sonia gandhi Congress Parliamentary Party: కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షురాలిగా మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ మరోసారి ఎన్నికయ్యారు.  పాత పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో జరిగిన కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ (Congress Parliamentary Party) సమావేశంలో పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే..  సీపీసీ చీఫ్‌గా సోనియా గాంధీని నియమించే ప్రతిపాదనను సమర్పించారు. ఈ ప్రతిపాదనకు గౌరవ్ గొగోయ్, కె సుధాకరన్,  తారిఖ్ అన్వర్ మద్దతు ఇచ్చారు. తర్వాత లోక్ సభ, రాజ్య సభ ఎంపీలు ఏకగ్రీవంగా ఆమోదించారు.  77 ఏళ్ల సోనియా గాంధీ ఫిబ్రవరిలో రాజ్యసభకు ఎన్నికయ్యారు. అంతకుముందు పార్టీ కార్యవర్గ సమావేశంలో.. రాహుల్ గాంధీ లోక్‌సభలో ప్రతిపక్ష నేత బాధ్యతలు చేపట్టాలని కోరుతూ ఏకగ్రీవ తీర్మానం ఆమోదించారు. ఈ లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ 99 సీట్లు గెలుచుకుంది.


ఎన్డీయే ఏకపక్ష ధోరణి ఇక చెల్లదు
కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షురాలిగా  ఎన్నికైన తర్వాత  సోనియాగాంధీ పార్టీ ఎంపీలను ఉద్దేశించి మాట్లాడారు.  క్రియాశీలకంగా పని చేయాలని ఆమె ఎంపీలకు సూచించారు. సీపీపీ సభ్యులుగా ఎన్డీయే గవర్నమెంట్ ను  జవాబుదారీగా ఉంచాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు.  పది సంవత్సరాలు పార్లమెంటులోని ఎన్డీయే ఏకపక్ష ధోరణి ఇక మీదట చెల్లదన్నారు సోనియా గాంధీ.  గత లోక్‌సభలో కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ  చైర్ పర్సన్ గా  పనిచేసిన ఆమె మళ్లీ ఈ పదవికి ఎన్నికయ్యారు. 20సంవత్సరాల పాటు లోక్‌సభ సభ్యురాలిగా ఉన్న సోనియాగాంధీ ప్రస్తుతం రాజ్యసభ సభ్యురాలిగా కొనసాగుతున్నారు.


కూటమి నేతలకు ఆహ్వానం లేదు
ప్రధాని నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారోత్సవానికి ‘ఇండియా’ కూటమి నేతలకు ఇంకా ఆహ్వానం అందలేదని కాంగ్రెస్ పార్టీ పేర్కొంది.  అయితే ఆహ్వానం అందిన తర్వాత పరిశీలిస్తామని పార్టీ తెలిపింది. మోడీ మూడోసారి ప్రధానిగా జూన్ 9న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయనతో పాటు ఆయన మంత్రి మండలిలోని పలువురు సభ్యులు కూడా ప్రమాణం చేయనున్నారు.  పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ విలేకరులతో మాట్లాడుతూ, “ప్రస్తుతం ప్రధాని మోడీ ప్రమాణ స్వీకారోత్సవానికి అంతర్జాతీయ నాయకులను మాత్రమే ఆహ్వానించారు. మా నేతలకు ఇంకా ఆహ్వానం అందలేదు. ఇండియా కూటమి నాయకులకు ఆహ్వానం అందితే తర్వాత దానిని పరిశీలిస్తాము’’.   అన్నారు.


నెహ్రూ తర్వాత మోడీనే
 ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం వరుసగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు.  మొదటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ తర్వాత ఈ ఘనత సాధించిన రెండవ నేత మోడీనే. కొత్త ప్రభుత్వంలో  ఎన్‌డిఎలోని వివిధ విభాగాలకు మంత్రి మండలిలో అవకాశంపై బిజెపి నాయకత్వం, మిత్రపక్షాల మధ్య తీవ్రమైన చర్చలు జరుగుతున్నాయి. అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్ లతో పాటు పార్టీ అధ్యక్షుడు జె.పి. నడ్డా వంటి బీజేపీ సీనియర్ నేతలు, తెలుగుదేశం పార్టీకి చెందిన చంద్రబాబు,  జేడీ(యూ)కి చెందిన నితీశ్‌ కుమార్‌, శివసేనకు చెందిన ఏక్‌నాథ్‌ షిండేతో సహా మిత్రపక్షాలతోసంప్రదింపులు జరుపుతున్నారు.


మిత్రపక్షాలకు కేబినెట్ పదవులు
హోం, ఆర్థిక, రక్షణ, విదేశీ వ్యవహారాల వంటి ముఖ్యమైన శాఖలే కాకుండా విద్య, సాంస్కృతికం వంటి  రెండు మంత్రిత్వ శాఖలు బీజేపీతోనే ఉంటాయని, దాని మిత్రపక్షాలకు ఐదు నుంచి ఎనిమిది కేబినెట్ పదవులు దక్కవచ్చని భావిస్తున్నారు. పార్టీలో అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్ సింగ్ వంటి నాయకులు కొత్త మంత్రివర్గంలో చేరడం ఖాయమని భావిస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో గెలిచిన మాజీ ముఖ్యమంత్రులు శివరాజ్ సింగ్ చౌహాన్, బసవరాజ్ బొమ్మై, మనోహర్ లాల్ ఖట్టర్, సర్బానంద సోనోవాల్ ప్రభుత్వంలో చేరే అవకాశం కనిపిస్తోంది.


ప్రమాణ స్వీకారోత్సవానికి పూర్తయిన ఏర్పాట్లు
మోడీ ప్రమాణ స్వీకారోత్సవానికి ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి. దేశ విదేశాలకు చెందిన దాదాపు ఎనిమిది వేల మంది అతిథిలు హాజరు కానున్నారు. శ్రీలంక అధ్యక్షుడు రణిల్‌ విక్రమ్‌సింఘే, మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జు, సీషెల్స్ ఉపాధ్యక్షుడు అహ్మద్ అఫీఫ్, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా, నేపాల్‌ ప్రధాని పుష్ప కమల్‌ దహల్‌ ప్రచండ, భూటాన్ ప్రధాని షెరింగ్ టోబ్గే, మారిషస్ ప్రవింద్ కుమార్ జుగ్నాథ్‌లను కార్యక్రమానికి ఆహ్వానించారు. ఇప్పటికే షేక్‌ హసీనా ఢిల్లీకి చేరుకున్నారు. ఆదివారం రాత్రి 7.15 గంటలకు రాష్ట్రపతి భవన్‌లో మోడీ ప్రమాణ స్వీకారోత్సవం జరగనుంది. ఈ క్రమంలో దేశ రాజధాని ఢిల్లీలో భద్రతను కట్టుదిట్టం చేశారు. స్థానిక పోలీసులతోపాటు ఎన్‌ఎస్‌జీ బలగాలు పలు ప్రాంతాలను పహారా కాస్తున్నాయి.  రాజధానిని నో ఫ్లై జోన్‌గా ప్రకటించారు.