The Kerala Story: 


సూరత్‌లో ఆఫర్..


The Kerala Story సినిమా దేశవ్యాప్తంగా వివాదాస్పదమవుతోంది. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాలు సపోర్ట్ చేస్తుండగా..మిగతా రాష్ట్రాలు మాత్రం వ్యతిరేకిస్తున్నాయి. తమిళనాడు, కేరళలో దీనిపై పెద్ద ఎత్తున నిరసనలు జరుగుతున్నాయి. కానీ గుజరాత్‌లో మాత్రం అంతకంతకూ మద్దతు పెరుగుతోంది. ఓ టీ షాప్ ఓనర్ అదిరిపోయే ఆఫర్ ఇచ్చాడు. కేరళ స్టోరీ సినిమా టికెట్‌లు చూపించిన వారికి ఫ్రీగా టీ, కాఫీలు ఇస్తున్నాడు. సూరత్‌లోని వేసు ఏరియాలో ఉంది ఈ టీషాప్. ఆఫర్ ఇవ్వడమే కాదు. షాప్ ముందు కేరళ స్టోరీ పోస్టర్లు కూడా అంటించారు. టికెట్‌ చూపించిన వాళ్లకు ఫ్రీగా టీ, కాఫీ ఇస్తామంటూ పోస్టర్లు పెట్టాడు. సినిమా చూసిన వాళ్లు టికెట్‌లు చూపించి ఫ్రీగా టీ, కాఫీలు తాగి వెళ్తున్నారు. 


"టీ షాప్‌కి వచ్చిన వాళ్లు కేరళ స్టోరీ మూవీ టికెట్‌లు చూపిస్తే చాలు. ఉచితంగా టీ, కాఫీలు ఇచ్చేస్తాం. మే 15వ తేదీ వరకూ ఈ ఆఫర్‌ ఉంటుంది"


- టీ షాప్ ఓనర్ 


నడ్డా రివ్యూ..


దేశవ్యాప్తంగా వివాదాస్పదమవుతున్న The Kerala Story సినిమాను బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా బెంగళూరులోని థియేటర్‌లో చూశారు. రివ్యూ కూడా ఇచ్చారు. విషపూరితమైన ఉగ్రవాదంలో మరో కోణాన్ని కళ్లకు కట్టినట్టు చూపించారని ప్రశంసించారు. ఇప్పటి వరకూ ఆయుధాలు, బాంబులతో కూడిన ఉగ్రవాదాన్నే చూశామని...ఈ సినిమా మరో కోణంలో టెర్రరిజాన్ని పరిచయం చేసిందని కితాబునిచ్చారు. ఉగ్రవాదాన్ని ఏ రాష్ట్రానికో, మతానికో ఆపాదించాల్సిన పని లేదని తేల్చి చెప్పారు. సొసైటీకి ఈ సినిమా ఓ హెచ్చరిక అని స్పష్టం చేశారు. 


"తుపాకుల మోతలు, బాంబు పేలుళ్లు, ఆత్మాహుతి దాడులు..ఇలా ఎన్నో ఉగ్రచర్యల్ని చూశాం. కానీ అంత కన్నా ప్రమాదకరమైన, విషపూరితమైన ఉగ్రవాదాన్ని ఈ సినిమాలో చూపించారు. బాంబులు, ఆయుధాలు లేని ఉగ్రవాదాన్ని కళ్లకు కట్టారు. ఉగ్రవాదులు సమాజంపై ఎంత విషం చిమ్ముతున్నారో వివరించారు. ఈ ఉగ్రవాదాన్ని ఏ ఒక్క రాష్ట్రానికో, మతానికో పరిమితం చేయలేం. యువత వాళ్ల వలలో పడి ఎలా దారి తప్పుతోందో ఈ సినిమాలో చాలా స్పష్టంగా చూపించారు. అలా దారి తప్పకూడదని హెచ్చరించడమే ఈ సినిమా ఉద్దేశం. ఇది సినిమానే కావచ్చు. కానీ ఉగ్రవాదానికి సంబంధించి ఎన్నో విషయాలు ఇందులో ప్రస్తావించారు. ఉగ్ర మూకల్లో కలిసిపోతున్న మన యువత ఎలా వలలో చిక్కుతోందో చూపించారు. ఈ సినిమా అందరూ చూడాలని రిక్వెస్ట్ చేస్తున్నాను"


- జేపీ నడ్డా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు


అయితే...ఈ సినిమాని బీజేపీ ఓన్ చేసుకుంటోందని, కావాలనే విద్వేషాలు రెచ్చగొడుతోందని విమర్శిస్తున్నాయి  మిగతా పార్టీలు. ముఖ్యంగా కేరళలో దీనిపై పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమవుతోంది. పలు చోట్ల సినిమా ప్రదర్శించకుండా అడ్డుకుంటున్నారు. ముస్లిం సంఘాలు తీవ్రంగా విమర్శిస్తున్నాయి. కేరళ సీఎం పినరయి విజయన్...ఈ సినిమా తప్పుదోవ పట్టించే విధంగా ఉందని అసహనం వ్యక్తం చేశారు. అంత మంది మతం మారినట్టు లెక్కలు లేవని తేల్చి చెప్పారు. మత సామరస్యంపై విషం చిమ్ముతున్నారని మండి పడ్డారు. తమిళనాడులోనూ ఇదే స్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. 


Also Read: Karnataka Assembly Election 2023: కర్ణాటక ఎన్నికల బరిలో దిగిన కీలక అభ్యర్థులు వీళ్లీ, మళ్లీ గెలుస్తారా?