Chiranjeevi And Pawan Kalyan pay Tribute to Ramoji Rao: ఈనాడు గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు పార్థీవ దేహానికి మెగాస్టార్‌ చిరంజీవి, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ నివాళులర్పించారు. రామోజీ ఫిల్మ్‌ సిటీలోని ఆయన బౌతిక ఖాయాన్ని సందర్శించి నివాళులర్పించిన అనంతం మీడియాతో మాట్లాడి సంతాపాన్ని తెలియజేశారు. ఈ సందర్భంగా మెగాస్టార్‌ చిరంజీవి మాట్లాడుతూ రామోజీతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఈనాడు సంస్థను ఆయన కలలుకు అనుగుణంగా ముందుకు తీసుకెళ్లడంలో వారసులు, సిబ్బంది సఫళీకృతులవుతారన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.


రామోజీలో చిన్న పిల్లాడు తెలుసన్న చిరంజీవి 
రామోజీ అంటే ప్రతి ఒక్కరికీ గంభీరంగా కనిపించే వ్యక్తికి గుర్తుకు వస్తారని, కానీ, తనకు ఆయనలో ఉన్న చిన్న పిల్లాడు తెలుసన్నారు. 2009లో ప్రజారాజ్యం పార్టీ పెట్టిన సమయంలో రామోజీని తరచూ వెళ్లి కలిసేవాడినని, ఈ సందర్భంగా ఆయన సలహాలు, సూచనలు తీసుకునే వాడినన్నాఆరు. ఒక సమయంలో రామోజీ ఇంటికి వెళ్లినప్పుడు ఆయనకు పెన్నులు కలెక్ట్‌ చేసే అలవాటు ఉందని తెలిసిందని, ఒక పెన్ను తీసుకెళ్లి ఇచ్చానన్నారు. తానిచ్చిన పెన్ను చూసి రామోజీ ఎంతో ఎగ్జైట్‌ అయ్యారని, చాలా బాగుందంటూ ఆనందాన్ని వ్యక్తం చేశారన్నారు.


పెన్నులంటే ఎందుకు అంత ఇష్టమని, ఏం చేసుకుంటారని అడిగితే.. దగ్గరలో ఉన్న బీరువా వద్దకు తీసుకెళ్లి అప్పటి వరకు కలెక్ట్‌ చేసిన పెన్నులను తనకు చూపించారన్నారు. తాను కలెక్ట్‌ చేసిన పెన్నులతో డైరీలో రాసుకుంటానని చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా చిరంజీవి గుర్తు చేశారు. రకారకాల పెన్నులతో ఆయన ఆలోచనలకు అక్షరరూపం ఇచ్చేవారన్నారు. సమాజానికి ఏదో ఒకటి చేయాలన్న సంకల్పం ఆయనలో ఉండేదన్నారు. ఆయన లేని లోటు తీర్చలేనిదన్న చిరంజీవి.. తెలుగు జాతి పెద్ద దిక్కును, శక్తిని కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన మనతోనే ఉంటారని పేర్కొన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరలని, కుటుంబ సభ్యులకు, ఉద్యోగులకు తన ప్రగాఢ సానుభూతిని చిరంజీవి తెలియజేశారు. 


ప్రమాణ స్వీకారం తరువాత రావాలనుకున్నట్టు చెప్పిన పవన్‌


రామోజీరావు మృతి వార్త తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌. రామోజీ భౌతిక ఖాయానికి నివాళులర్పించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసిన తరువాత వచ్చి కలవాలని భావించానని, ఇంతలోనే ఇలా జరిగిపోయిందన్నారు. గడిచిన దశాబ్ధన్నర కాలంగా ఆయనను ప్రభుత్వాలు ఇబ్బందులు పెట్టాయని, అయినా అన్నీ తట్టుకుని ప్రజల కోసం నిలబడి వారిలో చైతన్యం తీసుకువచ్చే ప్రయత్నాన్ని చేశారన్నారు. ప్రజలకు అండగా నిలబడిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. మహోన్నతమైన వ్యక్తి ఏపీ, తెలంగాణలోనే కాకుండా దేశంలోనే లేరన్నారు.


రెండు రాష్ట్రాల్లోని ఎంతో మంది జర్నలిస్టులకు ఈనాడు జర్నలిజం స్కూల్‌ నుంచే వచ్చారని, వారికి విలువలతో కూడిన వృత్తిని ఆయన నేర్పించారన్నారు. హైదరాబాద్‌లో చిత్ర పరిశ్రమకు సంబంధించి మౌలిక వసతులు కల్పించడంలో ఆయన ఎంతో కీలకంగా వ్యవహరించారని, చిత్ర పరిశ్రమ అద్భుతంగా ఉండడంతో రామోజీ తోడ్పాటు ఎంతో ఉందన్నారు. గడిచిన కొన్నాళ్లుగా ఆయనను ఇబ్బందులు పెట్టిన ప్రభుత్వాలు ప్రస్తుతం లేవని, ఆ విజయాన్ని ఆయనకు తెలియజేయాలనుకున్నామన్నారు. దురదృష్టవశాత్తు ఇలా జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. రామోజీ కుటుంబ సభ్యులకు, ఈనాడు గ్రూప్‌ సభ్యులకు జనసేన, తన తరఫున ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలియజేశారు.