రోనా టైమ్‌లో అవసరం ఉన్నా.. లేకపోయినా.. చేతులు శుభ్రం చేసుకొనేవాళ్లం. కానీ, ఇప్పుడు కరోనా.. భయం పోయింది. ఇప్పుడు మళ్లీ అంతా ఫ్రీ బర్డ్స్ అయిపోయాం. దీంతో.. శుభ్రతను కూడా అటకెక్కించేశాం. మీరు మిగతా సందర్భాల్లో చేతులు కడుకున్నా.. కడుక్కోపోయినా.. టాయిలెట్‌కు వెళ్లాక మాత్రం తప్పకుండా చేతులు కడగాల్సిందే అంటున్నారు వైద్య నిపుణులు.. ఎందుకో తెలియాలంటే, ఈ రోగి ధీన స్థితి తెలుసుకోవల్సిందే. 


అమెరికాకు చెందిన ఓ ప్రముఖ డాక్టర్.. ఇటీవల ఓ రోగి స్కాన్ రిపోర్ట్‌ను సోషల్ మీడియాలో పెట్టాడు. ఎక్స్‌రే తరహాలో ఉన్న ఆ రిపోర్టులో ఎముకలతోపాటు అక్కడక్కడ ఏవో బియ్యం గింజల్లాంటి పురుగుల్లాంటివి కనిపించాయి. అవి ఏంటనేది ఎవరికీ అర్థం కాలేదు. దీంతో ఆ డాక్టరే.. అసలు ఆ రోగికి ఏమైంది? అతడి సమస్య ఏమిటనేది అందరికీ అర్థమయ్యేలా వివరించాడు. 


ఎంతకీ ఏమైంది?


యూనివర్శిటీ ఆఫ్ ఫ్లోరిడాకు చెందిన డాక్టర్ శామ్ ఘాలి తన ట్విట్టర్ (X) అకౌంట్‌లో ఓ స్కాన్ రిపోర్ట్ పెట్టారు. ఆ రోగి శరీరంలో బియ్యం గింజల్లా కనిపిస్తున్న ఆకారాలు.. సూక్ష్మ క్రిములని తెలిపారు. ఆ రోగి సిస్టిసెర్కోసిస్ (cysticercosis) అనే పారాసైటిక్ ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్నట్లు ఆ శామ్ వివరించారు. టేనియా సోలియం (Taenia solium) అనే పారాసైట్ (పరాన్నజీవి) లార్వా వల్ల ఈ ఇన్ఫెక్షన్ ఏర్పడుతుందని తెలిపారు. వీటినే టేప్‌వార్మ్ ఎగ్స్ అని కూడా అంటారు. (టేప్‌వార్మ్ అంటే.. టేప్ తరహాలో ఉండే సన్నని పురుగు). దీని వల్ల అతడి శరీరం భాగాల్లో టేప్‌వార్మ్ లార్వాలు బియ్యం గింజల్లా పేరుకుపోయాయి. వాటిలో కొన్ని మెదడులోకి కూడా చేరడంతో నరాల సమస్యలు మొదలయ్యాయి. అసలు అతడికి ఏం జరిగిందా అని టెస్ట్ చేస్తే.. అసలు విషయం బయటపడింది. పదే పదే తలనొప్పి రావడం, మూర్ఛ, తలంతా తొలిచేస్తున్నంత నొప్పి.. గందరగోళం వంటి సమస్యలు రోగిలో కనిపించాయట. 


అవి ఎలా అతడి శరీరంలోకి వెళ్లాయి?


సాధారణంగా ఈ ఇన్ఫెక్షన్.. కంటికి కనిపించని అత్యంత సూక్ష్మ రూపంలో ఉండే పరాన్న జీవి గుడ్లను తినడం వల్ల వస్తాయి. ముఖ్యంగా కలుషిత ఆహారం, నీళ్లు తాగేవారిలో ఎక్కువగా ఇలాంటి పరాన్న జీవులు పెరుగుతాయి. ప్రపంచంలో ఏటా 2.5 మిలియన్ మంది ప్రజలు ఈ ఇన్ఫెక్షన్‌కు గురవ్వుతున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) గణంకాలు చెబుతున్నాయి. ఆసియా, దక్షిణ అమెరికా, తూర్పు ఐరోపా దేశాల ప్రజల్లో ఈ పరాన్న జీవులతో భయానక రోగాలకు గురవ్వుతున్నారట. ఇలాంటి పరాన్న జీవులు ఎక్కువగా ఉడికీ ఉడకని ఆహారాల్లో కనిపిస్తాయని అంటున్నారు. ముఖ్యంగా పంది మాసంలో ఇవి ఎక్కువగా ఉంటాయని అంటున్నారు. 


చేతులు శుభ్రం చేసుకోకపోయినా.. 


