Smriti Irani Daughter Illegal Bar Row:
ఇదో ద్వేషపూరిత చర్య..
కేంద్రమంత్రి స్మృతి ఇరానీ కాంగ్రెస్ పార్టీకి లీగల్ నోటీసులు పంపారు. తన కూతురు గోవాలో ఇల్లీగల్‌గా బార్ నడుపుతున్నారన్న ఆరోపణలను ఖండిస్తూ...ఈ నోటీసులు పంపించారు. కాంగ్రెస్ నేతలు పవన్ ఖేరా, జైరాం రమేశ్, నెట్టా డిసౌజాకు ఈ నోటీసులు అందాయి. నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్‌పై విమర్శలు చేసినందుకే, ఈ కొత్త వివాదం తెరపైకి తీసుకొచ్చారని స్మృతి ఇరానీ ఆరోపించారు. ఇదో "ద్వేషపూరిత" చర్య అని మండిపడ్డారు. స్మృతి ఇరానీ తరపు న్యాయవాది ఆయా కాంగ్రెస్ నేతలకు నోటీసులు పంపినట్టు వెల్లడించారు. " మా క్లైంట్ చేసినఆరోపణలన్నీ అవాస్తవం. అరకొర సమాచారంతో చేసిన నిరాధార ఆరోపణలవి. ఎలాంటి వెరిఫికేషన్ లేకుండానే పబ్లిక్‌గా ఆ తప్పుడు వివరాలను బయట పెట్టారు. ఇది కచ్చితంగా కుట్రే. కేవలం ప్రతిష్ఠను దిగజార్చేందుకు చేసిన చర్యే" అని ఆ నోటీసులో పేర్కొన్నారు న్యాయవాది. "ఓ కేంద్ర మంత్రిపై ఇలాంటి ఆరోపణలు చేసి తన పబ్లిక్ లైఫ్‌కు భంగం కలిగించారు. ఆమె నిజాయతీని కించపరచటమే కాకుండా ఆమె కూతురుని కూడా అవమానించారు. ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం ఇది తీవ్రమైన నేరం. వీటికి పరిహారం చెల్లించాల్సిందే" అని అందులో స్పష్టం చేశారు. లిఖిత పూర్వకంగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
.
ఇదీ వివాదం..
కేంద్రమంత్రి స్మృతి ఇరానీ కూతురు గోవాలో చట్ట విరుద్ధంగా ఓ బార్‌ను నడుపుతున్నారంటూ కాంగ్రెస్ ఆరోపించింది. స్మృతి ఇరానీని వెంటనే
మంత్రి పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేసింది. అయితే ఈ ఆరోపణలను ఆమె కూతురు తరపున న్యాయవాది కొట్టిపారేశారు. కాంగ్రెస్ చెప్పిన పేరుతో గోవాలో ఎలాంటి రెస్టారెంట్ లేదని, ఆమె యజమాని కాదని స్పష్టం చేశారు. కేవలం ఆమె ప్రతిష్ఠకు భంగం కలిగించాలనే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని వెల్లడించారు. అప్పటికే కాంగ్రెస్ నేతలు ఈ విషయమై వరుస ట్వీట్‌లు చేశారు. గోవాలో ఉన్న ఆ బార్‌కు షోకాజ్ నోటీసులు ఇచ్చిన కాపీలనూ షేర్ చేశారు. ఈ నోటీసులు ఇచ్చిన అధికారిపై ఒత్తిడి తీసుకొచ్చి వేరే చోటకు బదిలీ చేశారనీ ఆరోపించారు. అయితే స్మృతి ఇరానీ కూతురు తరపున న్యాయవాది మాత్రం తమకు ఎలాంటి నోటీసులు అందలేదని తెలిపారు. "మా క్లైంట్‌కు 18 ఏళ్లు. ఆమె చెఫ్‌గా ఇప్పుడిప్పుడే రాణిస్తోంది. రకరకాల రెస్టారెంట్లలో పని చేస్తోంది. ఇలాంటి ఆరోపణల వల్ల ఆమె భయాందోళనలకు గురి అవుతుంది" అని వ్యాఖ్యానించారు. నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. ఆమెపై తీవ్ర స్థాయిలో దుష్ప్రచారం చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు.
Also Read: Meghalaya: BJP నేత ఫాంహౌస్‌లో సెక్స్ రాకెట్- 73 మంది అరెస్ట్!