కరోనా కేసులు తగ్గముఖం పడుతున్నాయి, అలాగని అది అంతరించినట్టు కాదు అని హెచ్చరిస్తోంది ప్రపంచ ఆరోగ్య సంస్థ. చాలా దేశాల్లోని ప్రజలు ఇప్పుడు కోవిడ్ 19ను తేలికగా తీసుకుంటున్నారని, నిజానికి అదే గతంలో కూడా కొంపముంచిందని చెప్పింది. ఇప్పటికీ ప్రపంచ వ్యాప్తంగా ప్రతి 44 సెకన్లకు ఒక కోవిడ్ మరణం సంభవిస్తున్నట్టు తన గణాంకాలు చెబుతున్నాయని, అందుకే జాగ్రత్తగా ఉండమని ప్రజలకు హెచ్చరిస్తోంది. గత వారంలో రిపోర్టును ప్రస్తావిస్తూ 42 లక్షల మంది కొత్తగా కరోనా బారిన పడ్డారని, వారిలో 13,700 మంది మరణించారని చెప్పింది. గతంతో పోలిస్తే పరిస్థితి మెరుగైనట్టేనని, కానీ అలసత్వం వహిస్తే మళ్లీ కేసులు పెరిగిపోతాయని వివరిస్తోంది. ఫిబ్రవరితో పోలిస్తే మరణాలు 80 శాతానికి పైగా తగ్గాయని చెప్పింది. కరోనా వల్ల కలిగే మరణాలలో చాలా వరకు నివారించ గలిగేవని తెలిపింది. 


ప్రపంచ ఆరోగ్య సంస్థ తన నివేదికలో ఆగ్నేయాసియా, యూరప్, మిడిల్ ఈస్ట్ దేశాల్లో కరోనా మరణాలు బాగా తగ్గాయని, అయితే ఆఫ్రికా, అమెరికా, పశ్చిమ పసిఫిక్ ప్రాంతాల్లో మాత్రం పెరిగాయని తెలిపింది. కరోనా వైరస్ ఇంకా మ్యుటేషన్లు చెందుతూనే ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలని, దానిపై స్థిరమైన నిఘా అవసరం అని అభిప్రాయపడింది. పరిస్థితులకు తగ్గట్టు ఎప్పటికప్పుడు రోగనిర్ధారణ, చికిత్సలు తీసుకుంటూనే, అందరూ వ్యాక్సిన్లు వేసుకుంటే కరోనా  కేసుల్లో తగ్గుదల ఉంటుంది. 


ఆహార చిట్కాలు...
గతంలో కూడా ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆహారపరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలిపింది. చేతులు పరిశుభ్రంగా కడుక్కున్నాకే వంటు చేయమని సూచించింద. అలాగే పండ్లు తప్ప మిగతా ఆహారాలు పచ్చివి తినడం మానేయాలి. కొంతమంది ఆకుకూరలు, కొన్ని రకాల కూరగాయలను పచ్చివే తినడం, వాటిని జ్యూస్ చేసుకుని తాగడం చేస్తుంటారు. కరోనా వైరస్ వచ్చాక అవి చేయోద్దని సూచించింది ప్రపంచ ఆరోగ్య సంస్థ. అన్నింటికన్నా ముఖ్యంగా మాంసాహారం కచ్చితంగా తినమని చెప్పింది. కాకపోతే బాగా ఉడికించాకే తినమని, సగం ఉడికిన మాంసాన్ని తినవద్దని చెప్పింది. మాంసాహారం తినడం వల్ల శరీరానికి ప్రోటీన్లు పుష్కలంగా అందుతాయి. దీని వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. 


Also read: అతనికి పదిహేను మంది భార్యలు, వందమందికి పైగా పిల్లలు, వీడియో చూడండి



Also read: మనిషి ఆయుష్షును పెంచే శక్తి ద్రాక్షకుంది, తేల్చిన తాజా అధ్యయనం



















గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.