NIA Raids: జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) గ్యాంగ్‌స్టర్లు(gangsters), క్రైం సిండికేట్లపై ఉక్కుపాదం మోపింది. దేశంలోని 60 ప్రాంతాల్లో సోమవారం ఎన్ఐఏ అధికారులు పలు గ్యాంగ్‌లు, నేరాల సిండికేట్లపై మెరుపు దాడులు చేశారు.






మెరుపు దాడులు


దేశ రాజధాని దిల్లీతో పాటు నేషనల్ క్యాపిటల్ రీజియన్, హరియాణా, ఉత్తర్‌ప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల్లోని 60 ప్రాంతాల్లో ఎన్ఐఏ అధికారులు ఈ దాడులు జరిపారు. గ్యాంగ్‌లు, నేరాల సిండికేట్లపై సోదాలు జరిపారు. దిల్లీలో నేరాలు సాగిస్తున్న లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్, బంబిహా, నీరజ్ బవానా గ్యాంగులకు చెందిన 10 మంది గ్యాంగ్ స్టర్లపై దిల్లీ స్పెషల్ పోలీసులు ఉపా (Unlawful Activities Prevention Act) కింద కేసులు నమోదు చేసిన తర్వాత ఎన్ఐఏ దర్యాప్తు ఆరంభించింది.


ఆ కేసులో


సిద్ధూ మూసే వాలా హత్య కేసులో గ్యాంగస్టర్లకు, ఉగ్రవాదులకు మధ్య సంబంధాలున్నాయని పంజాబ్ డీజీపీ గౌరవ్ యాదవ్ అన్నారు. నీరజ్ షేరావత్ అలియాస్ నీరజ్ బవానా గ్యాంగ్ ప్రముఖ వ్యక్తులను లక్ష్యంగా చేసుకుందని ఎన్ఐఏ అధికారులు చెప్పారు. నీరజ్ బవానా, లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగులకు మధ్య తగాదాలున్నాయని దర్యాప్తులో తేలింది. దేశంలో గ్యాంగ్‌స్టర్లు జైళ్లలో నుంచి తమ కార్యకలాపాలు సాగిస్తున్నారని ఎన్ఐఏ అధికారుల దర్యాప్తులో వెల్లడైంది.


మూసేవాలా హత్య జరిగిన కొన్ని గంటల్లోనే ఆయన మరణానికి లారెన్స్‌ గ్యాంగ్‌పై ప్రతీకారం తీర్చుకుంటామని నీరజ్ బవానా ప్రకటించారు. లారెన్స్‌, గోల్డీ బ్రార్ సహా పలువురు గ్యాంగ్‌స్టర్లు దేశంలోని పలు జైళ్లతో పాటు, కెనడా, పాకిస్థాన్‌, దుబాయ్‌ వంటి దేశాల నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు దిల్లీ పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. 


సిద్ధూను హత్యచేసిన వారిలో చివరి షూటర్‌ దీపక్‌ ముండీతో పాటు అతని ఇద్దరు సహాయకులను బంగాల్‌లోని ఇండో-నేపాల్ సరిహద్దుల్లో పంజాబ్ పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. నిందితుడు నేపాల్ పారిపోతుండగా పట్టుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో మెుత్తం 35 మంది నిందితుల్లో 23మందిని పోలీసులు అరెస్ట్ చేయగా.. నలుగురు విదేశాల్లో ఉన్నారు. మరో ఆరుగురు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.


సిద్ధూ హత్య


సిద్ధూ మూసేవాలా ఇద్దరు స్నేహితులతో కలిసి మే 29న మాన్సా జిల్లాలోని గ్రామానికి వెళ్తుండగా మార్గ మధ్యలో గుర్తుతెలియని వ్యక్తులు ఆయన్ను తుపాకీతో కాల్చిచంపారు. ఈ ఘటనలో మిగతా ఇద్దరికీ గాయాలయ్యాయి. వీఐపీ సంస్కృతికి తెరదించుతూ రాష్ట్రంలోని ప్రముఖులకు కేటాయించిన పోలీసు భద్రతను ప్రభుత్వం ఉపసంహరించిన మరుసటి రోజే ఈ ఘటన జరిగింది. 


Also Read: Bengaluru: శభాష్ డాక్టర్ సాబ్! సర్జరీ చేయడానికి ఆసుపత్రికి 3 కిమీ పరుగు!


Also Read: President Xi Jinping: శాశ్వత అధ్యక్షుడిగా జిన్‌పింగ్- చైనాలో రాజ్యాంగ సవరణ!