దేశంలోని విద్యావిధానంలో సమూల మార్పులు తీసుకురావడం కోసమే జాతీయ విద్యా విధానం (నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ) 2020ని ప్రవేశపెట్టామని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. 'శిక్షక్ పర్వ్' కార్యక్రమాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని మోదీ ప్రారంభించారు. విద్య అందరికీ అందుబాటులో ఉండాలని ఈ సందర్భంగా మోదీ ఆకాంక్షించారు.






సంజ్ఞల డిక్షనరీ, టాకింగ్ బుక్స్​ను మోదీ ఆవిష్కరించారు. సీబీఎస్​ఈ కోసం స్కూల్ క్వాలిటీ అస్యూరెన్స్, అసెస్‌మెంట్ ఫ్రేమ్‌వర్క్​ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, సహాయ మంత్రి జితిన్ ప్రసాద్ పాల్గొన్నారు.






మోదీ ప్రసంగంలో హైలెట్స్ ఇవే..



  1. ఈ ఏడాది ఉత్తమ ఉపాధ్యాయులుగా అవార్డులు అందుకున్న టీచర్లను ప్రధాని మోదీ అభినందించారు. వారు చేసిన కృషి అమోఘమని ప్రశంసించారు.

  2. సంజ్ఞల డిక్షనరీ, టాకింగ్ బుక్స్​ను ఆవిష్కరించారు. దివ్యాంగులకు ఇవి ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. ఈ డిక్షనరీలో దాదాపు 1000కి పైగా పదాలున్నాయి.

  3. సీబీఎస్ఈ కోసం క్వాలిటీ అస్యూరెన్స్, అసెస్ మెంట్ ఫ్రేమ్ వర్క్ ను విడుదల చేశారు. ఇది పిల్లల భవిష్యత్తుకు ఎంతో ఉపయోగపడుతుందని మోదీ అన్నారు.

  4. జాతీయ విద్యా విధానం 2020 అమలుకు అందరూ సహకరించాలన్నారు. ఇప్పటివరకు ఉపాధ్యాయులు, విద్యావేత్తలు చేసిన కృషిని కొనియాడారు. పిల్లల తల్లిదండ్రులు కూడా ఇందుకు మద్దతు ఇవ్వాలన్నారు.

  5. విద్యారంగంలో ప్రైవేట్ సెక్టార్ భారీ పెట్టుబడులు పెట్టి ముందుకు రావాలన్నారు. విద్యా నాణ్యతను పెంపొందిచడమే లక్ష్యమని మోదీ స్పష్టం చేశారు.

  6. నిష్టా 3.0, విద్యాంజలి పోర్టల్స్ ను మోదీ ప్రారంభించారు. ఉపాధ్యాయులు.. కొత్త విధానాలు, టెక్నాలజీని నేర్చుకోవడానికి ఇవి ఉపయోగించుకోవాలని సూచించారు.


'శిక్షక్ పర్వ్​-2021' కార్యక్రమాన్ని 'క్వాలిటీ అండ్ సస్టేనెబుల్ స్కూల్స్: లెర్నింగ్స్ ఫ్రం స్కూల్స్ ఇన్ ఇండియా' అనే ఇతివృత్తంతో నిర్వహిస్తున్నారు. విద్యా నాణ్యతను పెంచేందుకు ఈ కార్యక్రమం తోడ్పడనుంది.