HYDRA Latest News: హైదరాబాద్ లో హైడ్రా (Hyderabad Disaster Response and Assets Monitoring and Protection) కూల్చివేతలు శరవేగంగా జరుగుతున్నాయి. దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని కత్వ చెరువులో 170/1 సర్వే నెంబర్ లో వెలసిన 8 విల్లాలను హైడ్రా అధికారులు నేలమట్టం చేస్తున్నారు. మల్లంపేట్ కత్వ చెరువు ఎఫ్టీఎల్ (ఫుల్ ట్యాంక్ లెవెల్) విస్తీర్ణం 142 ఎకరాలుగా ఉంది. అయితే, ఈ చెరువును ఆక్రమించి అక్రమ కట్టడాలు చేసినట్లుగా హైడ్రా అధికారులు గుర్తించారు.


మల్లంపేట్ లో లక్ష్మీ శ్రీనివాస కన్‌స్ట్రక్షన్ పేరుతో 2020-21 సంవత్సరానికే 320 విల్లాలను కన్‌స్ట్రక్ట్ చేసింది ఈ సంస్థ. అప్పటికే 60 విల్లాలకు మాత్రమే HMDA పర్మిషన్ తీసుకున్న ఈ సంస్థ మిగతావాటిని ఫోర్జరీ పర్మిషన్ తో నిర్మించినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణలతో అప్పటి మేడ్చల్ కలెక్టర్ హరీష్ నేతృత్వంలో డీపీఓ ఆధ్వర్యంలో ఎంక్వైరీ చేసి 208 విల్లాలు ఇల్లీగల్ కన్‌స్ట్రక్షన్ అని నోటీసులు జారీచేసి సీజ్ చేశారు. హై కోర్ట్ ఆదేశాలతో ఈ అక్రమ విల్లాలకు కరెంట్ కనెక్షన్, వాటర్ కనెక్షన్, రిజిస్ట్రేషన్ లను ఆపాలని, బ్యాంక్ అధికారులు లోన్ లను నిలిపివెయ్యాలని ఆర్డినెన్స్ జారీచేశారు. 


చట్టంలో ఉన్న లొసుగులతో దుండిగల్ మున్సిపాలిటీ అధికారుల ధనదాహానికి అక్రమ విల్లాలన్నీ సక్రమవిల్లాలుగా మారిపోయాయని ఆరోపణలు ఉన్నాయి. ఏ పర్మిషన్ తో సంబంధం లేకుండా ఇంటినెంబర్ల ఆధారంగా, డబుల్ పన్ను విధించి కుడా రిజిస్ట్రేషన్ లు చేయొచ్చనే కొత్త ఒరవడిని దుండిగల్ మున్సిపాలిటీ తీసుకొచ్చి రిజిస్టేషన్ లు చేసిందని అంటున్నారు. దీంతో హైడ్రా రంగంలోకి దిగి గత ఆదివారం ఈ కత్వ చెరువును విజిట్ చేసింది. ఈ రోజు ఎఫ్‌టీఎల్ లో ఉన్న మూడు విల్లాలు, బఫర్ జోన్ లో ఉన్న ఐదు విల్లాలను అధికారులు నేలమట్టం చేశారు.