Bangladesh Economic Crisis: బంగ్లాదేశ్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. దాదాపు నెల రోజులుగా అక్కడ అల్లర్లు జరుగుతున్నాయి. రాజకీయంగా అనిశ్చితి నెలకొంది. ఆపద్ధర్మ ప్రధానిగా మహమ్మద్ యూనస్‌ బాధ్యతలు చేపట్టినా పరిస్థితులు ఇంకా అదుపులోకి రాలేదు. రిజర్వేషన్ కోటా విషయంలో విద్యార్థులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. అటు హిందువులపైనా తీవ్ర దాడులు జరుగుతున్నాయి. మొత్తంగా దేశమంతా అల్లకల్లోలంగా ఉంది. ఈ క్రమంలోనే ఆర్థికంగానూ బంగ్లాదేశ్‌ చతికిలబడింది. Bangladesh Bureau of Statistics వెల్లడించిన వివరాల ప్రకారం జులై నాటికి ద్రవ్యోల్బణం 12 ఏళ్ల గరిష్ఠానికి చేరుకుంది. 11.66%గా నమోదైంది. ఆహార ద్రవ్యోల్బణం ఏకంగా 14%కి పెరిగింది. 13 ఏళ్లలో ఎప్పుడూ లేని స్థాయిలో పరిస్థితులు ఆందోళనకరంగా మారాయి. దేశవ్యాప్తంగా ఆందోళనలు, నిరసనల కారణంగా సప్లై చెయిన్‌కి అంతరాయం కలుగుతోంది. 


ఇక వ్యాపార రంగమూ గట్టిగానే దెబ్బ తింది. సెంట్రల్ బ్యాంక్‌ ఆంక్షల కారణంగా నగదు చెలామణి పూర్తిగా తగ్గిపోయింది. బ్యాంక్ నుంచి రూ.2 లక్షల కన్నా ఎక్కువ మొత్తం విత్‌డ్రా చేసుకోకుండా రూల్ పెట్టారు. అమెరికా డాలర్‌తో పోల్చి చూస్తే బంగ్లాదేశ్ కరెన్సీ టాకా విలువ రోజురోజుకీ పడిపోతోంది. నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. లాభాల్లేక వ్యాపారులు దిగాలుగా ఉన్నారు. త్వరలోనే ధరలు మరింత పెరిగే అవకాశముందని అక్కడి వ్యాపారులు చెబుతున్నారు. ఎప్పుడూ బిజీగా ఉండే మార్కెట్‌లు ఇప్పుడు జనమే లేక వెలవెలబోతున్నాయి. 


పప్పులు, ధాన్యాలతో పాటు మిగతా నిత్యావసరాలు ధరలు మండిపోతున్నాయి. ఇప్పటికైతే వ్యాపారులు నష్టాలకే సరుకులు అమ్ముకుంటున్నారు. వచ్చే నెల కచ్చితంగా ధరలు పెంచుతామని కొత్త ప్రభుత్వం భరోసా ఇస్తోంది. బంగ్లాదేశ్‌ పెద్ద ఎత్తున డ్రైఫ్రూట్స్‌, పప్పులు, సుగంధ ద్రవ్యాలు దిగుమతి చేసుకుంటోంది. భారత్‌ కూడా బంగ్లాకి వీటిని ఎగుమతి చేస్తోంది. సప్లై చెయిన్‌పై ప్రభావం పడడం వల్ల ఇవన్నీ ఆగిపోయాయి. ఇక బంగ్లాదేశ్‌లో విదేశీ మారక నిల్వలు జులైలో 21.78 బిలియన్ డాలర్లుగా ఉండగా ప్రస్తుతం అవి 20.48 బిలియన్ డాలర్లకు పడిపోయింది. ప్రస్తుతానికి వాణిజ్యం కూడా అంతంతమాత్రంగానే సాగుతోంది. త్వరలోనే చమురు ధరలూ పెరిగే ప్రమాదముందని స్థానిక నేతలు చెబుతున్నారు. 


ఇప్పటి వరకూ బంగ్లాలో జరిగిన అల్లర్లలో 400 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ కోటాలు ప్రవేశపెట్టినందుకు ప్రధాని షేక్ హసీనాపై తిరగబడ్డారు విద్యార్థులు. ఫలితంగా ఆమె ఆ పదవికి రాజీనామా చేశారు. వెంటనే ఇండియాకి వచ్చేశారు. ఇక్కడే ఆశ్రయం పొందాలని భావించినా మోదీ సర్కార్ అందుకు అంగీకరించలేదు. ప్రత్యామ్నాయాలు చూసుకోవాలని సున్నితంగానే మందలించింది. తాత్కాలికంగా భారత్‌లోనే ఉన్న షేక్ హసీనా త్వరలోనే మళ్లీ బంగ్లాదేశ్‌కి వెళ్లిపోయే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. అక్కడ ఎన్నికలు ప్రకటించిన వెంటనే వెళ్లి మళ్లీ పోటీ చేయాలని భావిస్తున్నట్టు షేక్ హసీనా కొడుకు సాజీబ్ వెల్లడించారు. అయితే...ఈ సంక్షోభం వెనక అమెరికా హస్తం ఉందని ఆమె చేసిన ఆరోపణలు సంచలనమవుతున్నాయి. 


Also Read: Kolkata Doctor Case: కూతురి డెడ్‌బాడీ చూసేందుకు 3 గంటల ఎదురు చూపులు, కోల్‌కత్తా డాక్టర్‌ తల్లిదండ్రుల నరకయాతన