Journalists House sites in Telangana: అర్హత ఉన్న జర్నలిస్టులకు న్యాయం చేస్తామన్నారు తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy). రవీంద్రభారతి (Ravindra Bharati)లో జవహర్‌లాల్‌ నెహ్రూ జర్నలిస్టు హౌసింగ్‌ సొసైటీ (JNJHS)లో సభ్యులకు భూమి పత్రాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్‌రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, ఎంపీలు చామల కిరణ్, అనిల్ కుమార్ యాదవ్, సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి, జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి, జర్నలిస్టు సంఘాల నాయకులు, అధికారులు పాల్గొన్నారు. లబ్దిదారులైన జర్నలిస్టులకు ఇళ్ల పత్రాలను అందజేశారు సీఎం రేవంత్‌రెడ్డి. పేట్‌ బషీరాబాద్‌లోని 38 ఎకరాల భూమికి సంబంధించిన పత్రాలను సొసైటీ సభ్యులకు అందించారు. అంతేకాదు... ఇళ్ల స్థలాల విషయంలో జర్నలిస్టులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. వారందరికీ న్యాయం చేస్తామని చెప్పారు. ఈ సందర్భంగా జర్నలిజం గురించి, జర్నలిస్టుల గురించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారాయన. 


జర్నలిస్టులు సమాజానికి చికిత్స చేసే డాక్టర్లని అన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి. వారి సంక్షేమం కోసం ఇళ్ల స్థలాలు కేటాయించాలని... ఆనాడు వైఎస్ రాజశేఖర్‌రెడ్డి నిర్ణయం తీసుకున్నారని గుర్తుచేశారు. జర్నలిస్టుల ఇళ్ల స్థలాల విషయంలో  నిర్ణయం తీసుకోవడానికి ఎలాంటి శశబిషాలు లేవని చెప్పారు. జర్నలిస్టుల సమస్యకు కాంగ్రెస్‌ ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపిస్తోందని హామీ ఇచ్చారు సీఎం రేవంత్‌రెడ్డి. అంతేకాదు... వృత్తిపరమైన గౌరవాన్ని ఎవరూ పెంచరని. అది ఎవరికి  వారే పెంచుకోవాలన్నారు. ప్రజాభిప్రాయం, జర్నలిస్టుల సూచనలతో... ప్రజా ప్రభుత్వం ముందుకు వెళ్తోందర్నారు రేవంత్‌రెడ్డి. వ్యవస్థలపై నమ్మకం పెంచాలన్నదే తమ ప్రభుత్వ విధానమని... జర్నలిజం కూడా వ్యవస్థల్లో ఒక భాగమే అని అన్నారు. 


ఆనాడు సిద్ధాంతా వ్యాప్తి కోసం పత్రికలు.. నేడు దారుణం


ఆనాడు రాజాకీయ పార్టీలు సిద్ధాంత భావజాలాన్ని వ్యాప్తి చేసేందుకు పత్రికలు ఏర్పాటు చేసుకుంటే... నేడు ఉన్మాద ధోరణితో వ్యవహరించే పరిస్థితులు దాపురించాయని అన్నారు. కొందరు చేసే పనులతో జర్నలిస్టులు అందరికీ చెడ్డపేరు  వస్తోందన్నారు రేవంత్‌రెడ్డి. కొంతమంది జర్నలిస్టు అనే పదానికి ఉన్న అర్ధాన్నే మార్చేస్తున్నారన్నారు. అలాంటి వారిని నియంత్రించే బాధ్యత జర్నలిస్టు సంఘాలపైనే ఉందన్నారు. నిజమైన జర్నలిస్టులకు ఎలాంటి నష్టం జరగకుండా చూసుకునే  బాధ్యత కాంగ్రెస్‌ ప్రభుత్వానిదే అని హామీ ఇచ్చారు. 


కొన్ని మీడియాల తీరు తప్పుపట్టిన రేవంత్ రెడ్డి


కొన్ని పత్రికలు, ఛానళ్ల తీరును తప్పుబట్టారు సీఎం రేవంత్‌రెడ్డి. కొన్ని పత్రికలు భాష విషయంలోనూ గీత దాటుతున్నాయని అన్నారు. ముఖ్యమంత్రి హోదాను కూడా అవమానపరిచేలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కేవలం రాజకీయ పార్టీల  యజమానులను రక్షించేందుకే వారు ప్రాధాన్యత ఇస్తున్నారని ఆరోపించారు. అలాంటి వారిపై తీసుకునే చర్యలను... నిజమైన జర్నలిస్టులు ఆపాదించుకోవద్దని సూచించారు. నిజమైన జర్నలిస్టులను కాపాడుకోవాల్సిన బాధ్యత తీసుకోవాలన్నారు.  ఆరోగ్య భద్రత కార్డులు, అక్రిడేషన్ ఇతర సమస్యలకు కూడా శాశ్వత పరిష్కారం చూపుతామన్నారు. ఇందు కోసం మీడియా అకాడమీ కొత్త విధి విధానాలు తయారు చేయాలని ఆదేశించారు సీఎం రేవంత్‌రెడ్డి. వాటికి కేబినెట్ ఆమోదం తెలిపే బాధ్యత  తాము తీసుకుంటామన్నారు. గత పదేళ్లుగా తెలంగాణకు అసలు పాలసీలే లేవన్నారు. జర్నలిస్టు సమస్యలు పరిష్కరించే బాధ్యత తమదే అన్నారు. మీడియా అకాడమీకి స్పెషల్ డెవలప్‌మెంట్‌ ఫండ్ నుంచి 10 కోట్లు కేటాయిస్తున్నట్టు  ప్రకటించారు.


జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు. ఆ విషయంలో... ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదర్నారు సీఎం రేవంత్‌రెడ్డి. అర్హులైన వారందరినీ ఫ్యూచర్ సిటీలో భాగస్వాములను చేస్తామన్నారు. ఫోర్త్ సిటీ, ఫ్యూచర్ సిటీ నిర్మాణంలో  అందరం భాగస్వాములం అవుదామన్నారు. ఇక... చనిపోయిన జర్నలిస్టుల కుటుంబాలకు లక్ష రూపాయల చొప్పున చెక్కులను పంపిణీ చేశారు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.