Rajnath Singh in Jammu Kashmir: పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌(పీఓకే)లో ఉండే ప్రజలు.. భారత దేశంలో కలవాలని పిలుపునిచ్చారు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌. జమ్ముకశ్మీర్‌(Jammu Kashir)లోని రాంబన్‌ (Ramban)లో బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రాజ్‌నాథ్‌ సింగ్‌ రెండు కీలక ప్రకటనలు చేశారు. జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదాన్ని ఆపితే.. పాకిస్తాన్‌తో చర్చలు జరిపేందుకు భారత్‌ సిద్ధంగా ఉందని చెప్పారు. అదే సమయంలో పీఓకే (POK) ప్రజలు భారత్‌లో చేరాలని కోరారు ఆయన. పీఓకే ప్రజలను పాకిస్తాన్‌ (Pakisthan) విదేశీయులుగా పరిగణిస్తోందని... తామ దేశం మాత్రం వారిని సొంతవారిగా చూసుకుంటున్నామని చెప్పారు.


ఆదివారం (సెప్టెంబర్‌ 8వ తేదీ) రాంబన్ జిల్లాలోని బనిహాల్ స్థానం నుంచి బీజేపీ (BJP) అభ్యర్థి మహ్మద్ సలీం భట్‌కు మద్దతుగా నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో రాజ్‌నాథ్‌సింగ్‌ ప్రసంగించారు. జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేసి... ప్రజల సమస్యలను తొలగించామన్నారు. జమ్ముకశ్మీర్‌ అభివృద్ధికి కృషిచేస్తున్నామన్నారు. ఆర్టికల్‌ 370ని పునరుద్దరిస్తామన్న నేషనల్‌ కాన్ఫరెన్స్‌ (ఎన్సీ) ‌- కాంగ్రెస్‌ కూటమి హామీపై రాజ్‌నాథ్‌సింగ్‌ మండిపడ్డారు. బీజేపీ అధికారంలో ఉన్నంతకాలం అది సాధ్యం కాదని అన్నారు. ఆర్టికల్‌ 370 రద్దుతో జమ్ముకశ్మీర్‌ అభివృద్ధి దిశగా దూసుకుపోతుందన్నారు రాజ్‌నాథ్‌సింగ్‌. పదేళ్ల తర్వాత జమ్మూకశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయని అన్నారు. జమ్మూకశ్మీర్‌లో జరగబోయే ఎన్నికలను యావత్ భారతదేశంతో పాటు ప్రపంచం మొత్తం గమనిస్తోందన్నారు. 


పాకిస్తాన్‌తో చర్చలపై...
జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రవాదానికి బలి అయిన వారిలో 85 శాతం మంది ముస్లింలే అన్నారు రాజ్‌నాథ్‌సింగ్‌. కాశ్మీర్‌లో ఉగ్రదాడులు సర్వసాధారణం అయిపోయాయని.. ఉగ్రదాడుల్లో 40వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారని అన్నారు. పొరుగు  దేశాలతో సంబంధాలను మెరుగుపరుచుకోవాలని ఎవరైనా కోరుకుంటున్నారన్న రాజ్‌నాథ్‌ సింగ్‌... పాకిస్తాన్‌తో సంబంధాలు తమకూ కావలని అన్నారు. అయితే... అందుకు పాకిస్తాన్‌ ఒకపని చేయాల్సి ఉంటుందని చెప్పారు. జమ్మూకశ్మీర్‌లో  ఉగ్రవాదులకు మద్దతు ఇవ్వడం పాకిస్తాన్‌ ఆపిన తర్వాత... ఆ దేశంతో చర్చలు జరుపుతామన్నారు.


పీఓకే ప్రజలు భారత్‌లో చేరండి...
రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పాక్ ఆక్రమిత కాశ్మీర్ (PoK)లో ఉండే ప్రజలను భారత దేశంలో చేరాలని కోరారు. వారు భారత్‌లో చేరితే... తమ సొంత వారిగా పరిగణిస్తామని చెప్పారు. పీఓకే ప్రజలను పాకిస్తాన్‌ విదేశీయులుగా పరిగణిస్తోందన్నారు  రాజ్‌నాథ్‌ సింగ్‌. ఈ విషయాన్ని పాకిస్తాన్‌ ఏఎస్జీ (ASG) స్వయంగా అఫిడవిట్‌లో తెలిపారన్నారు. ఇటీవల జరిగిన ఓ కేసుకు సంబంధించి అఫిడవిట్‌ దాఖలు చేసిన పాక్‌ సొలిసిటర్‌ జనరల్‌ పీఓకేను విదేశీగడ్డగా పేర్కొన్నట్టు చెప్పారు రాజ్‌నాథ్‌.  అందుకే.. భారత్‌లో చేరాలని.. పాక్ ఆక్రమిత కాశ్మీర్ ప్రజలను కోరుతున్నారన్నారు. వారంతా తమ వారే అన్నారాయన.


Also Read: భారత్ లోకి ఎంట్రీ ఇచ్చిన మంకీ ఫాక్స్, పేషెంట్‌ను ఐసోలేషన్లో ఉంచి చికిత్స


జమ్మూకశ్మీర్‌ అభివృద్ధిపై...
చాలా కాలం జమ్మూకాశ్మీర్‌లోని ప్రజల హక్కులను హరించారని... ఇప్పుడు జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పాకిస్తాన్‌ నుంచి వచ్చిన శరణార్థులు, వాల్మీకి సంఘం, పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలు తొలిసారిగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటు  హక్కును పొందారని చెప్పారు. ఎస్సీ వర్గానికి లబ్దిచేకూర్చాలన్న వాల్మీకి సంఘం ఏళ్ల నాటి డిమాండ్‌ కూడా నెరవేరిందన్నారు రాజ్‌నాథ్‌సింగ్‌. తొలిసారిగా ఎస్టీ వర్గానికి అసెంబ్లీలో సీట్లు రిజర్వ్‌ చేశారన్నారు. కాశ్మీర్‌ లోయలో కనిపిస్తున్న మార్పును  ప్రపంచం మొత్తం చూస్తోందన్నారు.


గత ఏడాది, భారతదేశంలో జీ20 నిర్వహించినప్పుడు... అందులో ఒక సమావేశాన్ని శ్రీనగర్‌లో విజయవంతంగా నిర్వహించామని చెప్పారు. ఇంతకు ముందు టెర్రరిజం స్పాట్‌గా పేరుపడ్డ జమ్మూకశ్మీర్...  ఇప్పుడు టూరిజం స్పాట్‌గా మారిందన్నారు. ఇదివరకు జమ్మూ నుంచి శ్రీనగర్‌ వెళ్లేందుకు చాలా సమయం పట్టేదని.. కానీ ఇప్పుడు కేవలం నాలుగున్నర గంటల్లో శ్రీనగర్‌ చేరుకోవచ్చని చెప్పారు.