ఉత్తరాఖండ్ లో పర్యటిస్తోన్న ప్రధాని మోదీ పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. దిల్లీ-డెహ్రాడూన్ ఎకనామిక్ కారిడార్‌తో రూ.1800 కోట్ల విలువై పలు ప్రాజెక్టులను కేంద్రం చేపట్టింది. ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని కూడా ప్రధాని మోదీ ఇవాళ ప్రారంభించారు. ఎన్నికల ప్రచార సభలో ప్రధాని మోదీ ప్రసంగానికి ముందు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ మాట్లాడుతూ.. ప్రతిపక్షాలు బీజేపీపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయని ఆరోపించారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలో ఉన్నంత వరకూ వారి ఆటలు సాగవన్నారు. తప్పుడు ప్రచారాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు. 






రూ.18 వేల కోట్లతో అభివృద్ధి ప్రాజెక్టులు


అనంతరం మాట్లాడిన ప్రధాని మోదీ గత ఐదేళ్లలో ఉత్తరాఖండ్ అభివృద్ధికి కేంద్రం రూ.లక్ష కోట్లకు పైగా నిధులు మంజూరు చేసిందన్నారు. తాజాగా రూ18,000 కోట్లతో అభివృద్ధి ప్రాజెక్టులు చేపట్టామని గుర్తుచేశారు.  అభివృద్ధి ప్రాజెక్టుల గురించి మాట్లాడిన ప్రధాని మోదీ.. మౌలిక సదుపాయాల అభివృద్ధికి రూ.100 లక్షల కోట్ల పెట్టుబడి పెడుతున్నట్లు తెలిపారు. దిల్లీ-డెహ్రాడూన్ ఎకనామిక్ కారిడార్‌కు శంకుస్థాపన చేయడం చాలా సంతోషంగా ఉందని ప్రధాని అన్నారు. ఈ కారిడార్ సిద్ధమైతే దిల్లీ నుంచి డెహ్రాడూన్ వెళ్లేందుకు పట్టే సమయం దాదాపు సగానికి సగం తగ్గిపోతుందన్నారు. 






ఏడు సంవత్సరాల్లో 2 వేల కి.మీ రహదారులు


ఈ సభలో ప్రతిపక్షాలపై ప్రధాని మోదీ విమర్శలు చేశారు. "మన పర్వతాలు, సంస్కృతి మనకు విశ్వాసం మాత్రమే కాదు దేశ భద్రతకు కోటలు కూడా. పర్వతాలలో నివసించే ప్రజల కోసం చాలా ప్రాధాన్యత ఇస్తున్నాము. దురదృష్టవశాత్తు దశాబ్దాలుగా అధికారంలో కొనసాగిన వారంతా దీని గురించి పట్టించుకోలేదు" అని ప్రధాని మోదీ అన్నారు. ఉత్తరాఖండ్‌లో బీజేపీ ప్రభుత్వం గురించి మాట్లాడుతూ... 2007- 2014 మధ్య కేంద్ర ప్రభుత్వం ఉత్తరాఖండ్‌లో రూ. 600 కోట్ల విలువైన 288 కిలోమీటర్ల జాతీయ రహదారులను మాత్రమే నిర్మించిందని, అయితే బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం 7 సంవత్సరాలలో  రూ. 12,000 కోట్ల విలువైన 2,000 కి.మీ జాతీయ రహదారులను నిర్మించిందన్నారు. 


సైన్యానికి ఆధునిక ఆయుధాలు


కొన్ని రాజకీయ పార్టీలు తమ మతం, కులానికి చెందిన ఒక వర్గానికి మాత్రమే ఏదో ఇవ్వాలని ప్రయత్నిస్తున్నాయని, వారిని ఓటు బ్యాంకుగా మార్చుకోవాలని భావిస్తున్నారని ప్రధాని మోదీ విమర్శించారు. ఈ రాజకీయ పార్టీలు ప్రజలను ప్రలోభపెట్టేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆరోపరించారు. గత ప్రభుత్వాలు రాష్ట్రంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి చిత్తశుద్ధితో పని చేయలేదన్నారు. సైన్యాన్ని నిరుత్సాహపరిచేలా వ్యవహరించారన్నారు. బీజేపీ ప్రభుత్వం ఒకే ర్యాంక్, ఒకే పింఛన్ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చామన్నారు. సైన్యానికి ఆధునిక ఆయుధాలు అందించి ఉగ్రవాదులకు తగిన సమాధానం చెప్పామన్నారు. 


