Cannabis May Reverse Brain Aging: గంజాయి అనగానే, దానితో కలిగే నష్టాలనే గుర్తుకు వస్తాయి. చాలా మంది యువకులు గంజాయికి అలవాటు పడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. మత్తుకు బానిసై నేరాలకు పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే గంజాయిని మత్తు పదార్థంగా గుర్తించి ప్రభుత్వాలు నిషేధించాయి. అయినా, గంజాయి అక్రమ రవాణా వార్తలు కోకొల్లలుగా కనిపిస్తాయి. నిత్యం పోలీసు దాడులలో క్వింటాళ్ల కొద్ది గంజాయి పట్టుబడుతూనే ఉంది.


THCతో మెదడు వృద్ధాప్యానికి చెక్


కాసేపు గంజాయితో కలిగే నష్టాలను పక్కన పెడితే లాభాలు కూడా ఉన్నాయంటున్నారు పరిశోధకులు. గంజాయిలోని టెట్రాహైడ్రోకాన్నబినాల్ (THC) సమ్మేళనంతో శరీరానికి చాలా ఉపయోగపడుతుందంటున్నారు. టెట్రాహైడ్రోకాన్నబినాల్ (THC) రసాయనాన్ని తక్కువ మోతాదులో వైద్యుల పర్యవేక్షణలో తీసుకోవడం వల్ల అమేజింగ్ బెనిఫిట్స్ కలుగుతాయన్నారు. వృద్ధాప్యంతో మెదడులో కలిగే మార్పులను అడ్డుకుంటుందని జర్మనీకి చెందిన యూనివర్సిటీ ఆఫ్‌ బాన్‌, ఇజ్రాయెల్‌కు చెందిన హిబ్రూ వర్సిటీ పరిశోధకులు తెలిపారు. అంతేకాదు, దీనిలోని యాంటీ ఏజింగ్ లక్షణాలు వృద్ధాప్యాన్ని సమర్థవంతంగా అడ్డుకుంటున్నట్లు గుర్తించారు.


ఎలుకలపై పరిశోధనలో కీలక విషయాలు వెల్లడి


గత కొంతకాలంగా జర్మనీ, ఇజ్రాయేల్ పరిశోధకులు ఎలుకలపై టెట్రాహైడ్రోకాన్నబినాల్ ప్రయోగించారు. ఎలుకల్లో ఎలాంటి మార్పులు జరుగుతున్నాయో గుర్తించారు. అయితే, టెట్రాహైడ్రోకాన్నబినాల్ ఎలుకల్లో మెదడును మరింత చురుగ్గా మార్చుతున్నట్లు గుర్తించారు. ఎలుకల వయసును కూడా ఈ సమ్మేళనం అడ్డుకుంటున్నట్లు గుర్తించారు. సాధారణంగా మనుషులలో వయసు పెరిగే కొద్ది మెదడు పనితీరు మందగించడంతో పాటు మతిమరుపు వస్తుంది. గంజాయిలోని టెట్రాహైడ్రోకాన్నబినాల్ ఈ సమస్యలకు చెక్ పెడుతుందని పరిశోధకులు అభిప్రాయపడ్డారు.


THCతో మెదడు చురుగ్గా ఎందుకు మారుతుందంటే?


గంజాయి పరిశోధనకు సంబంధించి జర్మనీ, ఇజ్రాయెల్ పరిశోధకులు ఎండోకన్నబినాయిడ్ సిస్టమ్, కన్నాబినాయిడ్ రిసెప్టర్ టైప్-1  అధ్యయనం నిర్వహించారు. ఇందులో THC యాంటీ ఏజింగ్ లక్షణాల బయటపడినట్లు వెల్లడించారు. అంతేకాదు, దీర్ఘకాలిక THC చికిత్స తీసుకోవడం వల్ల సినాప్టిక్ ప్రోటీన్ ఉత్పత్తి పెరిగి మెదడు చురుగ్గా మారినట్లు గుర్తించారు. ఆ తర్వాత జ్ఞాపకశక్తి పెరుగుదలను గుర్తించినట్లు తెలిపారు. అంతేకాదు, THCలోని యాంటీ ఏజింగ్ గుణాలు వృద్ధాప్య లక్షణాలను కూడా కంట్రోల్ చేస్తున్నట్లు తేలిందన్నారు. గంజాయిలోని టెట్రాహైడ్రోకాన్నబినాల్ సమ్మేళనం కారణంగా జ్ఞాపకశక్తిలో గణనీయమైన పెరుగుదల కనిపించినట్లు బాన్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకుడు డాక్టర్ ఆండ్రాస్ బిల్కీ-గోర్జో వెల్లడించారు.  


Read Also: సూసైడ్ ఆలోచనలను రెట్టింపు చేస్తున్న గంజాయి.. కొత్త అధ్యయనంలో షాకింగ్ విషయాలు



Also Read : సాల్ట్​ తో క్యాన్సర్ ముప్పు 40 శాతం పెరుగుతుందట.. తాజా అధ్యయనంలో షాకింగ్ విషయాలు.. రోజుకు ఎంత ఉప్పు తీసుకోవాలంటే?


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.