SCO Summit 2022:
ఎరువులపై చర్చ..?
ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (Vladimir Putin)తో భేటీ అవనున్నారు. షాంఘై కో ఆపరేషన్ ఆర్గనైజేషన్ (SCO) సమ్మిట్‌లో భాగంగా...శుక్రవారం ఈ ఇద్దరూ ఉజ్బెకిస్థాన్ (Uzbekistan)లో సమావేశం కానున్నట్టు...రష్యా వెల్లడించింది. రష్యా నుంచి ఫర్టిలైజర్స్ (Fertilisers)రాక తగ్గిపోవటం వల్ల భారత్‌లో మార్కెట్ కాస్త ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఈ విషయమై...ఈ ఇద్దరూ చర్చించనున్నట్టు తెలుస్తోంది. వీటితో పాటు...మరి కొన్ని ఆహార పదార్థాల ఎగుమతులపైనా చర్చ జరగనుంది. కొవిడ్ సంక్షోభం తలెత్తినప్పటి నుంచి పుతిన్, మోదీ ఫోన్లోనే మాట్లాడుకున్నారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం తీవ్ర స్థాయిలో ఉన్నప్పుడూ...వీళ్లిద్దరూ ఫోన్ కాల్స్‌లోనే సంప్రదింపులు జరిపారు. దాదాపు రెండేళ్ల తరవాత ఇప్పుడు మళ్లీ ముఖాముఖి కలుసుకోనున్నారు. ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాల్లో నెలకొన్న అనిశ్చితిని తొలగించటమే లక్ష్యంగా ఈ భేటీ జరగనుందని రష్యా మీడియా వెల్లడించింది. 2022 మొదట్లోనే రెండు దేశాల మధ్య వాణిజ్య టర్నోవర్ 11.5 బిలియన్ డాలర్లకు పెరిగింది. ఏటా ఈ వాణిజ్య విలువ 120% మేర పెరుగుతున్నట్టు అంచనా.
ఒప్పందం ఉంటుందా..?
రష్యా నుంచి భారత్ పెద్ద మొత్తంలో ఫర్టిలైజర్లు దిగుమతి చేసుకుంటోంది. ఈ ఏడాది ఏప్రిల్-జులై మధ్య కాలంలో దాదాపు 1.03 బిలియన్ డాలర్ల విలువైన ఫర్టిలైజర్లు దిగుమతి చేసుకుంది భారత్. గత ఆర్థిక సంవత్సరంలో ఈ విలువ 773.54 మిలియన్ డాలర్లుగా ఉంది. అంటే...దిగుమతులు ఎంత భారీగా పెరిగాయో అర్థం చేసుకోవచ్చు. భారత వాణిజ్య మంత్రిత్వశాఖ వెల్లడించిన గణాంకాలే ఇవి. ఈ భారం తగ్గించుకునేందుకు...భారత్ ప్రయత్నాలు మొదలు పెట్టింది. రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో సమావేశం అవుతున్న తరుణంలో.. మూడేళ్ల పాటు ఫర్టిలైజర్స్‌ను రష్యా నుంచి దిగుమతి చేసుకునేందుకు వీలుగా ఓ ఒప్పందం కుదుర్చుకోనున్నట్టు సమాచారం. నిజానికి...ఈ ఒప్పందం ఈ ఏడాది మొదట్లోనే జరగాల్సింది. అయితే...ఉన్నట్టుండి రష్యాలో పరిస్థితులు మారిపోయాయి. ఉక్రెయిన్‌పై మెరుపుదాడికి దిగింది ఆ దేశం. ఈ కారణంగా...భారత్ ఈ ఒప్పందం చేసుకోవటానికి వీల్లేకుండా పోయింది. ఎస్సీఓ సమ్మిట్‌లో భాగంగా...ప్రధాని మోదీ ఉజ్బెకిస్థాన్ అధ్యక్షుడు షవ్కత్ మిర్జియోయెవ్ (Shavkat Mirziyoyev)తోనూ భేటీ కానున్నారు. పాకిస్థాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్, ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ కూడా ఈ సమావేశానికి హాజరయ్యే అవకాశముంది.
Also Read: TS Congress Sentiment : కాంగ్రెస్ తెలంగాణ సెంటిమెంట్ అస్త్రం ! పాతబడిపోయిందా ? వర్కవుట్ అవుతుందా ?
Also Read: CM Jagan: జగన్ సర్కార్‌కు కేంద్రం ఊహించని షాక్! హోంశాఖ ప్రకటనతో నిరాశలో ప్రభుత్వం