Also Read: వైఎస్‌ను కాంగ్రెస్‌ నుంచి బహిష్కరించాలన్న రోశయ్య..ఆ వైఎస్‌కే ఆత్మబంధువు ఎలా అయ్యారు !?


దిల్లీ-డెహ్రాడూన్ ఎకనమిక్ కారిడార్


ప్రధాన మంత్రి కార్యాలయం ప్రధాని పర్యటనపై  ఒక పత్రికా ప్రకటన విడుదల చేసింది. మౌలిక సదుపాయాల అభివృద్ధిలో భాగంగా 11 ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టులలో దిల్లీ-డెహ్రాడూన్ ఎకనామిక్ కారిడార్ రూ. 83,000 కోట్లతో చేపడుతున్నారు.  ఈ కారిడాన్ అందుబాటులోకి వస్తే దిల్లీ-డెహ్రాడూన్ మధ్య ప్రయాణ సమయాన్ని 2.5 గంటలకు తగ్గుతుంది. ప్రధానమంత్రి ప్రారంభించిన మరో ప్రాజెక్ట్ గ్రీన్‌ఫీల్డ్ అలైన్‌మెంట్ ప్రాజెక్ట్, దీనిని రూ. 2,000 కోట్లతో నిర్మించనున్నారు. రూ.16,000 కోట్ల వ్యయంతో హరిద్వార్ రింగ్ రోడ్ ప్రాజెక్ట్ కూడా దీనిలో భాగంగా ఉంటుంది. హరిద్వార్ సిటీకి ట్రాఫిక్ తగ్గించేందుకు.. కుమాన్ జోన్‌కు మెరుగైన కనెక్టివిటీలో భాగంగా రింక్ రోడ్ ప్రాజెక్టు చేపట్టారు. 


Also Read: న్యాయం చెప్పడానికి కేవలం కోర్టులే అక్కర్లేదు... సీజేఐ ఎన్వీ రమణ ఆసక్తికర వ్యాఖ్యలు


రూ.700 కోట్లతో చైల్డ్ - ఫ్రెండ్లీ సిటీ


డెహ్రాడూన్-పవోంటా సాహిబ్ రోడ్ ప్రాజెక్ట్ ను అంతర్ రాష్ట్ర పర్యాటకం అభివృద్ధి చేసేందుకు ప్రారంభించారు. దాదాపు రూ. 17,000 కోట్లుతో ఈ ప్రాజెక్టు చేపడుతున్నారు. నజీబాబాద్-కోట్‌ద్వార్ రహదారి విస్తరణ ప్రాజెక్ట్ వల్ల ట్రాఫిక్‌ తగ్గి కనెక్టివిటీ మెరుగుపడనుంది. కొన్ని కారణాలతో మూసివేసిన లక్ష్మణ్ జూలా వంతెన  పక్కన గంగా నదిపై మరో వంతెన నిర్మిస్తున్నారు. ఈ వంతెన నడకతో పాటు తేలికపాటి వాహనాల కోసం అందుబాటులోకి తీసుకురానున్నారు. పిల్లల కోసం నగరాలను సురక్షితంగా మార్చడానికి చైల్డ్-ఫ్రెండ్లీ సిటీ ప్రాజెక్ట్ కు ప్రధాని మోదీ శ్రీకారం చుట్టారు. దాదాపు రూ.700 కోట్లతో దీనిని చేపట్టనున్నారు. ఇతర ప్రాజెక్టులతో పాటు, అధిక దిగుబడినిచ్చే అధునాతన రకాల సుగంధ మొక్కల పరిశోధన అభివృద్ధి కోసం డెహ్రాడూన్‌లోని స్టేట్ ఆఫ్ ఆర్ట్ పెర్ఫ్యూమరీ అరోమా లాబొరేటరీ (సెంటర్ ఫర్ అరోమాటిక్ ప్లాంట్స్)ని ప్రధాని మోదీ ప్రారంభించారు. 


Also Read: మాజీ సీఎం కొణిజేటి రోశయ్య రేర్ ఫొటోస్.. ప్రముఖులతో జ్ఞాపకాలు ఇవిగో..


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి