రెబల్ స్టార్ కృష్ణం రాజు (Krishnam Raju) తెలుగు చలన చిత్ర పరిశ్రమలోకి వచ్చే సమయానికి విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్ - Nandamuri Taraka Rama Rao) అగ్ర కథానాయకులు. ఆయన సంస్కారం ఎంత గొప్పదనేది తొలి సినిమా విడుదలకు ముందు కృష్ణం రాజుకు తెలిసింది. దాంతో ఆయన అంటే ప్రత్యేక అభిమానం, గౌరవం ఏర్పడింది. సీనియర్ ఎన్టీఆర్ కూడా తనపై ఎంతో గౌరవం చూపించే కృష్ణం రాజు కోసం ఒకసారి సినిమా షూటింగ్ క్యాన్సిల్ చేసుకున్నారు. వీళ్ళిద్దరి మధ్య అనుబంధంపై ప్రత్యేక కథనం ఇది.
కృష్ణవేణి శతదినోత్సవ వేడుకలో
బసవతారకం సమేత ఎన్టీఆర్!
నటుడిగా, కథానాయకుడిగా కృష్ణం రాజుకు తెలుగు చిత్రసీమలో జన్మనిచ్చిన సినిమా 'చిలకా గోరింక'. అయితే... కథానాయకుడిగా ఆయనకు పునర్జన్మ ఇచ్చిన సినిమా 'కృష్ణవేణి'. నిర్మాతగా ఆయనకు అది తొలి సినిమా కూడా! హీరోగా తొలి సినిమా ఫ్లాప్ కావడంతో ఆ తర్వాత సుమారు 60 సినిమాల్లో విలన్, సపోర్టింగ్ ఆర్టిస్ట్ రోల్స్ చేశారు కృష్ణం రాజు. మళ్ళీ 'కృష్ణవేణి'తో కథానాయకుడిగా మారారు. అది ఘన విజయం సాధించింది. ఆ సినిమా శతదినోత్సవ వేడుకకు ఎన్టీఆర్, బసవ తారకం దంపతులు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. అందుకోసం, ఆయన షూటింగ్ క్యాన్సిల్ చేయడం విశేషం.
సొంత ఖర్చులతో ఫంక్షన్‌కు వెళ్లిన ఎన్టీఆర్
హైదరాబాద్ శాంతి థియేటర్‌లో 'కృష్ణవేణి' వంద రోజుల వేడుక జరిగింది. దానికి ముఖ్య అతిథిగా ఎన్టీఆర్ వస్తే బావుంటుందని... ఆయన్ను ఆహ్వానించడానికి కృష్ణం రాజు, ఆయన సోదరుడు వెళ్లారు. అయితే... ఫంక్షన్ చేయాలనుకున్న రోజు ఎన్టీఆర్ షెడ్యూల్ ఖాళీగా లేదు. ఆయన 'తాతమ్మ కల' షూటింగ్ ఉంది. పైగా, భానుమతితో కాంబినేషన్ సీన్. ఆవిడ చాలా బిజీ ఆర్టిస్ట్. అందువల్ల, ఎన్టీఆర్ రావడం కష్టమని ఆఫీసులో కృష్ణం రాజును కలిసిన దర్శక, రచయితలు చెప్పారు.
ఎన్టీఆర్‌ను కలిసిన కృష్ణం రాజు ఫంక్షన్ గురించి చెబితే... 'సాయంత్రం ఒకసారి ఫోన్ చేయండి' అని సమాధానం వచ్చింది. 'ఫోన్ ఎందుకండీ? మేమే వచ్చి కలుస్తాం' అని చెప్పి కృష్ణం రాజు సెలవు తీసుకున్నారు. సాయంత్రం వెళ్లేసరికి భానుమతితో మాట్లాడి షూటింగ్ కోసం మరో డేట్ ఫిక్స్ చేయమని, తాను 'కృష్ణవేణి' వందరోజుల వేడుకకు హాజరవుతానని ఎన్టీఆర్ చెప్పిన విషయం తెలిసింది. ఆ తర్వాత సతీసమేతంగా వస్తే బావుంటుందని మరో రిక్వెస్ట్ చేస్తే... అందుకూ ఎన్టీఆర్ సరేనని అన్నారు.
కృష్ణం రాజు టికెట్స్ తీస్తానని అంటే వద్దని చెప్పి సొంత డబ్బులతో టికెట్స్ తీసుకుని చెన్నై నుంచి హైదరాబాద్ వచ్చారు ఎన్టీఆర్. 'కృష్ణవేణి' వేడుకలో ఎన్టీఆర్ దంపతులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
కృష్ణం రాజు తండ్రికి ఆప్యాయంగా వడ్డించిన ఎన్టీఆర్
హీరోగా కృష్ణం రాజు తొలి సినిమా 'చిలకా గోరింక' ఫస్ట్ షెడ్యూల్ హైదరాబాద్‌లో జరిగింది. అందులో ఎస్వీ రంగారావు కూడా నటించారు. ఫస్ట్ షెడ్యూల్‌లో కృష్ణం రాజు నటన, మంచి ప్రవర్తన చూసిన ఆయన చెన్నై వెళ్లిన తర్వాత ఎన్టీఆర్‌కు చెప్పారు. అలా కృష్ణం రాజు హీరో కాక ముందే ఆయన గురించి మహా నటుడికి తెలిసింది.
Also Read : సినిమాల్లో రాజుగారి అబ్బాయ్ విలన్ - హీరోగా వరుస విజయాలు - కృష్ణం రాజు కెరీర్‌లో ఇదీ స్పెషల్
వాహినీ స్టూడియోలో 'శ్రీకృష్ణ తులాభారం' చిత్రీకరణ జరుగుతోంది. ఆ పక్కనే 'చిలకా గోరింక' షూటింగ్ కూడా! ఎన్టీఆర్ సినిమా చిత్రీకరణ జరుగుతుందని తెలుసుకున్న కృష్ణం రాజు అక్కడికి వెళ్లారు. ఆల్రెడీ ఎస్వీఆర్ చెప్పడంతో స్టార్ హీరో నుంచి సాదర స్వాగతం లభించింది. అయితే, కాసేపటి తర్వాత కృష్ణం రాజు అక్కడి నుంచి వెళ్లాల్సిన పరిస్థితి. ట్రైయిన్‌కు వస్తున్న తండ్రిని రిసీవ్ చేసుకోవాలి. ఆ విషయం చెబితే... 'మీ తండ్రి గారిని మా దగ్గరకు తీసుకురండి' అన్నారు.
కృష్ణం రాజు తండ్రికి సినిమా వాళ్లంటే సదాభిప్రాయం లేదు. 'మీరు ఏం ఆందోళన చెందకండి. మీ అబ్బాయి పైకి వస్తాడు. మేమున్నాం' అని ఆయనకు ఎన్టీఆర్ ధైర్యం చెప్పారు. అంతకు ముందు తన దగ్గరకు వచ్చిన తండ్రీ తనయులను ఆప్యాయంగా స్వాగతం పలికారు. దగ్గరుండి వడ్డించి మరీ భోజనం పెట్టారు. ఎన్టీఆర్‌ను కలిశాక... సినిమా వాళ్ళపై కృష్ణం రాజు తండ్రి అభిప్రాయం మారింది.
Also Read : కృష్ణం రాజు రేర్ ఫోటోస్ - అప్పట్లో ఎలా ఉండేవారో చూడండి