సీనియర్ జర్నలిస్ట్ వినోద్ దువా(67) శనివారం మరణించారు. వినోద్ దువా మరణాన్ని ఆయన కుమార్తె మల్లికా దువా ధ్రువీకరించారు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి వినోద్ దువా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారని ఆమె తెలిపారు. దిల్లీలోని ఓ హాస్పిటల్ లో ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో కొద్దిరోజులుగా ఆయనకు చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తోంది. వినోద్ దువా ఈ ఏడాది ఆరంభంలో కోవిడ్ సోకింది. టీవీ జర్నలిజంలో అపార అనుభవం కలిగిన దువా దూరదర్శన్, ఎన్‌డీ టీవీల్లో చాలా కాలం పనిచేశారు. తన కెరీర్‌లో దువా పలు టీవీ ఛానెళ్లు, ఆన్‌లైన్ పోర్టల్స్‌లో షోలు నిర్వహించారు.
తండ్రి వినోద్ దువా మరణించారని ఆయన కుమార్తె మల్లికా దువా సోషల్ మీడియాలో వెల్లడించారు. దిల్లీలోని రెఫ్యూజీ కాలనీ నుంచి అత్యున్నత పాత్రికేయ నైపుణ్యాలతో ప్రముఖ జర్నలిస్టుగా ఆయన ఎదిగారని ఆమె పేర్కొన్నారు. ఇప్పుడు ఆయన అమ్మ దగ్గరికి చేరుకున్నారని అన్నారు. కరోనా సెకండ్ వేవ్‌లో వినోద్ దువా, ఆయన భార్య పద్మావతి దువాకు కరోనా సోకింది. ఇద్దరూ గురుగ్రాం ఆసుపత్రిలో దీర్ఘకాలం కోవిడ్-19కి చికిత్స పొందారు. పద్మావతి దువా ఈ ఏడాది జూన్‌లో కన్నుమూశారు.
కుమార్తె ఎమోషనల్ పోస్టు
“నిర్భయమైన, అసాధారణమైన నా తండ్రి వినోద్ దువా మరణించారు. దిల్లీలోని శరణార్థుల కాలనీలో నివసించిన ఆయన.. 42 సంవత్సరాల్లో పాత్రికేయ వృత్తిలో శిఖరానికి చేరుకున్నారు. సాధారణ జీవితాన్ని గడుపుతూ ఎప్పుడూ నిజాన్నే మాట్లాడారు. నా తండ్రి ఇప్పుడు మా అమ్మ, ప్రియమైన భార్య చిన్నాతో కలిసి స్వర్గంలో ఉన్నారు. అక్కడ ఇద్దరూ పాడటం, వంట చేయడం, వాళ్ల ఆనంద జీవితాన్ని కొనసాగిస్తారు.” అని మల్లికా దువా తన ఇన్‌స్టాగ్రామ్ రాసుకున్నారు. వినోద్ దువా ఆరోగ్యం మరింత క్షీణించిందని ఇటీవల ఆమె తెలిపారు.
Also Read: న్యాయం చెప్పడానికి కేవలం కోర్టులే అక్కర్లేదు... సీజేఐ ఎన్వీ రమణ ఆసక్తికర వ్యాఖ్యలు
రామ్‌నాథ్ గోయెంకా ఎక్స్ లెన్స్ అవార్డు
ప్రముఖ జర్నలిస్ట్ వినోద్ దువా నవంబర్ 1974లో దూరదర్శన్(గతంలో దిల్లీ టెలివిజన్ అని పిలిచేవారు)లో ప్రసారమైన హిందీ-భాషా యువజన కార్యక్రమం యువ మంచ్‌లో తొలిసారి టెలివిజన్‌లో కనిపించారు. దిల్లీ యూనివర్శిటీ పూర్వ విద్యార్థి అయిన దువా 1984లో దూరదర్శన్‌లో ఇటువంటి షోలకు సహ యాంకరింగ్ చేయడం ప్రారంభించారు. ఎన్నికల విశ్లేషణ కార్యక్రమాలతో ఆయన గుర్తింపు పొందారు. వినోద్ దువా ఎన్డీటీవీలో 'జైకా ఇండియా కా' ప్రొగ్రామ్ హోస్ట్ చేశారు. భారతదేశంలో స్థానిక ఆహారపు అలవాట్లు, వంటకాలపై వైవిధ్యంగా చేసిన ఈ ప్రొగ్రామ్ వినోద్ దువాకు ఎంతో పేరు తెచ్చింది. వినోద్ దువా 1996లో రామ్‌నాథ్ గోయెంకా ఎక్సలెన్స్ అవార్డు పొందిన మొదటి ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ అయ్యారు. 2008లో జర్నలిజంలో పద్మశ్రీ అవార్డు కూడా అందుకున్నారు. వినోద్ దువా భౌతికకాయాన్ని ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు లోధి శ్మశానవాటికలో అంత్యక్రియలు చేస్తారు.
Also Read: మాజీ సీఎం కొణిజేటి రోశయ్య రేర్ ఫొటోస్.. ప్రముఖులతో జ్ఞాపకాలు ఇవిగో..