Social Media New Rules in Singapore:


డిలీట్ చేయాల్సిందే..


సోషల్ మీడియా లేకుండా లైఫ్ లీడ్ చేయలేని పరిస్థితి వచ్చేసింది. ప్రతి చిన్న విషయాన్ని అందులో షేర్ చేసుకోవటం అందరికీ అలవాటైపోయింది. వాట్సప్,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్..ఇలా ఇంకెన్నో యాప్స్‌ అందుబాటులోకి వచ్చాయి. వీటి వల్ల కమ్యూనికేషన్ పెరుగుతోందని చెప్పుకుంటున్నా...వదంతులు వ్యాప్తి చెందడానికీ ఇవే కారణమవుతున్నాయి. ఒక్కోసారి ప్రాణాలు తీసేంత స్థాయిలో ప్రమాదకరంగా మారుతున్నాయి. ఈ ముప్పు తగ్గించేందుకు సింగపూర్ పార్లమెంట్ కొత్త చట్టం తీసుకొచ్చింది. సోషల్ మీడియాలో తప్పుడు సమాచారం వ్యాప్తి చెందకుండా అడ్డుకునే అస్త్రాన్ని ప్రయోగించనుంది. ఈ చట్ట ప్రకారం సమాజానికి చేటు చేసే కంటెంట్‌ లేదా తప్పుడు కంటెంట్‌ సోషల్ మీడియాలో పోస్ట్ చేయకూడదు. ఒకవేళ చేసినా..దాన్ని వెంటనే పసిగట్టి బ్లాక్ చేయాల్సిందే. ఒకవేళ ఆ కంటెంట్‌ను తొలగించడానికి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ అంగీకరించకపోతే...అప్పుడు సింగపూర్ ప్రభుత్వం ఆ బాధ్యతను Infocomm Media Development Authority (IMDA)కి అప్పగిస్తుంది. కంటెంట్‌ను ఎలా బ్లాక్ చేయాలో ఈ సంస్థే చూసుకుంటుంది. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ ఏవైనా సరే...ప్రభుత్వ నిబంధనలు లోబడి పని చేయాలని స్పష్టం చేసింది సింగపూర్. పార్లమెంట్‌లోనూ ఇదే విషయాన్ని పలువురు మంత్రులు స్పష్టం చేశారు. సమాజానికి హాని కలిగించే సమాచారం ఏదీ వాటిలో కనిపించకూడదని తేల్చిచెప్పారు. ప్రభుత్వం చెప్పినా...పట్టించుకోకుండా, అలాంటి కంటెంట్‌ను తొలగించకుండా నిర్లక్ష్యం వహిస్తే భారీ జరిమానా విధిస్తామని సింగపూర్ పార్లమెంట్ ప్రకటించింది. ఇది దాదాపు 1 మిలియన్ సింగపూర్ డాలర్ల వరకూ ఉంటుంది. ఇంత భారీ మొత్తం చెల్లించకుండా ఉండాలంటే...నిబంధనల మేరకు నడుచుకోవాలని హెచ్చరించింది. 


ఆన్‌లైన్ సెక్యూరిటీ బిల్..


ఈ కొత్త చట్టం ప్రకారం...ఏ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ అయినా కంటెంట్‌ను తొలగించేందుకు అంగీకరించకపోతే...సర్వీస్ ప్రొవైడర్ కంపెనీ అయిన IMDA రంగంలోకి దిగుతుంది. యూజర్స్‌కు పలు సూచనలు చేస్తూ వెంటనే ఆ కంటెంట్‌ను బ్లాక్ చేసేస్తుంది. ఈ చట్టంతో పాటు అక్టోబర్ 3న సింగపూర్ Online Security బిల్‌నూ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టింది. అక్కడ అలాంటి బిల్‌ ప్రవేశపెట్టడం ఇదే తొలిసారి. సింగూపర్ ప్రజలకు హాని కలిగించే కంటెంట్ ఏదైనా దాన్ని నియంత్రించే సర్వాధికారాలు IMDAకి ఉంటాయని తేల్చి చెప్పింది ప్రభుత్వం. 


ఇండియాలోనూ..? 


ఇక భారత్‌లోనూ సోషల్ మీడియాకు కేంద్రం షాక్ ఇవ్వనుంది. ఇకపై గూగుల్, ఫేస్‌బుక్, ట్విటర్‌ సహా అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌ జాగ్రత్తగా ఉండాల్సిందే. కేంద్రం చెప్పిన, అభ్యంతరకరమైన కంటెంట్ ఏదైనా ఉంటే వెంటనే దాన్ని డిలీట్ చేసేలా ఐటీ చట్టంలో 
సవరణలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇలాంటి కంటెంట్‌ను "ఫ్లాగ్డ్‌"గా పిలుస్తారు. ఈ నిబంధనలు అతిక్రమిస్తే చట్ట పరంగా కఠిన చర్యలు తీసుకోనుంది. అంతే కాకుండా, ఇంటర్మీడియరీ స్టేటస్‌లో భాగంగా..ఆయా సంస్థలకు లభించే రక్షణను కూడా కోల్పోక తప్పదని సమాచారం. 
ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఇలాంటి చట్టాలతో భావవ్యక్తీకరణ స్వేచ్ఛకు సంకెళ్లు వేస్తున్నారన్న వాదనలు వినిపిస్తున్నప్పటికీ...తప్పుడు సమాచారం ప్రజల్లో వెళ్లకుండా అడ్డుకునేందుకు ఇలాంటివి తప్పవని ప్రభుత్వాలు స్పష్టం చేస్తున్నాయి. 


Also Read: US Mid-Term Polls: అగ్రరాజ్యంలో రికార్డు- 23 ఏళ్లకే చట్టసభకు ఎన్నికైన భారతీయ అమెరికన్!