తీర్పులు చెప్పడానికి హంగామా, ఆర్భాటం అవసరం లేదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అభిప్రాయపడ్డారు. న్యాయం చెప్పడానికి కేవలం కోర్టులే అక్కర్లేదని.. అధికారులు, ప్రభుత్వాలు ఎవరైనా సరే న్యాయం చేకూర్చవచ్చునని సూచించారు. హైదరాబాద్‌లో శనివారం నిర్వహించిన అంత‌ర్జాతీయ ఆర్బిట్రేష‌న్ అండ్ మీడియేష‌న్ సెంట‌ర్ (IMAC) క్లాన్‌క్లేవ్‌లో సీజేఐ ఎన్వీ రమణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తప్పొప్పులు తెలుసుకుని సమస్యలు అర్థం చేసుకుని, కింది స్థాయిలోనే విశ్వసనీయతతో తీర్పులు చెప్పవచ్చు అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కోర్టుకు రావడం అనేది బాధితులకు చివరి ప్రత్యామ్నాయం కావాలని ఆయన ఆకాంక్షించారు.


ప్రతి వివాదాలను కోర్టు వరకు తీసుకురావడం అక్కర్లేదని, సంప్రదింపులు, మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకుంటే ఇరుపక్షాలకు ప్రయోజనం ఉంటుందని సూచించారు. కోర్టుల చుట్టూ తిరుగుతుంటే ఏళ్ల తరబడి కాలయాపన జరిగి అసలు ప్రయోజనం ఆలస్యంగా అందుతుందని పేర్కొన్నారు. మధ్యవర్తిత్వం ద్వారా తక్కువ సమయంలో పరిష్కారాలు లభిస్తాయని చెప్పారు. పెండింగ్‌ కేసులు సత్వరమే విచారణ జరగాలని సూచించారు. మహాభారతంలోనూ శ్రీక్రిష్ణుడి ద్వారా కౌరవులు, పాండవులు మధ్యవర్తిత్వం చేశారని గుర్తుచేశారు.



ఆస్తుల పంపకాలను కుటుంబ సభ్యులు సామరస్యంగా పరిష్కరించుకోవాలని, తద్వారా ఇరు వర్గాలకు ప్రయోజనంగా ఉంటుందన్నారు. సాధ్యమైనంతవరకు మహిళలు మధ్యవర్తిత్వంలో వివాదాలు పరిష్కరించుకోవాలని.. పెద్ద పెద్ద వారికి, ప్రభుత్వాలకే కాదు సామాన్యులకు సైతం పలు కేంద్రాలలో న్యాయం జరుగుతుందన్నారు. అన్ని విషయాలకు హైదరాబాద్ కేంద్రంగా ఉందని, తెలంగాణ సీఎం కేసీఆర్‌ది చాలా పెద్ద చెయ్యిఅని.. ఆయన ఏ పని చేసినా పెద్దగా ఉంటుందని వ్యాఖ్యానించారు.
Also Read: Rosayya No More : వైఎస్‌ను కాంగ్రెస్‌ నుంచి బహిష్కరించాలన్న రోశయ్య..ఆ వైఎస్‌కే ఆత్మబంధువు ఎలా అయ్యారు !?


తెలుగులో మాట్లాడిన సీజేఐ..
తాను తెలుగువాడినని చివరగా రెండు ముక్కలు చెబుతానంటూ సీజేఐ ఎన్వీ రమణ తెలుగులో మాట్లాడారు. ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్‌ (IMAC) ఏర్పాటుకు హైదరాబాద్‌ సరైన వేదిక అన్నారు. తెలుగు వారికి భోజనంలో పెరుగు లేకపోతే ఎలాగైతే సంతృప్తి ఉండదో.. తెలుగులో మాట్లాడకపోతే అలాగే ఉంటుందన్నారు. తెలుగువారైన మాజీ ప్రధాని పీవీ నరసింహారావు దేశంలో ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చారని గుర్తుచేశారు.


విదేశాలకు వెళ్లినప్పుడు.. మీ దేశంలో పెట్టుబడులు పెడితే లిటిగేషన్ క్లియర్ కావడానికి ఎన్నేళ్లు పడుతుందని అడుగుతారని తెలిపారు. కనుక వివాదాలు త్వరగా పరిష్కారం చేసుకోవడానికి మధ్యవర్తిత్వం జరగాలని సూచించారు. తీర్పులు చెప్పడానికి హంగామా, ఆర్భాటం అవసరం లేదన్నారు. అధికారులు, ప్రభుత్వాలు ఎవరైనా సరే విషయాన్ని తెలుసుకుని సత్వరం న్యాయం చేకూర్చవచ్చునంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రతి విషయాన్ని తేల్చుకునేందుకు, న్యాయం కోసం కోర్టు మెట్లు ఎక్కాల్సిన అవసరం లేదన్నారు. మధ్య వర్తిత్వం, చర్చల ద్వారా సమస్య పరిష్కరించుకోవాలని.. ఆఖరి ప్రత్యామ్నాయంగా కోర్టులను ఆశ్రయించాలని సీజేఐ ఎన్వీ రమణ సూచించారు.


Also Read: Rosaiah Rare Photos: మాజీ సీఎం కొణిజేటి రోశయ్య రేర్ ఫొటోస్.. ప్రముఖులతో జ్ఞాపకాలు ఇవిగో..


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి