Bengaluru: సిటీల్లో ట్రాఫిక్ కష్టాల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఉదయం ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులు నరకం చూస్తారు. బెంగళూరు లాంటి మెట్రో సిటీలో గంటల తరబడి ట్రాఫిక్‌లో చిక్కుకోవాల్సిందే. అయితే ఇలాంటి పరిస్థితుల్లో తన పేషెంట్‌కు ఆపరేషన్ చేయాలని ఓ డాక్టర్ కారు విడిచిపెట్టి పరుగులు పెట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇదీ జరిగింది
మణిపాల్ హాస్పిటల్‌లో పనిచేసే గ్యాస్ట్రో ఎంటరాలజీ సర్జన్ డాక్టర్ గోవింద్ నంద కుమార్ ఎప్పట్లాగే ఆస్పత్రికి బయలుదేరారు. అయితే ఈరోజు నంద కుమార్.. ఒక మహిళకు గాల్‌బ్లాడర్ శస్త్రచికిత్స చేయాల్సి ఉంది. అయితే మార్గమధ్యంలో విపరీతంగా ట్రాఫిక్ ఉండటంతో ఆయన ముందుకు వెళ్లలేకపోయారు.
పరుగో పరుగు
ట్రాఫిక్ క్లియర్ అవుతుందేమోనని చూసినప్పటికీ ఎలాంటి ఫలితం లేదు. దీంతో కారు దిగి అవతలి రోడ్డుకు చేరుకున్నారు. గూగుల్ మ్యాప్‌లో చూసేసరికి ఆ దూరం 45 నిమిషాలు చూపించింది. ఇక ఆలస్యం చేయకుండా పరుగు పెట్టారు డాక్టర్. 3 కిమీ దూరంలో ఉన్న ఆసుపత్రికి సమయానికి చేరుకున్నారు.
వెంటనే సర్జరీ చేసి సదరు మహిళను అనుకున్న సమయానికే డిశ్చార్జి చేశారు నందకుమార్. అయితే ఆయన ఆసుపత్రికి పరుగులు తీసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అదే ఆలోచన
తాను ఆసుపత్రికి పరుగులు తీసిన వీడియోను నంద కుమార్ కర్ణాటక ముఖ్యమంత్రికి ట్విట్టర్‌లో ట్యాగ్ చేశారు. ఆయన చేసిన పనికి నెటిజన్లు నందకుమార్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు.
Also Read: President Xi Jinping: శాశ్వత అధ్యక్షుడిగా జిన్‌పింగ్- చైనాలో రాజ్యాంగ సవరణ!
Also Read: Chhattisgarh Accident: ఆగి ఉన్న ట్రక్కును ఢీకొట్టిన బస్సు- ఏడుగురు మృతి!