28th August 2024 School News Headlines Today:

నేటి ప్రత్యేకత


  • భారతీయ సితార్ విధ్వాంసుడు విలాయత్ ఖాన్ జయంతి

  • తెలుగు సినిమా నటుడు సుమన్ జననం


ఆంధ్ర ప్రదేశ్ వార్తలు: 

ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన నేడు ఈ-కేబినెట్ భేటీ జరగనుంది. 2014-19 మధ్య కాలంలో నాటి టీడీపీ ప్రభుత్వం ఈ-కేబినెట్ నిర్వహించింది. ఈ సమావేశంలో అజెండా మొదలుకుని కేబినెట్ నోట్స్ వరకు అన్నీ ఆన్‌లైన్‌ ద్వారానే మంత్రులకు ప్రభుత్వం అందజేస్తుంది. ఈ-కేబినెట్ నిర్వహణపై ఇప్పటికే మంత్రుల వ్యక్తిగత కార్యదర్శులకు ప్రభుత్వం శిక్షణ ఇచ్చింది.

 

ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ పుట్టినరోజైన సెప్టెంబరు 2న క్లీన్‌ ఆంధ్ర - గ్రీన్‌ ఆంధ్ర’ పేరుతో ఊరూవాడా పరిశుభ్రతకార్యక్రమాలు చేపట్టనున్నారు. జనసేనాని జన్మదినం సందర్భంగా ప్రజలకు ఉపయోగపడే పనులు చేయాలని జనసేన పీఏసీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ జనసేన శ్రేణులకు పిలుపునిచ్చారు.

 

తెలంగాణ వార్తలు: 

ఢిల్లీ మద్యం కేసులో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత జైలు నుంచి విడుదల అయ్యారు. సుప్రీంకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయడంతో కవిత మంగళవారం రాత్రి జైలు నుంచి బయటకు వచ్చారు. తాను కేసేఆర్‌ కుమార్తెనని..ఎప్పుడు తప్పు చేయబోనని కవిత స్పష్టం చేశారు.

 

తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వచ్చే నెల 17 నుంచి రేషన్‌కార్డులు, ఆరోగ్యకార్డులు ఇవ్వాలని నిర్ణయించింది. సెప్టెంబరు 17 నుంచి పది రోజులపాటు ప్రజా పాలన నిర్వహించి అర్హులకు రేషన్‌కార్డులు, ఆరోగ్య కార్డులు అందజేయాలని రేవంత్‌ రెడ్డి ఆదేశించారు.

 

జాతీయ వార్తలు: 

అరుణాచల్ ప్రదేశ్‌లోని సుబాన్సిరి జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ట్రక్కు లోయలో పడి ముగ్గురు ఆర్మీ జవాన్లు మరణించారు. మరో నలుగురు గాయపడ్డారు. మరణించిన వారిని హవల్దార్ నఖత్ సింగ్, నాయక్ ముకేశ్ కుమార్, గ్రెనేడియర్ అశిశ్‌గా గుర్తించారు. 

 

విద్యార్థులు చేప‌ట్టిన న‌బ‌న్నా అభియాన్‌ నిర‌స‌న‌పై పోలీసులు ఉక్కుపాదం మోప‌డానికి నిరసనగా నేడు పశ్చిమ బెంగాల్ బంద్‌కు BJP పిలుపునిచ్చింది. ఈరోజు సాయంత్రం 6 వర‌కు బంద్ కొన‌సాగుతుంద‌ని రాష్ట్ర బీజేపీ చీఫ్ సువేందు అధికారి తెలిపారు. 

 

దేశంలో వాయు కాలుష్యం క్రమంగా పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. చాలా రాష్ట్రాల్లో పీఎం 2.5 స్థాయి కంటే అధికంగా వాయు కాలుష్యం ఉంది. ఇది పిల్లలు, పెద్దలకు అత్యంత ప్రమాదకరమని అంతర్జాతీయ జనాభా శాస్త్రాల సంస్థ అధ్యయనం హెచ్చరించింది. వాయు కాలుష్యాన్ని తగ్గించాలని పిలుపునిచ్చింది. 

 

దేశంలోని జాతీయ రహదారుల్లో ఆక్రమణలను తొలగించాలని సుప్రీం కోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. రహదారుల ఆక్రమణలపై సుప్రీం ఆందోళన వ్యక్తం చేసింది. హైవేల్లో ఆక్రమణలపై ప్రత్యేక దృష్టి సారించాలని కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖకు ఆదేశాలు జారీ చేసింది.

 

క్రీడా వార్తలు: 

నేటి నుంచి పారిస్ వేదికగా పారా ఒలింపిక్స్‌ ప్రారంభం కానున్నాయి. 12 రోజుల పాటు సాగనున్న ఈ టోర్నీలో వివిధ దేశాల నుంచి మొత్తం 4,400 మంది పారా అథ్లెట్లు పాల్గొననున్నారు. ఇక భారత్‌ ఒలింపిక్స్ చరిత్రలోనే ఈసారి 84 మంది అథ్లెట్లు బరిలోకి దిగుతున్నారు. 

 

బీసీసీఐ కార్యదర్శిగా ఉన్న జై షా ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. ప్రస్తుత చైర్మన్‌ గ్రెగ్ బార్క్‌లే పదవీ కాలం నవంబర్‌‌ 30వ తేదీతో ముగియనుంది. దీంతో చైర్మన్‌గా జై షా ఎన్నిక ఏకగ్రీవమైంది. డిసెంబర్‌‌ 1వ తేదీన ఐసీసీ చైర్మన్‌గా జై షా బాధ్యతలు చేపట్టనున్నారు.

 

మంచిమాట

నీ విజయాన్ని అడ్డుకునేది నీలోని ప్రతికూల ఆలోచనలే. కింద పడ్డామని ప్రయత్నం ఆపేస్తే, ఎన్నటికీ విజయం సాధించలేం.