President Xi Jinping: చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ తన పదవిని శాశ్వతంగా పదిలం చేసుకునేందుకు పావులు కదుపుతున్నారు. ఐదేళ్లకోసారి బీజింగ్‌లో జరిగే చైనా కమ్యూనిస్టు పార్టీ-సీపీసీ కేంద్ర కమిటీ సమావేశాలు వచ్చే నెలలో జరగనున్నాయి. ఇందులో కీలక రాజ్యాంగ సవరణ చేయనున్నారు.


శాశ్వతంగా


ప్రస్తుత అధ్యక్షుడు జిన్‌పింగ్‌కు మరిన్ని అధికారాలు కట్టబెట్టేలా రాజ్యాంగాన్ని సవరించనున్నారు. దీని ద్వారా రికార్డు స్థాయిలో మూడోసారి దేశాన్ని పాలించేందుకు మరో ఐదేళ్లు లేదా అంతకంటే ఎక్కువకాలం జిన్‌పింగ్‌కు అవకాశం లభించనుంది. త్వరలో జరిగే పార్టీ ప్లీనరీలో ఈ మేరకు రాజ్యాంగ సవరణ చేయనున్నట్లు చైనా కమ్యూనిస్టు పార్టీ ప్రకటన చేసింది. దీంతో జిన్‌పింగ్‌ మరింత శక్తిమంతమైన నేతగా అవతరించారు.


జిన్‌పింగ్‌ సారథ్యంలోని సీపీసీ కేంద్ర కమిటీ గతంలో సాధించిన విజయాల ఆధారంగా మొత్తం పార్టీ, దేశ ప్రజలను ఏకం చేయటంతోపాటు దేశానికి నాయకత్వం వహించాలని సీపీసీ పొలిట్‌ బ్యూరో అభిప్రాయపడింది. 


రెండో వ్యక్తిగా


చైనా దేశాధినేతగా, సీపీసీ ప్రధాన కార్యదర్శిగా జిన్‌పింగ్‌ను మరోసారి కొనసాగించడమంటే భారీ విధానపరమైన మార్పుగా చెప్పాలి. ఎందుకంటే మావో జెడాంగ్‌ తప్ప జిన్‌పింగ్‌కు ముందున్న నేతలందరూ రెండు పర్యాయాల తర్వాత పదవీ విరమణ చేశారు. మావో జెడాంగ్‌ తర్వాత కోర్‌ లీడర్‌ హోదా పొందిన జిన్‌పింగ్‌ ఈ ఏడాది చైనా దేశాధినేతగా, సీపీసీ ప్రధాన కార్యదర్శిగా రెండో పర్యాయం పదవీకాలం పూర్తి చేయనున్నారు.


గతంలో


దేశాధ్యక్షునికి రెండు పర్యాయాల పదవీకాలం పరిమితి వర్తించదని 2018లో చేసిన రాజ్యాంగ సవరణతో జిన్‌పింగ్‌ జీవితకాలం చైనా అధ్యక్షునిగా కొనసాగేందుకు మార్గం సుగమం అయింది. గత తొమ్మిదేళ్ల పదవీకాలంలో జిన్‌పింగ్, చైనా కమ్యూనిస్టు అధినాయకుడు మావో జెడాంగ్‌ తర్వాత అంతటి శక్తిమంతమైన నేతగా ఆవిర్భవించారు. 


ఒకే వేదికపై


మరోవైపు ఉజ్బెకిస్థాన్‌లో జరగనున్న షాంఘై సహకార సంస్థ సదస్సుకు రష్యా, చైనా అధ్యక్షులతో పాటు భారత్‌, పాకిస్థాన్‌ ప్రధాన మంత్రులు హాజరు కానున్నారు. సెప్టెంబర్‌ 15, 16వ తేదీల్లో జరిగే ఈ సమావేశానికి దాదాపు 15 మంది దేశాధినేతలు హాజరుకానున్నారు. కరోనా మహమ్మారి తర్వాత పలు దేశాధినేతలు నేరుగా హాజరవుతోన్న అంతర్జాతీయ సదస్సు ఇదే. అయితే చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో మోదీ ద్వైపాక్షిక చర్చలు జరుపుతారా లేదా అనే విషయంపై స్పష్టత లేదు.


జూన్‌ 2019 తర్వాత షాంఘై కోఆపరేషన్‌ ఆర్గనైజేషన్‌కు దేశాధినేతలు నేరుగా హాజరవుతున్నారు. ఈ సదస్సులో పాల్గొనేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సెప్టెంబర్‌ 14న ఉజ్బెకిస్థాన్‌లోని సమర్‌ఖండ్‌కు వెళ్లనున్నారు. సదస్సులో చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్‌, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌, పాకిస్థాన్‌ ప్రధానమంత్రి షెహబాజ్‌ షరీఫ్‌ వంటి కీలక నేతలు ఒకే వేదికను పంచుకోనున్నారు. 


Also Read: Chhattisgarh Accident: ఆగి ఉన్న ట్రక్కును ఢీకొట్టిన బస్సు- ఏడుగురు మృతి!


Also Read: Gyanvapi Masjid Verdict: జ్ఞానవాపి మసీదు కేసులో నేడు కీలక తీర్పు- 144 సెక్షన్ విధించిన పోలీసులు