'అవతార్ 2' (Avatar 2) ఒక విజువల్ వండర్. జేమ్స్ కామెరూన్ క్రియేట్ చేసిన ఊహా ప్రపంచానికి ప్రేక్షక లోకమంతా సలాం అనాల్సిందే. పండోరా గ్రహం, సముద్రపు జీవులు, ఆ యాక్షన్ దృశ్యాలు అందరికీ నచ్చేస్తున్నాయి. మరో పదేళ్ళ వరకు ఈ తరహా విజువల్ ఎఫెక్ట్స్ సినిమా ఎవరూ తీయలేరని చెప్పడంలో ఎవరికీ ఎటువంటి సందేహం అవసరం లేదు. ముందు తీయాలంటే ఊహించాలి కదా! ఒక్క జేమ్స్ కామెరూన్ మాత్రమే ఆ విధంగా ఊహించగలరేమో!? నిర్మాతలు అన్నేసి వందల కోట్లు ఖర్చు పెట్టాలంటే జేమ్స్ కామెరూన్ మీద 'అవతార్ 2' నిర్మాతలకు ఉన్న నమ్మకం, మిగతా దర్శకులపై నిర్మాతలకు ఉండాలేమో!? రాజమౌళిపై 'బాహుబలి', 'ఆర్ఆర్ఆర్' నిర్మాతలకు ఉన్నట్లు!


విజువల్స్ ఎఫెక్ట్స్ విషయంలో 'అవతార్ 2'కు ఎన్ని ప్రశంసలు లభిస్తున్నాయో... కథ విషయంలో అన్ని విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా భారతీయ ప్రేక్షకులకు చాలా సినిమాలు కళ్ళ ముందు మెదులుతున్నాయి. మరీ ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులకు 'నారప్ప' కనబడుతోంది.  ఏందిది? 'నారప్ప' కథలా ఉందని కామెంట్లు చేశారు. ట్వీట్లు పెట్టారు.






'అవతార్ 2' బడ్జెట్ వేరు, ఆ విజువల్స్ వేరు! 'నారప్ప' బడ్జెట్ వేరు, విజువల్స్ వేరు! ముఖ్యంగా రెండు సినిమాల నేపథ్యం వేరు. ఆ అంశాలు పక్కన పెట్టేసి... రెండు స్టోరీల్లో ఏముంది? రెండు కథల్లో కామన్ పాయింట్స్ ఏంటి? అనేది ఒకసారి చూస్తే?


వేర్వేరు ఊర్లు...
వేర్వేరు గ్రహాలు!
ముందు 'నారప్ప' చూద్దాం... వెంకటేష్, ప్రియమణి దంపతులుగా కనిపించారు. ఆ జంట పెళ్లి ముందుకు వెళితే? వెంకటేష్‌ది ప్రియమణి ఊరు కాదు. వేరే గ్రామం నుంచి వాళ్ళ ఊరు వస్తాడు. 'అవతార్ 2'కి వస్తే? హీరో జేక్‌ది వేరే గ్రహం. హీరోయిన్ నేత్రి పండోరా గ్రహానికి వెళతాడు.


రెండు కథల్లో కామన్ థింగ్ ఏంటంటే... తమ ప్రాంతం / గ్రహం కాని వాళ్ళను హీరోయిన్లు పెళ్ళి చేసుకోవడం! ఆ పెళ్లికి దారి తీసిన అంశం? హీరోలో ధైర్య సాహసాలు! కుటుంబం కోసం కూడా ఆ విధంగా పోరాడతాడని మహిళలు ఇద్దరూ నమ్మడం!


మామూలోడు కాదు...
కానీ మాటుగా ఉన్నాడు!
'నారప్ప'లో ప్రియమణితో సిన్నప్ప క్యారెక్టర్ చేసిన కుర్రాడు రాఖీ ''అమ్మా... నాయన మామూలోడు కాదమ్మా!'' అని డైలాగ్ చెబుతాడు. అప్పుడు ఆమె ''నీకు ఉండే కోపం, ధైర్యం యాడ నుంచి వచ్చాయనుకుంటున్నావ్'' అని బదులు ఇస్తుంది. రెండు సినిమాల్లోనూ తండ్రి (హీరో) తెగువ, ధైర్యసాహసాలు కుమారులకు వచ్చినట్లు చూపించారు.
 
