9 th September 2024 News Headlines:

నేటి ప్రత్యేకత


  • తెలంగాణ భాషా దినోత్సవం. 

  • అంతర్జాతీయ అక్షరాస్యతా 

  • వరల్డ్ ఫస్ట్ ఎయిడ్ డే .

  •  ప్రజా కవి, తెలంగాణ వైతాళికుడిగా గుర్తింపు పొందిన కాళోజీ నారాయణరావు జయంతి నేడు. ఆయన జయంతినే తెలంగాణ రాష్ట్ర భాషా దినోత్సవంగా జరుపుకుంటాం. తెలంగాణ నేలకు పోరాట స్ఫూర్తి నేర్పిన కాళోజీ.. 1914 సెప్టెంబరు 9న జన్మించారు.  నిజాం రాజును, రజాకారుల అరాచకాలను ఎదిరించి జైలు జీవితం గడిపారు. ప్రజల గుండె గోస యాసను అక్షరబద్ధం చేసి తెలంగాణ సాహిత్యానికి పట్టాభిషేకం చేసిన మహాకవి కాళోజీ. 


 

ఆంధ్ర ప్రదేశ్ వార్తలు: 


  • ఉత్తరాంధ్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. ఫ్లాష్‌ ఫడ్స్‌ వచ్చే అవకాశం ఉందని తెలిపారు. ఇప్పటికే అధికారులను అప్రమత్తం చేశామని.. అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు. కొండ చరియలు విరిగిపడే ప్రాంతాల్లో ప్రజలను ఖాళీ చేయించామని తెలిపారు. పూర్తి వివరాలకోసం ఇక్కడ చూడండి..

  • భారీ వర్షాల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో పాఠశాలలకు ఇవాళ కూడా సెలవు ప్రకటించారు. విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం, అల్లూరి జిల్లాలకు సెలవు ప్రకటిస్తూ  కలెక్టర్లు ఉత్తర్వులు జారీ చేశారు. 

  • ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. ఏపీలోనూ హైడ్రా తరహా చట్టం తీసుకొస్తామని అన్నారు. చట్టం అమల్లోకి రాగానే మొట్ట మొదటగా బుడమేరు ఆక్రమణలే తొలగిస్తామని చెప్పారు. కొంతమంది ఆక్రమణల కారణంగా లక్షల మంది ఇబ్బంది పడుతున్నారని, దానిని చూస్తూ ఊరుకోమన్నారు. 


తెలంగాణ వార్తలు: 


  • తెలంగాణలో వరదల వల్ల రూ.5,438 కోట్ల నష్టం వాటిల్లినట్టు ప్రభుత్వం వెల్లడించింది. రోడ్లు భవనాల శాఖలో రూ.2,362 కోట్లు, విద్యుత్ శాఖలో రూ.175 కోట్లు, పంటలు రూ.415 కోట్లు, నీటిపారుదల శాఖలో రూ.629 కోట్లు, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్థి, తాగునీటి శాఖలో రూ.170 కోట్లు, మున్సిపల్ శాఖలో రూ.1,150 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు పేర్కొంది. తక్షణ సాయంగా రూ.2 వేల కోట్లు మంజూరు చేయాలని కేంద్రాన్ని కోరింది. 

  • రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా విద్యార్థులకు బంపరాఫర్ ప్రకటించింది. ఆర్‌బీఐ ఏర్పడి 90 ఏళ్లు పూర్తయిన సందర్భంగా డిగ్రీ స్థాయి విద్యార్థులకు 'ఆర్బీఐ-90' పేరుతో క్విజ్ పోటీలు జాతీయ స్థాయిలో నిర్వహించనుంది. రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆరంభమైంది. సెప్టెంబరు 17 వరకు దరఖాస్తు చేసే అవకాశముంది. ఆన్‌లైన్‌లో క్విజ్ పోటీలు నిర్వహించనుండగా.. విజేతలు రూ. లక్ష నుంచి రూ.10 లక్షలు గెలుచుకునే అవకాశం ఉంది. 


జాతీయ వార్తలు: 


  • పాకిస్థాన్‌ ఆక్రమిత కశ్మీర్‌ ప్రజలు భారత్‌లో చేరాలని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ పిలుపునిచ్చారు. పీవోకే ప్రజలను పాక్‌ విదేశీయులుగా చూస్తోందని.. భారత్‌ ప్రజలు మాత్రం అలా చూడబోరని అన్నారు. పీవోకే ప్రజలను మా సొంతంగా పరిగణిస్తామని రాజ్‌నాథ్‌ హామీ ఇచ్చారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..


అంతర్జాతీయ వార్తలు: 


  • చైనాలో వెట్‌ల్యాండ్ అని పిలుస్తున్న అత్యంత ప్రమాదకరమైన వైరస్‌ను శాస్త్రవేత్తలు కనుగొనడం.. ప్రపంచాన్ని భయాందోళనలకు గురిచేస్తోంది. మెదడు, నాడీ సంబంధిత వ్యాధులకు ఈ వైరస్‌ కారణమవుతుందని పరిశోధకులు తెలిపారు. వైరస్ సోకిన వారికి జ్వరం, మైకం, తలనొప్పి, వికారం, విరేచనాల లక్షణాలు ఉంటున్నాయని వైద్యులు వెల్లడించారు. 


క్రీడా వార్తలు: 


  • పారిస్‌ పారాలింపిక్స్‌ ఘనంగా ముగిశాయి. ఈ విశ్వ క్రీడల్లో గత రికార్డులను బద్దలు కొడుతూ భారత పారా అథ్లెట్లు కొత్త చరిత్ర లిఖించారు. టార్గెట్‌ 25తో పారిస్‌లో అడుగుపెట్టిన పారా వీరులు.. అంచనాలకు మించి సత్తాచాటారు. ఈ పారాలింపిక్స్‌లో రికార్డు స్థాయిలో 29 పతకాలు సాధించారు. ఇందులో 7 స్వర్ణాలు, 9 రజతాలు, 13కాంస్యాలు ఉన్నాయి. టోక్యో పారాలింపిక్స్‌లో భారత్‌ 19 పతకాలే సాధించగా.. ఈసారి ఆ రికార్డు బద్దలైంది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..

  • ఇటలీ స్టార్‌, ప్రపంచ నంబర్‌ వన్ ర్యాంకర్ జనిక్ సినర్ యూఎస్‌ ఓపెన్‌ కైవసం చేసుకున్నాడు. ఫైనల్లో అమెరికాకు చెందిన టేలర్ ఫ్రిట్జ్‌పై 6-3, 6-4, 7-5 తేడాతో సినర్‌ విజయం సాధించాడు. యూఎస్‌ ఓపెన్‌ గెలిచిన తొలి ఇటలీ ఆటగాడిగా సినర్‌ చరిత్ర సృష్టించాడు. సినర్‌కు ఇది ఈ ఏడాదిలో రెండో గ్రాండ్ స్లామ్ టైటిల్‌. జనవరిలో ఆస్ట్రేలియన్ ఓపెన్‌ను సినర్‌ గెలుచుకున్నాడు.