రొమ్ము క్యాన్సర్ ఎప్పుడు ఎవరికి వస్తుందో చెప్పడం కష్టం. ప్రపంచ వ్యాప్తంగా అధిక శాతం మంది మహిళలను ఇబ్బంది పెడుతున్న క్యాన్సర్ ఇదే. భవిష్యత్తులో రొమ్ము క్యాన్సర్ రాకుండా ఉండాలంటే ముందుగానే మీరు దానికి నివారణ మార్గాలను వెతుక్కోవాలి. పెద్దలు ఎప్పుడో చెప్పారు కదా ‘చికిత్స కంటే నివారణ ఉత్తమం’ అని. మహిళలు తాము తినే ఆహారంలో కచ్చితంగా కొన్ని రకాల పదార్థాలు ఉండేలా చూసుకోవాలి. వీటిని రోజూ తినడం వల్ల రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశం తగ్గుతుంది. కుటుంబం కోసమే కాదు, తన ఆరోగ్యం కూడా కోసం కూడా స్త్రీలు కొంత సమయాన్ని కేటాయించుకోవాలి. రొమ్ము క్యాన్సర్ నివారించే ఈ ఉత్తమ ఆహారాలను ప్రత్యేకంగా తినాలి. 


పసుపు: మన పోపుల డబ్బాలో కచ్చితంగా కనిపించే సాంప్రదాయిక మసాలా ఇది. పసుపు శక్తిని అంతా ఇంతా కాదె. పసుపులోని కర్కుమిన్ అనే సమ్మేళనం మీ శరీరాన్ని దీర్ఘకాలిక వ్యాధుల నుండి రక్షించడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఈ మసాలాలో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు క్యాన్సర్‌ను నివారిస్తాయి.


సిట్రస్ ఫ్రూట్స్: విటమిన్ సి, ఫోలేట్, కెరోటినాయిడ్స్ , యాంటీ ఆక్సిడెంట్లతో నిండిన సిట్రస్ పండ్లను కచ్చితంగా మీ డైట్లో చేర్చుకోండి. ఇవి రొమ్ము క్యాన్సర్‌ను ఎదుర్కోవడంలో శక్తివంతంగా పనిచేస్తాయి. వీటిలోని యాంటీ క్యాన్సర్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు మీ ఆరోగ్యాన్ని కాపాడతాయి. చిరుతిండిగా నారింజ, నిమ్మకాయలు, స్ట్రాబెర్రీలు వంటివి ఎంపిక చేసుకుని తినండి. 


బెర్రీస్: బ్లూబెర్రీస్, బ్లాక్‌బెర్రీస్, రాస్ప్‌బెర్రీస్, స్ట్రాబెర్రీస్ వంటి బెర్రీలలో క్యాన్సర్ నిరోధక ప్రభావాలు పుష్కలంగా ఉంటాయి. అవి తింటే సహజంగానే రొమ్ము క్యాన్సర్‌ను రాకుండా అడ్డుకుంటాయి.  ఇవి యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్ గుణాలతో నిండి ఉన్నాయి. మీకు ఏదైనా తినాలనపించినప్పుడు ఈ పుల్లటి పండ్లను నోట్లో వేసుకోండి. 


కొవ్వున్న చేప: కొవ్వు పట్టిన చేపలలో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, సెలీనియం, యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడానికి పుష్కలమైన పోషకాలు ఇవి. సాల్మన్, సార్డినెస్, ఇతర కొవ్వు చేపలను వారానికి రెండు సార్లయినా తినడం మంచిది. అదనంగా, అవి బరువు తగ్గడానికి సహకరిస్తాయి కూడా.


దానిమ్మ: దానిమ్మను రోజూ తినడం వల్ల రొమ్ము క్యాన్సర్ బారిన పడే ప్రమాదం నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవచ్చు. వీటిలో ఎల్లాగిటానిన్స్ అనే ఫైటో కెమికల్ ఉంటుంది. ఇది యాంటీఆక్సిడెంట్ గుణాలను కలిగి ఉంటుంది. 


ఆకుపచ్చ కూరగాయలు: ఆకుపచ్చని రంగు కూరగాయలు తినడం వల్ల కూడా ఎంతో ఆరోగ్యం. పాలకూర, ఆవాలు వేస్తే మొలిచే ఆకుకూర, మెంతి కూర వంటివి యాంటీ ఆక్సిడెంట్లకు గొప్ప మూలాలు. ఈ యాంటీ ఆక్సిడెంట్లు రక్తంలోని టాక్సిన్లను బయటకు పంపుతాయి. బ్రకోలీ, కాలీఫ్లవర్, క్యాబేజీ వంటివి కూడా ఆకుకూరల జాబితాలోకే వస్తాయి. వీటిని కూడా తినడం వల్ల రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశాలు తగ్గిపోతాయి. 


అల్లియం కూరగాయలు: వెల్లుల్లి, స్ప్రింగ్ ఆనియన్స్, ఉల్లిపాయలను అల్లియం వెజ్జీస్ అంటారు. వీటిలో ఫ్లేవనాయిడ్లు, యాంటీఆక్సిడెంట్లు ,  విటమిన్ సి పుష్కలంగా ఉన్నాయి. మీరు వీటిని అన్ని వంటలలో చేర్చడం ద్వారా క్రమం తప్పకుండా తీసుకోవచ్చు. అవి రొమ్ము క్యాన్సర్ నుండి రక్షించడంలో ప్రభావవంతంగా ఉంటాయి.


Also read: కరోనా కారణంగా ప్రతి 44 సెకన్లకు ఒకరి మరణం, హెచ్చరిస్తున్న ప్రపంచ ఆరోగ్య సంస్థ


Also read: అతనికి పదిహేను మంది భార్యలు, వందమందికి పైగా పిల్లలు, వీడియో చూడండి





















గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.