Supreme Court:
14 పార్టీల పిటిషన్
దేశవ్యాప్తంగా పలు చోట్ల సీబీఐ,ఈడీ దాడులు కొనసాగుతున్నాయి. బిహార్‌లో ల్యాండ్ ఫర్ జాబ్ స్కామ్ విచారణ జరుగుతోంది. ఢిల్లీలో లిక్కర్ స్కామ్ వేడి ఇంకా చల్లారలేదు. అయితే ఈ దాడులపై ప్రతిపక్షాలు భగ్గుమంటున్నాయి. ప్రతిపక్ష పార్టీలను అణిచివేసేందుకు దర్యాప్తు సంస్థల్ని పావులుగా వాడుకుంటున్నాయని తీవ్రంగా ఆరోపిస్తున్నాయి. ఈ క్రమంలోనే 14 ప్రతిపక్ష పార్టీలు సుప్రీంకోర్టుని ఆశ్రయించాయి. కేంద్రానికి వ్యతిరేకంగా పిటిషన్ వేశాయి. ప్రతిపక్షాలపై పక్షపాత ధోరణితో దాడులు చేయిస్తోందని ఆ పిటిషన్‌లో తెలిపాయి. ఈ పిటిషన్‌ను పరిశీలించిన సర్వోన్నత న్యాయస్థానం...విచారణకు అంగీకరించింది. ఏప్రిల్ 5వ తేదీన వాదనలు వింటామని స్పష్టం చేసింది. కాంగ్రెస్, ఆమ్‌ఆద్మీ పార్టీ, రాష్ట్రీయ జనతా దళ్, తృణమూల్ కాంగ్రెస్, DMK సహా మరి కొన్ని పార్టీలు ఈ పిటిషన్ వేశాయి. బీజేపీలో చేరగానే అన్ని ఈ దాడులు ఆపేస్తున్నారని విమర్శించాయి. బీజేపీ మాత్రం ఈ విమర్శలను కొట్టి పారేస్తోంది. దర్యాప్తు సంస్థలు చట్టప్రకారమే నడుచుకుంటున్నాయని తేల్చి చెబుతోంది. స్వతంత్రంగా పని చేస్తున్నాయని వివరిస్తోంది.