Shopian Encounter: జమ్ముకశ్మీర్‌ సోపియాన్ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఇందులో నిషిద్ధ ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ)తో సంబంధం ఉన్న ముగ్గురు స్థానిక ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి.






ఇద్దరు ఉగ్రవాదులను లతీఫ్ లోన్, ఉమర్ నజీర్‌గా పోలీసులు గుర్తించారు. కశ్మీరీ పండిట్ శ్రీ పురాణ కృష్ణ భట్ హత్యలో లతీఫ్ ప్రమేయం ఉండగా, నేపాల్‌కు చెందిన టిల్ బహదూర్ థాపా హత్యలో అనంత్‌నాగ్‌కు చెందిన ఉమర్ నజీర్ ప్రమేయం ఉందని కశ్మీర్ ఏడీజీపీ తెలిపారు.






ఎన్‌కౌంటర్ జరిగిన చోట నుంచి ఒక ఏకే-47 రైఫిల్, రెండు పిస్టల్స్ కూడా స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. సోపియాన్ జిల్లాలోని ముంజ్ మార్గ్ ప్రాంతంలో ఎన్‌కౌంటర్ ప్రారంభమైందని అంతకుముందు కశ్మీర్ పోలీసులు తెలిపారు.


మాటు వేసి


కశ్మీర్‌లో పండిట్‌ను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న దాడులు కొంత కాలం తగ్గుముఖం పట్టినట్టు అనిపించినా.. మళ్లీ ఈ మధ్య కాలంలో పెరుగుతున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది..ఈ తరహా ఘటనలు స్థానికులకు పాత రోజుల్ని గుర్తు చేస్తున్నాయి. సోపియన్ జిల్లాలో ఉగ్రవాదులు ఇటీవల పురాణ్ క్రిషన్ భట్‌ అనే పండిట్‌ను కాల్చిచంపారు.


దక్షిణ కశ్మీర్‌లోని చౌదరి గుండ్ ప్రాంతంలో తన నివాసానికి సమీపంలో ఉండగానే...పురాణ్‌పై ఉగ్రవాదులు దాడి చేశారు. అప్పటికప్పుడు సోపియన్ హాస్పిటల్‌కు తరలించినప్పటికీ..అప్పటికే ప్రాణాలు కోల్పోయాడు బాధితుడు. పురాణ్ క్రిషన్ భట్‌కు ఇద్దరు పిల్లలున్నారు.


"ఆయన బయటకు వెళ్లడానికి కూడా చాలా రోజులు భయపడిపోయాడు. ఎప్పుడూ ఇంట్లోనే ఉండేవాడు. ఈ ఘటన మాకెంతో భయం కలిగిస్తోంది." అని మృతుడి బంధువు ఒకరు అన్నారు. గతంలో ఇదే సోపియన్ జిల్లాలో ఓ యాపిల్‌ తోటలో కశ్మీరీ పండిట్ హత్యకు గురయ్యాడు. ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఆగస్టు 16న సునీల్ కుమార్‌పై ఉగ్రవాదులు దాడి చేసి హత్య చేశారు. అతని సోదరుడు పింటు కుమార్ గాయాలతో బయటపడ్డాడు. "కశ్మీరీ ఫ్రీడమ్ ఫైటర్స్" తామే ఈ పని చేసినట్టు ప్రకటించుకుంది. స్వాతంత్య్రోద్యమ సంబరాల్లో భాగంగా తిరంగా ర్యాలీలు చేయాలని అందరినీ ప్రేరేపించినందుకే..సునీల్ కుమార్‌ని హత్య చేశామని చెప్పింది. 


Also Read: Rahul Gandhi To BJP: 'వీలైతే ప్రేమిద్దాం డ్యూడ్'- బీజేపీకి రాహుల్ గాంధీ కౌంటర్