వివాదాల రామ్ గోపాల్ వర్మ (ఆర్జీవీ) మరోసారి టాలీవుడ్‌పై విరుచుకుపడ్డారు. ఈ సారి రెబల్ స్టార్ కృష్ణం రాజు మరణం నేపథ్యంలో ఆయన సినీ ప్రముఖులపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ‘‘మన చావుకు విలువ ఉండాలంటే పోయిన కృష్ణంరాజుగారి లాంటి పెద్ద మనిషికి విలువ ఇద్దాం. కనీసం రెండు రోజులు షూటింగ్ ఆపుదాం. డబ్బు ఎక్కువ ఖర్చు అయిపోతోంది అని నెల రోజులు షూటింగ్ ఆపేసిన పరిశ్రమ మనది’’ ఆర్జీవీ అన్నారు. అంతటితో ఆగకుండా ఆయన కృష్ణ, మురళీమోహన్, బాలకృష్ణ, ప్రభాస్‌ల, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, చిరంజీవిపై కూడా కామెంట్స్ చేశారు. 






‘‘నేను కృష్ణగారికి, మురళీమోహన్‌ గారికి, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, చిరంజీవి, మోహన్, బాలయ్య, ప్రభాస్‌కు ఈ విషయం మీద మనవి చేసేది ఏమిటంటే.. ఇదే దుస్థితి మీలో ఎవరికీ కూడా తప్పదు. ఒక మోహోన్నత కళాకారుడికి ఇవ్వలేని మహోన్నత వీడ్కోలు మన మీద మనమే ఉమ్మేసుకోవడం లాంటిది’’ అని వ్యాఖ్యానించారు.  






మరో ట్వీట్‌లో.. ‘‘భక్త కన్నప్ప, కటకటాల రుద్రయ్య, బొబ్బిలి బ్రహ్మన్న, తాండ్ర పాపారాయుడు లాంటి అత్యంత గొప్ప చిత్రాలని అందించిన మహా నటుడు, గొప్ప నిర్మాత కోసం ఒక్క రోజు కూడా షూటింగ్ ఆపలేని అత్యంత స్వార్ధపూరిత తెలుగు సినిమా పరిశ్రమ కి నా జోహార్లు. సిగ్గు! సిగ్గు!’’ అని ఆర్జీవీ వ్యాఖ్యానించారు. ఆ తర్వాత వరసుగా ట్వీట్లతో ఇండస్ట్రీ పెద్దలపై విమర్శలు కురిపించారు. 






కృష్ణంరాజు ఆదివారం ఉదయం తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. గత వారం రోజులుగా ఆయన ఆరోగ్యం బాలేదని సమాచారం. తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో హైదరాబాద్ నగరంలోని ఏఐజీ ఆస్పత్రిలో జాయిన్ చేశారు. తెల్లవారుజామున సుమారు మూడు గంటల ఇరవై ఐదు నిమిషాలకు ఆయన తుదిశ్వాస  విడిచారు. కృష్ణం రాజు స్వస్థలం ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లాలోని మొగల్తూరు. జనవరి 20, 1940న ఆయన జన్మించారు. చదువు పూర్తి చేశాక... నటన మీద ఆసక్తితో సినిమా ఇండస్ట్రీలోకి వచ్చారు. 'చిలకా గోరింకా' సినిమాతో నటుడిగా పరిచయం అయ్యారు. హీరోగా, ఆ తర్వాత విలన్ గా కూడా నటించారు. సినిమాల్లో అలరించిన ఆయన ఆ తర్వాత రాజకీయాల్లో కూడా సేవలు అందించారు. కృష్ణం రాజు మృతితో తెలుగు చలన చిత్ర పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి.


Also Read: వాసన చూసి రుచి చెప్పేయొచ్చు, కృష్ణం రాజు చేపల పులుసు తయారీ వీడియో వైరల్!


Also Read : కృష్ణం రాజు ఫంక్షన్ కోసం షూటింగ్ క్యాన్సిల్ చేసిన సీనియర్ ఎన్టీఆర్