Weather Latest News In Telangana And Hyderabad: బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం తెలంగాణను కూడా భయపెడుతోంది. రెండు రోజుల నుంచి హైదరాబాద్‌తోపాటు చాలా జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. వాయుగుండం తీరం దాటే సమయంలో మరింతగా వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖాధికారులు చెబుతుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. బంగాళాఖాతంలో కదులుతున్న వాయుగుండం ఇవాళ తీరం దాటనుంది. అందుకే దీని ప్రభావంతో మోస్తరు నుంచి భారీ, అతి వర్షాలు పడబోతున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది.
ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
వాయుగుండం ప్రభావంతో మరో మూడు రోజులు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ పేర్కొంది. తెలంగాణ వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని తెలిపారు. కొన్ని జిల్లాలకు ప్రత్యేక అలర్ట్ ప్రకటించారు. ఆ జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ఆసిఫాబాద్, ములుగు, భద్రాద్రి-కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
9వ తేదీ ఉదయం 10వ తేదీ ఉదయం వరకు...
ఆరెంజ్ హెచ్చరిక ఉన్న జిల్లాలు:- కుమ‌్రం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల
ఎల్లో అలర్ట్ ఉన్న జిల్లాలు:- ఆదిలాబాద్, నిర్మల్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగతా జిల్లాల్లో ఊదురు గాలులు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖాధికారులు తెలిపారు.
హైదరాబాద్‌కు వర్ష సూచన
మరోవైపు బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావం హైదరాబాద్‌పై కూడా ఉంది. ఆకాశం రెండు రోజుల నుంచి మేఘావృతమై అక్కడక్కడ జోరువానలు పడుతున్నాయి. నిన్న హైదరాబాద్‌లోని చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. ఇదే పరిస్థితి మరో రెండు రోజులు ఉండబోతుందని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖాధికారులు హెచ్చరిస్తున్నారు.
సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం
తెలంగాణలో ఈసారి వర్షాలు లేవని మొన్నటి వరకు అనుకున్నా.. సాధారణం కంటే ఈసారి భారీగా వర్షపాతం నమోదైనట్టు అధికారులు చెబుతున్నారు. గతానికి కంటే ఈసారి 42 శాతం ఎక్కువ వర్షపాతం పడిందని లెక్కలు చూపిస్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా ఏడు జిల్లాల్లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం రిజిస్టర్ అయ్యింది. మహబూబాబాద్, సిద్దిపేట, మహబూబ్‌నగర్, జోగుళాంబ గద్వాల, వనపర్తి, నాగర్‌కర్నూల్, నారాయణపేట జిల్లాల్లో ఎక్కువ వర్షం కురిసినట్టు అధికారులు లెక్కలు చూపిస్తున్నారు. ఆగస్టు 29 నుంచి సెప్టెంబర్ 4 వరకు ఎక్కువ వర్షం కురిసిందని అంటున్నారు.
Also Read: ఎవరికి తోస్తే వాడు ఓ ట్యూబ్ పెట్టుకుంటాడు - యూట్యూబ్ ఛానెళ్లపై రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు