Hyderabad News: ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ జయభేరి కన్‌స్ట్రక్షన్స్‌కు నోటీసులు రావడంపై సంస్థ వ్యవస్థాపకుడు, సినీ నటుడు మురళీ మోహన్ స్పందించారు. హైడ్రా (Hyderabad Disaster Response and Assets Monitoring and Protection) అధికారులు తమకు నోటీసులు పంపిన విషయం నిజమే అని అన్నారు. 33 ఏళ్లుగా తాను రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నానని మురళీ మోహన్ గుర్తు చేసుకున్నారు. కానీ, తాను ఎలాంటి అక్రమణలకు పాల్పడలేదని చెప్పారు. బఫర్ జోన్ లో 3 అడుగుల మేరకు రేకుల షెడ్ ఉన్నట్లు గుర్తించామని హైడ్రా అధికారులు అంటున్నారని వివరించారు. అది కూల్చడం కోసం హైడ్రా అధికారులు రావాల్సిన అవసరం ఏం లేదని.. ఆ షెడ్డును తామే తీసేస్తామని మురళీ మోహన్ స్పష్టం చేశారు.
కాగా గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లోని రంగలాల్ కుంట చెరువులో ఫుల్ ట్యాంక్ లెవల్ (ఎఫ్‌టీఎల్), బఫర్ జోన్ లో నిర్మించిన నిర్మాణాలను తొలగించాలని జయభేరి కన్‌స్ట్రక్షన్స్ సంస్థకు హైడ్రా అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలోనే మురళీ మోహన్ స్పందించారు. ఆ నిర్మాణం తొలగించేందుకు 15 రోజులు టైం ఇచ్చారని.. కానీ, తము వెంటనే కూల్చేస్తామని మురళి మోహన్ స్పష్టం చేశారు.
మరోవైపు, హైదరాబాద్ నగరంలో అక్రమ నిర్మాణాల కూల్చివేతల విషయంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఏ మాత్రం వెనక్కి తగ్గటం లేదు. దీంతో హెచ్ఎండీఏ పరిధిలోని ఏడు జిల్లాల్లో చెరువుల పరిరక్షణ కోసం లేక్ ప్రొటెక్షన్ కమిటీ ఛైర్మన్ బాధ్యతలను సైతం హైడ్రాకు అప్పగించేందుకు కూడా ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇదే జరిగితే.. హైదరాబాద్, సంగారెడ్డి, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, మెదక్, గజ్వేల్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో చెరువుల ఆక్రమణలకు చెక్ పడుతుందని భావిస్తున్నారు.