US Open 2022 Final Highlights: యూఎస్ ఓపెన్ లో వరుసగా మూడో ఏడాది సంచలనం నమోదైంది. గత రెండేళ్లు దిగ్గజాలను వెనక్కి టైటిల్స్ సాధిస్తున్న కుర్రాళ్లు ఈ ఏడాది మరో టైటిల్ దక్కించుకున్నారు. స్పెయిన్‌ యువ సంచలనం 19 ఏళ్ల కార్లోస్ అల్కరాజ్‌ యూఎస్ ఓపెన్ 2022 విజేతగా అవతరించాడు. దాదాపు మూడున్నర గంటలపాటు సాగిన హోరాహోరీ పోరులో 6-4, 2-6, 7-6 (7-1), 6-3 తేడాతో కాస్పర్ రూడ్‌పై అలర్కరాజ్ గెలుపొందాడు. తద్వారా కెరీర్ లో తొలి గ్రాండ్ స్లామ్ టైటిల్ తన ఖాతాలో వేసుకున్నాడు. దాంతోపాటు ప్రపంచ నంబర్‌వన్‌ ర్యాంకును సొంతం చేసుకున్నాడు అల్కరాజ్.


హోరాహోరీగా యువకుల పోరు
యూఎస్ ఓపెన్ పురుషుల సింగిల్స్ ఫైనల్ మ్యాచ్ ఆదివారం అర్థరాత్రి దాటిన తర్వాత 1.30 గంటలకు ప్రారంభమైంది. స్పెయిన్‌ యువ సంచలనం అల్కరాజ్, 23 ఏళ్ల నార్వే ఆటగాడు రూడ్ ఫైనల్లో తలపడ్డారు. తొలి సెట్ ను అల్కరాజ్  6-4 నెగ్గి ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచాడు. రెండోసెట్‌లో నార్వే ప్లేయర్ రూడ్‌ విజృంభించి, 4-2తో అధిక్యంలో నిలిచాడు. 6-2 తేడాతో ఆ సెట్‌ను నెగ్గి సమం చేశాడు. మరో ఛాన్స్ ఇవ్వకూడదని భావించిన రూడ్ ఆధిక్యం ప్రదర్శించగా.. అల్కరాజ్ 6-6 తో స్కోర్ సమం చేయడంతో ఈ సెట్‌ టైబ్రేకర్‌కు మళ్లింది. చివరగా 7-1 (7-6) తేడాతో అల్కరాజ్‌ మూడో సెట్ నెగ్గాడు. కీలకమైన నాలుగో సెట్‌లో రూడ్‌కు అల్కరాజ్ ఏ మాత్రం ఛాన్స్ ఇవ్వలేదు. 6-3 తేడాతో నాలుగో సెట్ నెగ్గి కెరీర్‌లో తొలిసారి యూఎస్‌ ఓపెన్ టైటిల్ సాధించాడు. మరోవైపు కెరీర్ లో తొలి గ్రాండ్ స్లామ్ నెగ్గిన అల్కరాజ్‌ను టెన్నిస్ పురుషుల సింగిల్స్ లో నెంబర్ వన్ ర్యాంకు వరించింది. 






అతిపిన్న వయసులో గ్రాండ్ స్లామ్ విజేత.. నెంబర్ వన్ ర్యాంక్
యూఎస్ ఓపెన్ టైటిల్ నెగ్గిన అల్కరాజ్ అతిపిన్న వయసులో గ్రాండ్ స్లామ్ నెగ్గిన ఆటగాడిగా నిలిచాడు. 17 ఏళ్ల కిందట స్పెయిన్‌కే చెందిన రఫెల్ నాదల్ 19 ఏళ్ల వయసులో తొలి గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ సాధించాడు. కెరీర్‌లో 22 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ నెగ్గిన నాదల్.. 2005లో ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ నెగ్గాడు. అతిపిన్న వయసులో గ్రాండ్ స్లామ్ నెగ్గిన నాదల్ రికార్డును మరో స్పెయిన్ కుర్రాడు అల్కరాజ్ సమం చేశాడు. దాంతోపాటు అతిపిన్న వయసులో పురుషుల సింగిల్స్ లో నెంబర్ వన్ ర్యాంక్ కైవసం చేసుకున్న ఆటగాడిగా నిలిచాడు అల్కరాజ్.






రూడ్‌ కు మరోసారి నిరాశే..
ఫామ్‌లో ఉన్న ప్రపంచ ఏడో ర్యాంకర్‌ రూడ్‌ ఈ ఏడాది రెండో గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలో తుదిపోరుకు అర్హత సాధించాడు. కానీ మరోసారి రన్నరప్ తోనే సరిపెట్టుకున్నాడు. ఇప్పటికే ఫ్రెంచ్‌ ఓపెన్‌లో రన్నరప్‌గా నిలిచిన అతను.. తాజాగా జరిగిన యూఎస్‌ ఓపెన్‌ 2022లో ఫైనల్లో అల్కరాజ్ చేతిలో 4 సెట్ల పోరులో ఓటమిచెందాడు. తొలి గ్రాండ్ స్లామ్ కల నెరవేరలేదు.