లేడీ సూపర్ స్టార్ నయనతార (Nayanthara) లో మార్పు చూసి తమిళ, తెలుగు చిత్రసీమలకు చెందిన ప్రముఖులు మాత్రమే కాదు... సగటు సినిమా ప్రేక్షకులు సైతం కించిత్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. పెళ్లి తర్వాత ఆమెలో ఎంత మార్పు వచ్చిందని అనుకున్నారు. అసలు ఏమైంది? అనే వివరాల్లోకి వెళితే...
నయనతారను ఎప్పుడు అయినా సరే పబ్లిసిటీ కార్యక్రమాల్లో చూశారా? ఒక్కసారి గుర్తు చేసుకోండి! సినిమా ప్రెస్‌మీట్స్, ప్రీ రిలీజ్ ఫంక్షన్స్, ఇంటర్వ్యూలు... లేడీ సూపర్ స్టార్ వీటన్నిటికీ చాలా దూరం! సినిమాలో నటించిన తర్వాత మళ్ళీ ఆ సినిమా టీమ్‌తో పబ్లిసిటీ ప్రోగ్రామ్స్‌లో కనపడరు. ఇప్పుడు ఆ రూల్ తీసి పక్కన పెట్టేశారు. తనకు తానుగా బ్రేక్ చేశారు.
నయనతార ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం 'కనెక్ట్' (Connect Movie). ఈ గురువారం తెలుగు, తమిళ ప్రేక్షకుల ముందుకు వస్తోంది. నయనతార ఈ సినిమా కోసం స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చారు. తెలుగులో సుమ కనకాల (Suma Kanakala), తమిళంలో దీదీ నీలకంఠన్ (దివ్యదర్శని) ఇంటర్వ్యూ చేశారు. త్వరలో ఇది విడుదల కానుంది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నయనతార నటించిన సినిమా 'అనామిక'. హిందీలో విద్యా బాలన్ నటించిన 'కహాని'కు అది రీమేక్. ఆ సినిమా విడుదల సమయంలో నయనతార ఇంటర్వ్యూ ఇచ్చారు. బహుశా... మళ్ళీ ఓ సినిమా కోసం ఆవిడ ఇంటర్వ్యూ ఇవ్వడం ఇదే అనుకుంట!
ఈ సినిమాను నయనతార భర్త, దర్శకుడు విఘ్నేష్ శివన్‌కు చెందిన రౌడీ పిక్చర్స్ సంస్థ నిర్మించింది. తెలుగులో యూవీ క్రియేషన్స్ విడుదల చేస్తోంది. భర్త కోసం నయనతార ఇంటర్వ్యూ ఇచ్చారేమో!?
Also Read : 'అవతార్ 2'కు మిక్స్డ్ టాక్ రావడానికి ఐదు ముఖ్యమైన కారణాలు
'కనెక్ట్' చిత్రానికి అశ్విన్ శరవణన్ దర్శకత్వం వహించారు. ఆయన భార్య కావ్యా కళ్యాణ్ రామ్ కథ అందించారు. తాప్సీ పన్నుతో 'గేమ్ ఓవర్' సినిమా తీసిన ఆయనే. నయనతారతో ఆయనకు రెండో చిత్రమిది. ఇంతకు ముందు 'మాయ' అని ఓ సినిమా తీశారు. అది హారర్ థ్రిల్లర్. ఇప్పుడీ 'కనెక్ట్' కూడా హారర్ థ్రిల్లర్. పాండమిక్ పీరియడ్ (కరోనా కాలం) నేపథ్యంలో కథ సాగుతుంది.
అనుపమ్ ఖేర్... సత్యరాజ్!
'కనెక్ట్' సినిమాలో సత్యరాజ్, బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ ఏడాది సంచలన విజయం సాధించిన 'కార్తికేయ 2'లో అనుపమ్ కనిపించారు. తమిళంలో ఆయన ఇంతకు ముందు ఓ సినిమా చేశారు. అయితే, పదిహేనేళ్ల తర్వాత ఆయన నటించిన తమిళ సినిమా 'కనెక్ట్' కావడం విశేషం. 'వాన' హీరో వినయ్ రాయ్, చైల్డ్ యాక్టర్ హనియా నఫీసా కీలక పాత్రలు చేశారు. ఈ చిత్రానికి పృథ్వీ చంద్రశేఖర్ సంగీతం అందించగా... మణికంఠన్ రామాచారి సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వరించారు.
Also Read : ఏందిది నారప్ప... 'అవతార్ 2' కథ వెంకటేష్ 'నారప్ప'లా ఉందని చెబుతున్నారేంటి?
కథానాయికగా రజనీకాంత్ జోడీగా నయనతార నటించిన 'చంద్రముఖి' హారర్ చిత్రమే కదా! ఫిమేల్ సెంట్రిక్ సినిమాలకు వస్తే... 'ఐరా', 'డోరా', 'వసంత కాలం' వంటి హారర్ చిత్రాలు ఆమె ఖాతాలో ఉన్నాయి. నయనతార యువరాణి పాత్రలో కనిపించిన సినిమా 'కాష్మోరా'. కార్తీ కథానాయకుడిగా నటించిన ఆ సినిమా కూడా హారరే.