Mpox In India: కరోనా మహమ్మారి నుండి ఇంకా పూర్తిగా కోలుకోకముందే కొత్త వైరస్ లు ప్రపంచాన్ని వణిస్తున్నాయి. ఎప్పటికప్పుడు వెలుగులోకి వచ్చి ఈ కొత్త వైరస్ ప్రజల జీవితాలు అతలాకుతలం చేస్తున్నాయి. ఎబోలా, నిపా, మలేరియా, డెంగ్యూ, జికా, ఎయిడ్స్, ఏవియన్ ఫ్లూ, వైరల్ హెపటైటిస్, జపనీస్ మెదడువాపు, టమాటో ఫ్లూ వంటి ప్రాణాంతక వైరస్‌లు ఒకదాని తర్వాత ఒకటి మనుషులపై దాడి చేస్తున్నాయి. వందల వేల సంఖ్యలో ప్రాణాలను హరిస్తున్నాయి.  ఈ వైరస్ లు చాలవన్నట్లుగా కొద్ది రోజులుగా మరో వైరస్ కలకలం రేపుతోంది. అదే.. మంకీ పాక్స్ శాస్త్రవేత్తలు దీనిని ఎంపాక్స్‌గా పిలుస్తున్నారు.


గజగజ వణుకుతున్న ప్రపంచం
కరోనా తర్వాత అత్యంత ప్రమాదకరమైన అంటువ్యాధి ఎంపాక్స్.. ఇప్పుడు ఈ రూపం మానవాళికి ముప్పుగా మారుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవల హెచ్చరిక జారీ చేసింది. ఎంపాక్స్‌గా పనిచేసే మంకీపాక్స్ వైరస్ ప్రపంచ దేశాలకు విస్తరిస్తోందని ఆందోళన వ్యక్తం చేసింది. తొలుత ఆఫ్రికా ఖండానికే పరిమితమైన ఈ ప్రాణాంతక వైరస్ క్రమంగా ప్రపంచమంతటా విస్తరిస్తున్నదని, మనం అప్రమత్తంగా ఉండకపోతే ప్రాణాలు పోవడం ఖాయం అని డబ్ల్యూహెచ్‌ఓ హెచ్చరిక జారీ చేసింది. గతంలో ఎంపాక్స్ వైరస్ వెలుగులోకి వచ్చినా.. ఈసారి మరింత ప్రమాదకరంగా మారే ప్రమాదం ఉందని హెచ్చరిస్తోంది. ఆఫ్రికా దేశాలతో పాటు మన పొరుగు దేశమైన పాకిస్థాన్‌లో కూడా ఎంపాక్స్ కేసులు నమోదు అయినట్లు  డబ్ల్యూహెచ్‌ఓ ప్రకటించడం అత్యంత ఆందోళనకరమైన విషయం.


భారత్ లోకి మంకీ పాక్స్ ఎంట్రీ
దేశంలో మంకీ పాక్స్ వైరస్ అనుమానిత కేసు నమోదైంది. మంకీపాక్స్ బారిన పడిన దేశం నుండి ఇటీవల తిరిగి వచ్చిన ఒక యువకుడిలో మంకీ పాక్స్ ఉన్నట్లు అనుమానిస్తున్నారు. రోగి వైరస్ అనుమానిత కేసుగా గుర్తించినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ శుక్రవారం తెలిపింది. రోగిని ఆసుపత్రిలో ఐసోలేషన్‌లో ఉంచారు.ప్రస్తుతం రోగి పరిస్థితి నిలకడగా ఉందని చెప్పారు. రోగి నమూనాలను తీసుకున్నట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ ధృవీకరించింది. అలాగే రోగికి పాక్స్‌ ఉందో లేదో తెలుసుకునేందుకు పరీక్షలు చేస్తున్నారు.



రోగి శాంపిల్ టెస్ట్
MPOX ఉనికిని నిర్ధారించడానికి రోగి నమూనాలను పరీక్షిస్తున్నట్లు మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. దేశంలో మంకీ పాక్స్ ప్రభావాన్ని అంచనా వేయడానికి కాంటాక్ట్ ట్రేసింగ్ కొనసాగుతోంది. ఈ దిశలో ఎలాంటి నిర్ణయాలైన తీసుకొవచ్చని ప్రభుత్వం తెలిపింది. అయితే పరిస్థితి అదుపులో ఉందని ప్రభుత్వం హామీ ఇచ్చింది. నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (NCDC) నిర్వహించిన మునుపటి ప్రమాద అంచనాకు అనుగుణంగా ఈ పరిణామం ఉందని పేర్కొంది. అనవసర ఆందోళనకు కారణం లేదని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఎలాంటి సమస్యలను అయినా ఎదుర్కోనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది.  


ఎంపాక్స్ వైరస్ అంటే..?
ఎంపాక్స్‌గా పరిగణించే మంకీపాక్స్ వైరస్ సోకిన వ్యక్తులకు మశూచి(అమ్మవారు) లక్షణాలతో చిన్న చిన్న పొక్కులు ఏర్పడతాయి. ఈ వైరస్ మొదటిసారిగా 1958లో ఆఫ్రికాలో కనిపించింది. ఈ వైరస్ జంతువుల ద్వారా మానవులకు వ్యాపించింది. కోతుల వంటి జంతువులలో ఈ వైరస్‌ను మొదట గుర్తించారు. మంకీ పాక్స్ వైరస్ వెలుగచూసిన తొలి రోజుల్లో ఆఫ్రికా దేశాల్లోని మారుమూల గ్రామాలు, అటవీ ప్రాంతాల్లో నివసించే మనుషుల్లో మాత్రమే పాజిటివ్‌ కేసులు బయటపడ్డాయి. వైరస్ బాధితులు ఇతర ప్రాంతాలకు వెళ్లినపుడు అక్కడ కొన్ని కేసులు నమోదయ్యాయి. చాలా వరకు జంతువులు,వాటి మాంసం కారణంగానే వైరస్ వ్యాపించింది.. తప్ప మనుషుల నుంచి మనుషులకు వైరస్ సోకిన దాఖలాలు లేవని శాస్త్రవేత్తలు గుర్తించారు.