29th August 2024 School News Headlines:
నేటి ప్రత్యేకత
- నేడు తెలుగు భాషా దినోత్సవం
- జాతీయ క్రీడా దినోత్సవం
- నేడు అంతర్జాతీయ అణుపరీక్షల వ్యతిరేక దినోత్సవం
- నేడు తెలుగు భాషా దినోత్సవం. తెలుగు కవి గిడుగు వెంకట రామమూర్తి జయంతి సందర్భంగా తెలుగు భాషా దినోత్సవం జరుపుకుంటాం. తెలుగు భాష పరిరక్షణకు గిడుగు చేసిన చేసిన సేవలను ఈ రోజున స్మరించుకుంటాం. ఆంధ్రప్రదేశ్ అధికారిక భాష చట్టం ద్వారా 1966 లో తెలుగును రాష్ట్ర అధికారిక భాషగా ప్రభుత్వం ప్రకటించింది. యానాంలోనూ తెలుగును అధికారిక భాషగా గుర్తించారు. 2008 లో కన్నడతో పాటు తెలుగును ప్రాచీన భాషగా గుర్తించారు.
- భారత హాకీ లెజెండ్ మేజర్ ధ్యాన్‌చంద్ 119వ జయంతి నేడు. ఆయన గౌరవార్థం నేడు జాతీయ క్రీడా దినోత్సవం జరుపుకుంటాం. క్రీడా దినోత్సవం రోజున ఉత్తమ క్రీడాకారులకు, శిక్షకులకు అవార్డులు ఇచ్చి గౌరవిస్తారు. ధ్యాన్‌చంద్ అద్భుత ఆటతీరుతో ఒలింపిక్స్ హాకీలో భారత్‌కు స్వర్ణ పతకాల పంట పండించాడు. భారత ప్రభుత్వం 1956లో పద్మభూషణ్ పురస్కారంతో సత్కరించింది. దేశంలో దిగ్గజ హాకీ ఆటగాడిగా ధ్యాన్‌చంద్ ఖ్యాతినార్జించాడు.
ఆంధ్ర ప్రదేశ్ వార్తలు:
- నూజివీడు ట్రిపుల్ ఐటీలో వెయ్యిమంది విద్యార్థులు అస్వస్థతకు గురి కావడం సంచలనం రేపింది. అపరిశుభ్ర వాతావరణం వల్లే విద్యార్థులు అనారోగ్యానికి గురయ్యారని తెలుస్తోంది. వాంతులు, విరేచనాలు, కడుపునొప్పితో విద్యార్థులు అల్లాడిపోతున్నారు. అయినా విద్యార్థుల అనారోగ్యం విషయాన్ని ట్రిపుల్ ఐటీ యాజమాన్యం బయటకు రాకుండా జాగ్రత్తపడింది. నాసిరకం ఆహారం తిన్న విద్యార్థులు అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది.
- ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పోలవరం తొలిదశ పూర్తి చేసేందుకు రూ.30,436.95 కోట్లతో డీపీఆర్‌కు కేంద్ర కేబినేట్ ఆమోదం తెలిపింది. 2027 నాటికి పోలవరం ప్రాజెక్టు తొలి దశ నిర్మాణం పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఏపీలో 3 పారిశ్రామిక కారిడార్లకు కూడా కేంద్రం ఆమోదం తెలిపింది.
తెలంగాణ వార్తలు:
- తెలంగాణలో అక్రమ నిర్మాణాలు కూల్చివేతపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆక్రమణలు మాత్రమే చూస్తామని... ఏ పార్టీ వారు చేశారనేది మాత్రం చూడబోమని తేల్చి చెప్పారు. ఆక్రమణల తొలగింపులో రాజీ పడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఒత్తిళ్లకు తలొగ్గబోమని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
- జైలు నుంచి విడుదలైన బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితి హైదరాబాద్ చేరుకున్నారు. ఎప్పటికైనా న్యాయం గెలుస్తుందని ఆమె వ్యాఖ్యానించారు. ఈ కేసు నుంచి కడిగిన ముత్యంలా బయటపడతానని ధీమా వ్యక్తం చేశారు. ప్రజాక్షేత్రంలో బలంగా పని చేస్తామని, కేసీఆర్ నాయకత్వంలో పోరాడతానని స్పష్టం చేశారు.
జాతీయ వార్తలు:
- కోల్‌కత్తా హత్యాచార ఘటనను నిరసిస్తూ పశ్చిమ బెంగాల్‌లో నిర్వహించిన బంద్ హింసాత్మకంగా మారింది. కొన్ని చోట్ల బీజేపీ నేతలపై బాంబు దాడులు జరిగాయి. తృణమూల్ కాంగ్రెస్ నేతలే ఈ బాంబు దాడులకు కారణమని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు.
- గుజరాత్‌ను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు అనేక ప్రాంతాలు వరదల్లో చిక్కుకుపోయాయి. ఇప్పటికే 26 మందికిపైగా మరణించారు. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర సీఎం భూపేంద్ర పటేల్‌కు ప్రధాని మోదీ ఫోన్ చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై ప్రధాని మోదీ ఆరా తీశారు. సాయం అందిస్తానని హామీ ఇచ్చారు.
క్రీడా వార్తలు:
- పారిస్ వేదికగా పారాలింపిక్స్ వేడుకలు ఘనంగా ఆరంభమయ్యాయి. పారాలింపిక్స్ సంప్రదాయానికి భిన్నంగా తొలిసారిగా స్టేడియం వెలుపల ఓపెనింగ్ సెర్మనీ ఏర్పాటు చేశారు. దాదాపు 140 మంది డ్యాన్సర్లు ప్రదర్శనలో పాల్గొన్నారు. జావెలిన్ త్రోయర్ సుమిత్, మహిళా షాట్‌పుటర్ భాగ్యశ్రీ జాదవ్ భారత పతకధారులుగా వ్యవహరించారు.
హెల్త్ టిప్
- టూత్ బ్రష్‌ను 1, 2 నెలలకు మించి వాడకూడదని దంత నిపుణులు హెచ్చరిస్తున్నారు. సకాలంలో బ్రష్ మార్చకపోతే, పళ్లపై బ్యాక్టీరియా పేరుకుపోయి క్యావిటీస్, గింగివైటిస్ వంటి సమస్యలు వస్తాయి. దంతాలపై పచ్చబసలు, మరకలు ఏర్పడతాయి. ఇవి క్రమంగా పళ్లు నలుపు రంగులోకి మారేలా చేస్తాయి. పాత బ్రష్‌ను ఉపయోగించడం వల్ల దంతాలు, చిగుళ్ళ వాపు, రక్తస్రావం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
మంచిమాట
శ్రమ నీ ఆయుధం అయితే...విజయం నీ బానిస అవుతుంది