల సమస్యలు చెప్పవచ్చు. అవన్నీ బుట్టదాఖలేనని మండిపడ్డారు. 


మరికొంత మంది మాజీ ఎమ్మెల్యేలది  అదే అసంతృప్తి 


మరికొంత మంది  మాజీ ఎమ్మెల్యేలతో పాటు మంత్రులది కూడా అదే అసంతృృప్తిలో ఉన్నారు.   అధినేతకు నిజాలు తెలియాలని కోరుకునేవారు మాత్రం కాస్త కష్టమైనా ఇలా బయటపడుతున్నారు. అయితే పార్టీ అంతర్గత వ్యవహారాలను ఇలా బయటపెట్టుకోవడం సరికాదని పార్టీ పరంగా చెప్పాలని నేతలకు ఆఫీసు నుంచి సూచనలు వెళ్తున్నాయి. త్వరలో పరాజయాలపై సమీక్ష నిర్వహిద్దామని చెబుతున్నారంటున్నారు.


కొసమెరుపేమిటంటే.. ధనుంజయ్ రెడ్డి ఎన్నికల ఫలితాలకు నాలుగు రోజుల ముందు రిటైరయ్యారు.