Sonali Phogat Murder Case: హరియాణాకు చెందిన టిక్‌టాక్ స్టార్, భాజపా నేత సోనాలీ ఫోగాట్ హత్య కేసును సీబీఐకు అప్పగిస్తూ గోవా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సంచలనం సృష్టించిన ఈ కేసును తీవ్ర ఒత్తిళ్ల నడుమ సీబీఐ దర్యాప్తునకు అప్పగించాలని నిర్ణయించినట్లు గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ సోమవారం ప్రకటించారు.
ఇదీ జరిగింది
ఈ ఏడాది ఆగస్టు చివరి వారంలో గోవా పర్యటనకు వెళ్లిన సోనాలీ ఫోగాట్ అనుమానాస్పద రీతిలో మరణించారు. ఆమె మొదట గుండెపోటుతో మరణించినట్లు వార్తలు వచ్చాయి. అయితే పోస్టుమార్టం నివేదికలో మాత్రం ఆమె శరీరంపై పలు చోట్ల గాయాలు ఉన్నట్టు తేలింది. దీంతో పోలీసులు విచారణ చేపట్టారు.
ఉత్తర గోవాలో ఆమె బస చేసిన క్లబ్‌లో జరిగిన పార్టీలో సోనాలీ తాగే డ్రింక్‌లో హానికరమైన పదార్థాలు కలిపారని దర్యాప్తులో తేలింది. అదే ఆమె మరణానికి దారితీసిందని గోవా పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో సోనాలీ సహాయకులైన సుధీర్ సంగ్వాన్, సుఖ్వీందర్‌ను పోలీసులు అరెస్టు చేశారు.
సీసీటీవీ ఫుటేజీలు
ఫోగాట్ హత్య కేసులో మరో రెండు సీసీటీవీ దృశ్యాలు బయటపడ్డాయి. ఈ రెండు వీడియోలు ఆమె చనిపోయే రోజు బసచేసిన హొటల్‌లోనివేనని పోలీసులు తెలిపారు. ఓ వీడియోలో సుధీర్ సంగ్వాన్, సుఖ్విందర్.. సోనాలీకి బలవంతంగా డ్రింక్ తాగిస్తున్నారని పోలీసులు తెలిపారు. ఆ వీడియోలో ఆ ఇద్దరు వ్యక్తులు కలిసి సోనాలీకి ఏవో తాగిస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి.
మరో వీడియోలో సుధీర్ సంగ్వాన్, సుఖ్విందర్ ఆమెను బయటకు తీసుకెళ్తున్నారు. మెట్లు ఎక్కేటప్పుడు ఆమె పడిపోయేది.. అయినా ఆగకుండా తీసుకెళ్లారు. అయితే డ్రింక్ తాగే వరకు సోనాలీ మామూలుగానే డ్యాన్స్ చేశారు. డ్రింక్ తాగించిన తర్వాత ఆమె పడిపోయారు.
మాజీ టిక్‌టాక్ స్టార్‌గా, 'బిగ్‌బాస్' టీవీ రియాలిటీ షో ద్వారా ఫోగాట్‌కు పేరొచ్చింది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో హరియాణాలోని ఆదంపుర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి భాజపా అభ్యర్థిగా ఆమె పోటీచేశారు. అయితే ఆ ఎన్నికలో ఆమె ఓడిపోయారు. ఆమె భర్త కొన్నేళ్ల కిందటే మృతి చెందారు. వారికి ఒక కుమార్తె ఉంది.
Also Read: Gyanvapi Masjid Verdict: జ్ఞానవాపి మసీదు కేసులో కోర్టు సంచలన తీర్పు
Also Read: NIA Raids: దేశంలోని 60 ప్రాంతాల్లో NIA మెరుపు దాడులు- గ్యాంగ్‌స్టర్లే లక్ష్యంగా!