అలాగే, సరిగ్గా చేతులు శుభ్రం చేసుకోని వ్యక్తులు మీకు ఆహారాన్ని వడ్డించినా, లేదా మీరే హ్యాండ్ వాష్ చేసుకోకుండా ఏదైనా తిన్నా.. ఆ పరాన్న జీవులు శరీరంలోకి చేరుకుంటాయని డాక్టర్ శామ్ వెల్లడించారు. ముఖ్యంగా టాయిలెట్‌లోకి వెళ్లిన తర్వాత చేతులను శుభ్రం చేసుకోని వ్యక్తుల చేతుల్లోనే ఈ పరాన్న జీవులు ఉంటాయట. ఎందుకంటే.. అప్పటికే ఈ పరాన్న జీవుల సమస్యతో బాధపడుతున్న వ్యక్తి.. టాయిలెట్స్‌ను వాడి ఉంటే, ఆ ప్రాంతమంతా వ్యాపిస్తాయట. ఆ టాయిలెట్‌ను వాడే మరొకరి చేతికి లేదా శరీర భాగాలకు అంటుకుంటాయట. అందుకే, టాయిలెట్‌కు వెళ్లిన తర్వాత వెంటనే చేతులు శుభ్రం చేసుకోవడం ఉత్తమం. ముఖ్యంగా ఆఫీసులు, స్కూల్స్, కాలేజీలు, పబ్లిక్ టాయిలెట్స్‌ను తరచుగా ఉపయోగించే వ్యక్తులు.. తప్పకుండా చేతులను శుభ్రం చేసుకోవాలి. 


అవి కడుపులోకి చేరితే ఏమవుతుంది?


అవి ఒక్కసారి శరీరంలోకి చేరాయంటే.. నెమ్మదిగా అన్ని భాగాలను ఆక్రమిస్తుంది. కలుషిత ఆహారపానీయాలు లేదా కలుషితమైన వస్తువులు, ప్రాంతాలను ముట్టుకొనే వ్యక్తుల శరీరాల్లోకి సులభంగా ఈ పరాన్నజీవులు ప్రవేశిస్తాయి. అత్యంత సూక్ష్మంగా ఉండే.. వాటి గుడ్లు రక్తంలోకి ప్రవేశించి మెదడు, కళ్లు, కండరాల్లోకి చేరుకుంటాయి. ఆ తర్వాత అవి అక్కడే పొదిగి.. కొన్నివారాల తర్వాత టేప్‌వార్మ్‌లుగా రూపాంతరం చెందుతాయి. అవి మన శరీరానికి అందే పోషకాలను గ్రహిస్తూ బలబడతాయి. ఈ పరిస్థితినే ఇంటెస్టినల్ టేనియాసిస్ అంటారని డాక్టర్ శామ్ తెలిపారు. 


మొత్తం ఫ్యామిలీని డెవలప్ చేస్తాయట


ఆ టేప్‌వార్మ్‌లు క్రమేనా శరీరంలోనే గుడ్లు పెట్టి.. తమ సంతానాన్ని పెంచుకుంటాయి. శరీరం భాగాల్లోనే గుడ్లు పెడతాయి. కొన్ని గుడ్లు ఆ బాధితుడి మలం ద్వారా బయటకు వస్తాయి. ఒక వేళ అతడు విసర్జనకు వాడిన టాయిలెట్‌ శుభ్రంగా లేకపోతే.. ఆ పరాన్న జీవులు మరొకరిలోకి చేరే అవకాశం ఉంది. అయితే, ఇవి ఎక్కువగా నోటి ద్వారా మాత్రమే శరీరంలోకి వెళ్తాయట. అంటే.. టాయిలెట్‌కు వెళ్లిన వ్యక్తులు సరిగ్గా చేతులు శుభ్రం చేసుకోకుండా ఆహారం తిన్నట్లయితే.. అవి నేరుగా నోటిలోకి వెళ్లిపోతాయి. వాటి లార్వాలు రక్తంలో కలవడం వల్ల శరీరంలోని అన్ని భాగాలకు సులభంగా చేరుకుంటాయి. ఆ లార్వాలు ఎముకల కండరాలు, నాళాల్లోకి చొచ్చుకెళ్తాయి. కళ్లు, మెదడులోకి కూడా వెళ్లిపోతాయి. అప్పుడే సిస్టిసెర్కోసిస్ (cysticercosis) మొదలవుతుంది. 


ఆ తర్వాత దూరక్రమణే..


అవి శరీరంలోకి చేరిన వెంటనే మన రోగ నిరోధక వ్యవస్థ.. వాటిని చంపడానికి ప్రయత్నిస్తుంది. కానీ, కొన్నిటిని మాత్రమే అడ్డుకుంటుంది. అవే అక్కడ శరీరంలో బియ్యం ఆకారంలో సమూహంగా ఏర్పడతాయి. ఒక వేళ అవి మెదడులోకి ప్రవేశిస్తే.. ప్రమాదంలో చిక్కుకున్నట్లే. ఈ పరిస్థితిని న్యూరోసిస్టిసెర్కోసిస్ (neurocysticercosis)గా పరిగణిస్తారు. అప్పుడే దీనికి సంబంధించిన లక్షణాలు కనిపిస్తాయి. తరచుగా తలనొప్పి రావడం, గందరగోళం, మూర్ఛ వంటి నరాల సంబంధిత సమస్యలు మొదలవుతాయి. అయితే, మెదడులో ఉండే పరాన్న జీవుల సంఖ్యపై ఈ లక్షణాలు ఆధారపడి ఉంటాయి. సాధారణం ఇలాంటి ఇన్ఫెక్షన్లను యాంటీ-పారాసెటిక్ డ్రగ్స్ ద్వారా ట్రీట్ చేస్తారు. కొన్ని కేసుల్లో సర్జరీ కూడా చేయాల్సి ఉంటుంది. 


Read Also: తీపి తినకుండానే మీకు డయాబెటిస్ వచ్చేసిందా? కారణం.. కరోనా అంటే నమ్ముతారా? ఇదిగో కొత్త ముప్పు!


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఈ ఆహారాలు, పానీయాలు మీకు అలర్జీ లేదా ఇతరాత్ర అనారోగ్యాలకు దారితీయొచ్చు. కాబట్టి, ఆహారం, ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.