27 th August 2024 School News Headlines Today:
నేటి ప్రత్యేకత
ఎయిర్ ఇండియా దినోత్సవం
ఆస్ట్రేలియా క్రికెటర్ డోనాల్డ్ బ్రాడ్‌మాన్ జననం
తెలంగాణ వార్తలు:
రాజీవ్‌గాంధీ సివిల్స్ అభయహస్తం పథకం ద్వారా తెలంగాణలో సివిల్స్‌కు అర్హులైన యువతకు సింగరేణి సంస్థ సౌజన్యంతో రూ. లక్ష ఆర్థిక సహాయం చెక్కులను సీఎం రేవంత్ రెడ్డి పంపిణీ చేశారు. సెక్రటేరియట్‌లో తెలంగాణ రాష్ట్ర కనీస వేతన సలహా మండలి చైర్మన్ జనక్ ప్రసాద్ తో కలిసి చెక్కులు అందజేశారు.
ఆంధ్ర ప్రదేశ్ వార్తలు:
ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ప్రముఖ ఒబెరాయ్ సంస్థ ఆసక్తి చూపుతోంది. సెప్టెంబరు 20లోగా అన్నవరంలో హోటల్ నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టనుందని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ తెలిపారు. హార్సిలీహిల్స్, పిచ్చుకల్లంకలోనూ పీపీపీ విధానంలో హోటళ్ల నిర్మాణంపై ఒబెరాయ్ హోటల్స్ సానుకూలంగా స్పందించారని వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్‌లో గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన సీబీఎస్‌ఈ పరీక్షా విధానంపై విమర్శలు వస్తున్నాయి. తాజాగా ఈ విధానంపై అమలుపై జరిగిన మదింపులో దిగ్ర్బాంతికర విషయాలు బహిర్గతమయ్యాయి. ఇప్పటివరకు బోధించిన సిలబస్‌పై మదింపు జరగగా దాదాపు 60 శాతం మందికిపైగా ఫెయిల్ అయ్యారు. ఏ సబ్జెక్టులోనూ కనీసం సగం మంది ఉత్తీర్ణులు కాలేదు.
జాతీయ వార్తలు :
భారత అమ్ముల పొదిలో మరో యుద్ధ నౌక చేరనుంది. పూర్తి అణు సామర్థ్యంతో నిర్మించిన.. దేశ తొలి బాలిస్టిక్ క్షిపణి వ్యవస్థ కలిగిన జలాంతర్గామి ‘ఐఎన్‌ఎస్ అరిహంత్’ త్వరలో భారత సైన్యంలో చేరనుంది. ప్రధాని ఈ నెలాఖరు లేదా సెప్టెంబరు తొలి వారంలో INS అరిహంత్‌ను జాతికి అంకితం చేయనున్నారు.
కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా కొత్త రాజకీయ పార్టీ స్థాపించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలో ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ ఈ ప్రచారం జోరందుకుంది. దివంగత ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉండేలా పార్టీ పేరు అటల్ విచార్ మంచ్‌గా పెట్టనున్నట్లు తెలుస్తోంది.
జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ పార్టీలు సీట్ల సర్దుబాటుపై ఓ నిర్ణయానికి వచ్చాయి. తాజాగా రెండు పార్టీల పొత్తు ఖరారైంది. మొత్తం 90 అసెంబ్లీ స్థానాలు ఉండగా ఒప్పందం ప్రకారం 32 చోట్ల కాంగ్రెస్, 51 స్థానాల్లో నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ పోటీ చేయనున్నాయి.
మహిళలపై జరుగుతున్న నేరాలు క్షమించరాని పాపాలని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. దోషులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. ప్రభుత్వాలు వస్తుంటాయి.. పోతుంటాయి.. కానీ మహిళల జీవితాలు, గౌరవాన్ని కాపాడడం ప్రభుత్వం సహా మనందరిపై ఉన్న అతి పెద్ద బాధ్యతని ప్రధాని స్పష్టం చేశారు.
అంతర్జాతీయ వార్తలు:
ఆఫ్రికన్ దేశమైన బుర్కినా ఫాసోలో హింస చెలరేగింది. అల్-ఖైదాతో సంబంధం ఉన్న జమాత్ నుస్రత్ అల్-ఇస్లాం వాల్-ముస్లిమిన్ అనే సాయుధ సమూహం ఊచకోతకు పాల్పడింది. ఈ మారణహోమంలో 200 మంది చనిపోయారు. 140 మంది గాయపడ్డారు. మృతుల్లో గ్రామస్థులు, సైనికులు ఉన్నారు.
క్రీడా వార్తలు:
మహిళల టీ20 వరల్డ్ కప్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో జరగనుంది. ఈ క్రమంలో ఐసీసీ షెడ్యూల్‌ను విడుదల చేసింది. గ్రూప్-Aలో ఆస్ట్రేలియా, ఇండియా, న్యూజిలాండ్, పాకిస్థాన్, శ్రీలంక ఉండగా గ్రూప్-Bలో సౌతాఫ్రికా, ఇంగ్లండ్, వెస్టిండీస్, బంగ్లాదేశ్, స్కాట్లాండ్ ఉన్నాయి. మొత్తం 23 మ్యాచులుంటాయి. ఈ టోర్నీ అక్టోబర్ 3వ తేదీ నుంచి 20వ తేదీ మధ్య జరుగుతుంది.
మంచిమాట
అజ్ఞానాన్ని తొలగించి... విజ్ఞానాన్ని పంచి.. క్రమశిక్షణ నేర్పేవాడే గురువు.