Godavari Water Level: తెలంగాణతో పాటు ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాల వల్ల భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం అంతకంతకు పెరిగిపోతోంది. సోమవారం ఉదయం 8 గంటలకు భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 39.5 అడుగులకు చేరుకుంది. దీంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. నదిలో మొత్తం 7,81,614 క్యూసెక్కుల నీరు ప్రవహిస్తోంది. మరికొన్ని గంటల్లో వరద ప్రవాహం మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయికి చేరుకోవచ్చని కేంద్ర జల వనరుల సంఘం అధికారులు తెలిపారు. గోదావరి నదిలో వరద ప్రవాహం 9 లక్షల క్యూసెక్కులకు చేరుకుంటున్న నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. కొత్తగూడెం, ములుగు సహా గోదావరి పరివాహక ప్రాంతంలోని జిల్లాల కలెక్టర్లు, ఎశ్పీలను అప్రమత్తం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ను సీఎం కేసీఆర్ ఆదేశించారు. 


అధికారులు సన్నద్ధంగా ఉండాలని, సచివాలయంలో తక్షణమే కంట్రోల్ రూం ఏర్పాటు చేయాలని సూచించారు. అంతే కాకుండా పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని తెలిపారు. వరద ప్రవాహం ఎక్కువైతే ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు వీలుగా శిబిరాలను ఏర్పాటు చేసుకోవాలనుకున్నారు. 


ఆగస్టు నెలలో భారీ వరద.. 
ఆగస్టు నెలలో నీటిమట్టం మొదట 49.8 అడుగులకు చేరింది. 43 అడుగుల వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసిన అధికారులు... వరద ప్రవాహం 49.8 అడుగులకు చేరగానే రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఆ ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు. గోదావరి నదిలో ప్రవాహం అంతకంతకూ పెరుగుతూ వచ్చింది. గోదావరి నది వరద ప్రవాహం ఆగస్టు నుంచి క్రమంగా పెరుగుతూ వచ్చింది. భద్రాచలం వద్ద గోదావరి నదిలో 12,11,032 క్యూసెక్కుల వరద ప్రవహించగా.. నీటి మట్టం 53 అడుగులకు చేరగానే అధికారులు మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. గోదావరి వరద మరోసారి పోటెత్తడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. భద్రాచలం, దుమ్ముగూడెం, అశ్వారావు పేట, చర్ల, బూర్గం పాడు, ఏడూళ్ల బయ్యారం, పినపాక, సారపాక తదితర గ్రామాల ప్రజలను సురక్షిత ప్రంతాలకు తరలించారు.  


జులై నెలలో రికార్డు స్థాయిలో ప్రవాహం.. 
జులై నెలలో వారం రోజుప పాటు కురిసి వర్షాలతో వరద ప్రవాహం విపరీతంగా పెరిగిపోయింది. ఎగువ రాష్ట్రాలతో పాటు ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్ నుంచి దిగువకు వస్తున్న వరద నీటి మట్టం భద్రాచలం వద్ద తీవ్ర స్థాయికి చేరింది. 67.9 అడుగులకు భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం చేరింది. 1976 నుంచి గోదావరి నీటిమట్టం భద్రాచలం వద్ద 60 అడుగుల మార్క్‌ను దాటడం ఇది ఎనిమిదోసారి అని అధికారులు తెలిపారు. అదే సమయంలో మూడు దశాబ్దాల తరువాత ఇక్కడ నీటిమట్టం 70 అడుగులకు చేరువైంది. 


అధికంగా 75.6 అడుగులకు నీటిమట్టం.. 
1986లో నీటిమట్టం 75.6 అడుగులకు చేరింది. అధికారులు అప్పుడు అప్రమత్తమై తొలిసారిగా వంతెనపై నుంచి రాకపోకలను నిలిపివేశారు. చరిత్రలో ఇప్పటివరకు రెండు సార్లు మాత్రమే 70 అడుగులు దాటి గోదావరి ప్రవహించింది. జులైలో 67.9 అడుగులకు చేరి, 70 అడుగులకు నీటిమట్టం చేరేలా కనిపిస్తుంది. 75 అడుగులు దాటితే 50 ఏళ్ల రికార్డును అధిగమిస్తుంది. 36 ఏళ్ల తరువాత ఈ స్థాయిలో వరద నీరు ప్రవహిస్తుండడంతో అధికారులు రాకపోకలపై ఆంక్షలు విధించారు.