'నారప్ప'లో తన కుటుంబం జోలికి వచ్చిన శంకరయ్య ఫ్యామిలీని హీరో ఎంతలా నరికి చంపాడో?  ప్రేక్షకులకు తెలుసు. గతంలో అంత చేసిన మనిషి... కన్న కొడుకు చంపాడని తెలిసే సరికి అతడిని కాపాడుకోవడం కోసం సొంత ఇల్లు, ఊరు వదిలి అడవుల్లో తప్పించుకు తిరుగుతాడు. 'అవతార్ 2' విషయానికి వస్తే? ఒకప్పుడు ఎంతో ధైర్యంగా పోరాటం చేసిన హీరో జేక్... పిల్లలను రక్షించుకోవడం కోసం ఇల్లు (పండోరా గ్రహంలో తాము ఉండే అడవులు) వదిలి సముద్ర తీరానికి చేరుకుంటాడు. తన కోసం వెతుకుతున్న మనుషులకు కనిపించకుండా తప్పించుకుని తిరుగుతాడు.


పెద్ద కుమారుడి మరణం...
రెండో కుమారుడి కోసం!
విచిత్రం ఏమిటంటే? 'నారప్ప', 'అవతార్ 2'... రెండు సినిమాల్లో హీరోలకు ఇద్దరేసి కుమారులు ఉండటం! రెండు సినిమాల్లోనూ పెద్ద కుమారుడు మరణించడం! ఆ రెండో కుమారుడిని కోల్పోకూడదని హీరో పోరాటం చేయడం!


విలన్ నుంచి తప్పించుకున్న తిరుగుతున్న హీరో... విలన్స్ చేతికి కుమారుడు చిక్కడంతో ఒక్కసారిగా విశ్వరూపం చూపించడం, పోరాటం చేయడం రెండు సినిమాల్లో కామన్! 'నారప్ప'లో వెంకటేష్, ప్రియమణి జంటకు ఓ కుమార్తె ఉంటుంది. 'అవతార్ 2'లో  కూడా హీరో హీరోయిన్లకు ఓ కుమార్తె (మరో అమ్మాయి దత్త పుత్రిక) ఉంటుంది.


Also Read : 'అవతార్ 2' రివ్యూ : జేమ్స్ కామెరూన్ డిజప్పాయింట్ చేశాడా? వావ్ అనిపించాడా?


ఫ్యామిలీని తీసుకుని చోటు వదిలేసి మరో చోటుకు హీరో వెళ్ళడం (తప్పించుకుని  తిరుగుతూ) ఉండటం, కుమారులకు ఆపద వచ్చే సరికి జూలు విదిల్చిన సింహం తరహాలో ఒక్కసారి పంజా విసరడం, పెద్ద కుమారుడిని కోల్పోయి రెండో కుమారుడిని కాపాడుకోవడం... బేసిక్ స్ట్రక్చర్, స్టోరీ లైన్ కారణంగా 'అవతార్ 2' చూశాక కొందరికి 'నారప్ప' గుర్తుకు వస్తోంది. ఆ కారణంగా రెండు సినిమాలను ఒక్క గాటిన కట్టలేం! బహుశా... తమిళ ప్రేక్షకులలో కొందరికి 'అవతార్ 2' చూశాక 'అసురన్' గుర్తుకు వచ్చి ఉండొచ్చు! 'నారప్ప' ఆ సినిమా రీమేకే కదా!


Also Read : 'అవతార్'లో ఈ పదాలకు మీకు అర్థం తెలుసా? తెలిస్తే సినిమా సూపర్


'అవతార్ 2' చూసిన ప్రేక్షకులు కొందరికి రామాయణ, మహాభారతాలు, హిందూ పురాణ ఇతిహాసాలు గుర్తుకు రావడంలో కూడా ఆశ్చర్యం లేదు. హనుమంతుడు, వానర సైన్యం సాయంతో రాముడు లంకపై యుద్ధం చేస్తే... 'అవతార్ 2'లో రీఫ్ పీపుల్ సాయంతో స్కై పీపుల్ (మనుషుల)పై హీరో జేక్ యుద్ధం చేసి గెలిచాడు. హీరో తలదాచుకోవడం కాన్సెప్ట్ పాండవుల అజ్ఞాతవాసం అని, కల్నల్ & కుమారుడి ఎపిసోడ్ హిరణ్యకశ్యప - ప్రహ్లాదుడి కథను గుర్తుకు తెస్తుందని చెబుతున్నారు. దేవతలు, అసురుల కథను జేమ్స్ కామెరూన్ ఈ విధంగా చెప్పాడని కొందరు అంటున్నారు. ఇటువంటి కంపేరిజన్స్, నెగిటివ్ కామెంట్స్ పక్కన పెడితే 'అవతార్ 2' వసూళ్ళ విషయంలో భారీ రికార్డులు క్రియేట్ చేయడానికి రెడీ అవుతోంది. 


Also Read : 'అవతార్ 2'లో 'టైటానిక్' హీరోయిన్ ఉందా? కేట్ విన్స్‌లెట్‌ను ఎంత మంది గుర్తు పట్టారు?