HYDRA Commissioner Ranganath | హైదరాబాద్: జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న అక్రమ కట్టడాలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతోంది. సామాన్యులు, సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు అనే వ్యత్యాసం లేకుండా నిబంధనల్ని అతిక్రమించి చెరువులు, జలాశయాల ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్లలో నిర్మించిన అక్రమ కట్టడాలను హైడ్రా కూల్చివేస్తోంది. నివాస కట్టడాలను హైడ్రా కూల్చివేయడంపై ప్రజల్లో ఆందోళన నెలకొంది. అక్రమ కట్టడాల కూల్చివేతపై స్పందించిన హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ కీలక ప్రకటన చేశారు. FTL, బఫర్ జోన్లలో చేపడుతున్న కొత్త నిర్మాణాలను మాత్రమే కూల్చివేస్తున్నట్లు స్పష్టం చేశారు. అయితే ఇదివరకే ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్లలో నిర్మించిన కట్టడాలను కూల్చివేయడం లేదన్నారు. ముఖ్యంగా నివాస కట్టడాలను హైడ్రా కూల్చివేయడం లేదని నోటీసులు మాత్రం ఇచ్చినట్లు తెలిపారు. కొత్త అపార్ట్ మెంట్స్, ఇండ్లు, ప్లాట్, భూమి కొనుగోలు చేసే సమయంలో అది నిబంధనలను విరుద్ధంగా ఉందా లేదా చెక్ చేసుకుని కొనుగోలు చేయడం ఉత్తమమని సూచించారు.
నివాసం ఉంటున్న భవనాలను కూల్చడం లేదు
‘మల్లంపేట చెరువులో హైడ్రా కూల్చివేస్తున్న భవనాలు ఇంకా నిర్మాణ దశలో ఉన్నాయి. కొత్తగా చేపట్టిన నిర్మాణాలు, నిర్మాణ దశలోనే ఉన్న నిబంధనలకు విరుద్ధంగా ఉన్న కట్టడాలను మాత్రమే కూల్చుతున్నాం. మరోవైపు సున్నం చెరువులో నిర్మించిన కొన్ని షెడ్లు వాణిజ్య అవసరాలకు వినియోగిస్తున్నారని గుర్తించాం. హైడ్రా ఏర్పాటుకు ముందు సైతం నగరంలో అక్రమ కట్టడాలపై ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటూనే ఉన్నాయి. గతంలో నోటీసులు ఇచ్చిన అక్రమ కట్టడాలను మొదటగా హైడ్రా కూల్చివేస్తోంది. మాజీ ఎమ్మెల్యే కాటసాని భూపాల్‌రెడ్డిపై, బిల్డర్ విజయలక్ష్మిపై క్రిమినల్ కేసులు నమోదుచేశాం.
ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ల పరిధిలో ఉన్న నివాస కట్టడాలను, ఇప్పటికే నివాసం ఉంటున్న భవనాల జోలికి హైడ్రా వెళ్లడం లేదు. అయితే ఇలాంటి స్థలాల్లో ఇళ్లు గానీ, స్థలాలు గానీ కొనుగోలు చేయవద్దు’ అని హైడ్రా కమిషనర్ రంగనాథ్ వివరించారు. రంగనాథ్ ప్రకటనతో ఇప్పటికే ఇళ్ల నిర్మాణం పూర్తయి, అందులో నివాసం ఉంటున్న యజమానులకు భారీ ఊరట కలిగింది.
Also Read: హైడ్రా అక్కర్లేదు, అది మేమే కూల్చేస్తాం, నోటీసులపై మురళీ మోహన్ క్లారిటీ