ఎవరిని పెళ్లి చేసుకోవాలన్నది కొంత మంది పెద్దల మీదే వదిలేస్తారు, వారు చూసిన సంబంధాన్నే చేసుకుంటారు. కొంతమంది మాత్రం తాము ప్రేమించిన లేదా ఎంపిక చేసుకున్న వ్యక్తినే ఎంచుకుంటారు. ఎవరైనా సరే, వారిని పెళ్లికి ముందు కచ్చితంగా కొన్ని ప్రశ్నలు అడగాలి. కొన్ని అంశాల్లో మీకు క్లారిటీ రావడం చాలా అవసరం. జీవితం చాలా విలువైనది. అందులో పెళ్లి ఎవతో ముఖ్యఘట్టం. కాబట్టి జీవిత భాగస్వామి ఎంపిక విషయంలో కచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి. అందుకే ఈ ప్రశ్నలు మీకు కాబోయే భర్త లేదా భార్యను అడగండి. ఈ ప్రశ్నలకు ఆయన/ఆమె చెప్పే సమాధానాలను బట్టి అతడిని/ఆమెను జీవిత భాగస్వామిగా చేసుకోవాలో వద్దో మీరే నిర్ణయించుకోండి.  ఆ ప్రశ్నలు ఇవిగో...


1. మీరు నాలో మంచి భర్తని/భార్యని చూస్తున్నారా? నన్నే ఎందుకు ఎంపిక చేసుకున్నారు?
ఈ ప్రశ్న అడగ్గానే మీకు అతను ఏదో ఒక సమాధానం చెబుతాడు. అతడు‘ఏమో మా ఇంట్లో వాళ్లు చూశారు నాకేం తెలుసు?’, ‘భవిష్యత్తులో చూడాలి మీరు ఎలా ఉంటారో? ఇప్పుడెలా చెబుతా’, ‘నేను అంతగా ఆలోచించలేదు’... ఇలాంటి తేలికపాటి జవాబులు వస్తున్నాయంటే ఆ వ్యక్తి జీవిత భాగస్వామి విషయంలో అంత సీరియస్ గా లేదని అర్థం. ఆమెకు ఇవ్వాల్సిన విలువ కూడా అతడికి తెలియదనే అర్థం. కాబట్టి అలాంటి వ్యక్తితో బంధం కలుపుకోవడం కూడా వేస్టు. 
 
2. పెళ్లి కచ్చితంగా చేసుకోవాలి?
ఈ ప్రశ్నకు అతను ‘కచ్చితంగా చేసుకోవాలి, ఒకరి తోడు ఒకరు అవసరం’ అని సమాధానం చెబితే అతడికి పెళ్లిపై నమ్మకం ఉన్నట్టే. ‘అవసరం లేదు’, ‘పెద్దల కోసం చేసుకుంటున్నా’, ‘పెళ్లికి అంత విలువ లేదు సహజీవనమైనా మంచిదే’ వంటి జవాబులు వస్తే మాత్రం పెళ్లి బంధంపై అతనికి నమ్మకం లేదని అర్థం. ఆ వ్యక్తితో బంధం మీకు కావాలో వద్దో మీరే నిర్ణయించుకోవాలి. 


3. మీకు పిల్లలంటే ఇష్టమా? కావాలనుకుంటున్నారా?
పిల్లలు కావాలనుకునే వారు కుటుంబం పట్ల, బంధాల పట్ల నిబద్ధతతో ఉంటారు.‘పెళ్లయ్యాక పుడతారుగా’, ‘పిల్లలు పుడితే ఎవరు చూసుకుంటారు’, ‘పెళ్లయిన కొన్నేళ్ల వరకు పిల్లలు వద్దు’... ఇలాంటి జవాబులు వస్తే మాత్రం కుటుంబం జీవితం పట్ల అంత ఆసక్తి లేదని అర్థం. పిల్లల్ని ప్రేమించే వాడు కచ్చితంగా కుటుంబ జీవితాన్ని కూడా ప్రేమిస్తాడు. 


4. నాతో మీకు మంచి భవిష్యత్తు ఉందనుకుంటున్నారా?
వివాహం చేసుకోవాలనే వ్యక్తితో నడవడం అంటే భవిష్యత్తును నిర్మించుకోవడమే. వారితో జీవితాంతం కలిసుండాలని అనుకునేవాడే భవిష్యత్తును ముందే ఊహించుకుంటాడు. ‘నీతో నా భవిష్యత్తు ముడిపడి ఉందని నమ్ముతున్నాను, అది మరింత అందంగా ఉంటుందని అనుకుంటున్నాను’ అని చెప్పిన వ్యక్తిని మీరు హాయిగా పెళ్లి చేసుకోవచ్చు. అలాకాకుండా అందరూ పెళ్లి చేసుకోవాలి కనుక నేను కూడా చేసుకుంటున్నా అన్నట్టు మాట్లాడే వ్యక్తులను మాత్రం దూరంగా పెట్టాలి. 


5. మీ స్నేహితులంతా వివాహం చేసుకున్నారా? వారి వివాహ జీవితంపై మీ అభిప్రాయమేంటి?
ఈ ప్రశ్నకు ‘వాడి జీవితం పెళ్లవ్వక ముందే బావుంది, పెళ్లయ్యాక నాశనం అయిపోయాడు’, ‘పెళ్లి అనవసరంగా చేసుకున్నాడు’ లాంటి నెగిటివ్ కామెంట్స్ అతడి నుంచి వస్తే మాత్రం ఆలోచించండి. ‘జీవితంలో కష్టాలు సుఖాలు రెండూ ఉంటాయి, సర్దుకుపోవాలి’ వంటి డైలాగులు వినిపిస్తే మాత్రం చేసుకోవచ్చని అర్థం.   


Also read: అలెగ్జాండర్ ది గ్రేట్ నుంచి క్వీన్ ఎలిజబెత్ వరకు ప్రపంచం మెచ్చిన పాలకులు ఇష్టంగా తాగే పానీయాలు ఇవే


Also read: అతనికి పదిహేను మంది భార్యలు, వందమందికి పైగా పిల్లలు, వీడియో చూడండి