Rains In Srikakulam And Vizianagaram: పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారడంతో ఆంధ్రప్రదేశ్‌లో జోరు వానలు ఊపందుకున్నాయి. ముఖ్యంగా ఉత్తరాంధ్రతోపాటు కోస్తాలోని పలు జిల్లాలను వర్షాలు కుమ్మేస్తున్నాయి. ఆదివారం కురిసిన వానతో కొన్ని జిల్లాలు అతలాకులతమైపోయాయి. ఇప్పటికే విజయవాడలో వరదలు విధ్వంసం సృష్టించాయి. ఇప్పుడు ఉత్తరాంధ్రలో కురుస్తున్న వర్షాలు ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉలికిపాటుకు గురి చేశాయి.
నేడు పూరీ వద్ద తీరం దాటనున్న వాయుగుండం
ప్రస్తుతం వాయుగుండం ఒడిశాలోని పూరీకి ఆగ్నేయంగా కదులోతంది. గంటలకు ఏడు కిలోమీటర్ల వేగంతో వాయువ్య దిశగా పయనిస్తోంది. ఇది కళింగపట్నానికి దాదాపు 250కిలోమీటర్ల దూరంలో ఉంది. అందుకే దీని ప్రభావంతో అటు కోల్‌కతా నుంచి ఇటు ఉత్తరాంధ్ర వరకు జోరు వానలు పడుతున్నాయి. ఈ మధ్యాహ్నానికి పూరీకి సమీపంలో తీరం దాటే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖాధికారులు చెబుతున్నారు.
ఉత్తరాంధ్రలో కుమ్మేస్తున్న వాన
ప్రస్తుతం కళింగ పట్నానికి కొద్ది దూరంలో ఉన్న వాయుగుండం ఈ మధ్యాహ్నానికి తీరం దాటి ఒడిశా, ఛత్తీస్‌గడ్ మీదుగా ట్రావెల్ చేయనుంది. అక్కడ బలహీన పడే ఛాన్స్ ఉందని చెబుతున్నారు. అందుకే దీని ప్రభావంతో ఒడిశా, ఛత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు కురవనున్నాయి. ఏపీ విషయానికి వస్తే శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, జిల్లాల్లో ఇప్పటికే వర్షాలు కుండపోతగా కురుస్తున్నాయి. కాకినాడ, తూర్పుగోదావరి జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు పడుతున్నాయి. ఈ వర్షాలు మరో రెండు రోజుల పాటు ఉంటాయని వాతావరణ శాఖ అభిప్రాయపడింది. అప్పటి వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చూసిస్తోంది.
మూడు రోజులు అప్రమత్తత అవసరం
3 రోజుల పాటు మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లొద్దని వాతావరణ శాఖాధికారులు సూచిస్తున్నారు. సముద్రం పోటుమీద ఉంటుందని తీరం వెంబడి గంటలకు 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే ఛాన్స్ ఉందని హెచ్చరిస్తున్నారు. వాయుగుండం ప్రభావంతో ఉత్తరాంధ్ర, కోస్తాలోని అన్ని పోర్టుల్లో మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అధికారులు.
రెండు రోజులగా జోరువానలు
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో పడిన వర్షాలకు ఉత్తరాంధ్ర ఒక్కసారిగా ఉలికిపాటుకు గురైంది. ఉత్తరాంధ్ర వ్యాప్తంగా దాదాపు అన్ని జిల్లాల్లో రికార్డు స్థాయిలో వర్షపాతాలు నమోదు అయ్యాయి. విజయనగరం చీపురు పల్లిలో పది సెంటీమీటర్లకు పైగా వర్షపాతం కురిసింది. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా వాగులు, గెడ్డలు పొంగి ప్రవహిస్తున్నాయి. ముందు జాగ్రత్తగా అన్ని విద్యాసంస్థలకు ఈ జిల్లాల్లో సెలవులు ప్రకటించారు. ఆదివారం ఉదయమే అన్ని స్కూల్స్‌కు సమాచారం పంపించారు.