మాస్ మహారాజా రవితేజ కుటుంబం నుంచి ఓ కథానాయకుడు వస్తున్నాడు. ఆయన తమ్ముడు రఘు (Ravi Teja Brother Raghu) కుమారుడు మాధవ్ భూపతిరాజు తెలుగు తెరకు పరిచయం అవుతున్నారు. పూజా కార్యక్రమాలతో గురువారం సినిమా స్టార్ట్ చేశారు. అయితే, ఇక్కడే ఓ ట్విస్ట్ ఉంది. 


మాధవ్ తొలిసారి మేకప్ వేసుకున్నది నిన్న మొదలైన సినిమా కోసం కాదు! దీని కంటే ముందు ఆయన ఓ సినిమాకు కొబ్బరికాయ కొట్టారు. అయితే, అది మధ్యలో ఆగిందని తెలిసింది. దాంతో కొత్త సినిమాతో కుర్రాడిని హీరోగా లాంచ్ చేస్తున్నారు. ముందు అనుకున్న సినిమా వివరాల్లోకి వెళితే... 


రమేష్ వర్మ కథతో...
మాధవ్ భూపతిరాజును కథానాయకుడిగా, మిస్ ఇండియా ఫస్ట్ రన్నరప్ రూబెల్ షేఖావత్ కథానాయికగా పరిచయం చేస్తూ... 'ఏయ్ పిల్లా' అని లక్ష్మీ నరసింహా ప్రొడక్షన్స్ ఓ సినిమా ప్రొడ్యూస్ చేయాలని ప్లాన్ చేసింది. ఫస్ట్ లుక్ కూడా విడుదల చేసింది. దానికి రమేష్ వర్మ కథ అందించారు. లుధీర్ బైరెడ్డి దర్శకుడిగా పరిచయం కానున్నారని తెలిపారు. మిక్కీ జె. మేయర్ సంగీతంలో సినిమా పనులు మొదలు అయ్యాయి.


ఏమైందో ఏమో... 'ఏయ్ పిల్లా' సినిమాను పక్కన పెట్టేశారు. దాంతో ఇప్పుడు మాధవ్ భూపతిరాజును హీరోగా పరిచయం చేస్తూ కొత్త సినిమా స్టార్ట్ చేశారు. అదీ సంగతి!


Also Read : హిందూపూర్ వెళ్ళడానికి ముందు - అమ్మాయి నిష్కతో తారక రత్న, చివరి వీడియో ఇదేనా?






'పెళ్లి సందD' దర్శకురాలు గౌరీతో... 
మాధవ్ హీరోగా జేజేఆర్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై శ్రీమతి యలమంచి రాణి సమర్పణలో రూపొందుతున్న ఈ చిత్రానికి 'పెళ్లి సందD' ఫేమ్ గౌరీ రోణంకి దర్శకురాలు. త్వరలో సినిమా సెట్స్ మీదకు వెళ్ళనుంది.  


అబ్బాయికి పెదనాన్న విషెస్!
''హీరోగా పరిచయం అవుతున్న మా అబ్బాయి మాధవ్ భూపతిరాజుకు ఆల్ ది వెరీ బెస్ట్. మీరందరూ మా వాడిని ఆశీర్వదించి ప్రేమాభిమానాలు చూపించండి'' అని రవితేజ ట్వీట్ చేశారు. షూటింగులో బిజీగా ఉండటం వల్ల ప్రారంభోత్సవానికి  ఆయన రాలేకపోయారని నిర్మాత జేజేఆర్ రవిచంద్ తెలిపారు. 


వచ్చే నెలలో షూటింగ్!
ఈ సినిమా వచ్చే నెలలో సెట్స్ మీదకు వెళుతుందని హీరోగా పరిచయమవుతున్న మాధవ్ తెలిపారు. ఇంకా ఆయన మాట్లాడుతూ... ''ఇక్కడికి వచ్చిన పెద్దలు అందరికీ చాలా థాంక్స్. జేజేఆర్ రవిచంద్ గారి సంస్థలో రెండో చిత్రమిది. వచ్చే నెల నుంచి షూటింగ్ స్టార్ట్ చేస్తాం. సినిమా విడుదల అయ్యేంత వరకూ మీ అందరి మద్దతు కావాలి'' అని రిక్వెస్ట్ చేశారు. 






యూత్‌ఫుల్... కలర్‌ఫుల్!
చిత్రనిర్మాత జేజేఆర్ రవిచంద్ మాట్లాడుతూ... ''మా సినిమా ఓపెనింగుకు వచ్చిన రాఘవేంద్ర రావు గారు, సురేష్ బాబు గారు, మొదటి నుంచి నాకు మద్దతుగా ఉన్న చదలవాడ శ్రీనివాసరావు గారు, ఇతరులకు థాంక్స్. 'పెళ్లి సందD'తో గౌరి రోణంకి దర్శకురాలిగా నిరూపించుకున్నారు. ఆమె రెండో చిత్రాన్ని మా సంస్థలో చేయడం సంతోషంగా ఉంది. రవితేజ గారి సోదరుడు రఘు గారి అబ్బాయి మాధవ్ భూపతి రాజును హీరోగా పరిచయం చేయడం కూడా హ్యాపీగా ఉంది. మంచి కథాంశంతో తెరకెక్కుతున్న చిత్రమిది.  గతంలో సాంబశివ క్రియేషన్స్ సంస్థలో ఐదు చిత్రాలు చేశా. జేజేఆర్ సంస్థ స్థాపించి నవీన్ చంద్రతో ఓ సినిమా చేశా. ఇది రెండో సినిమా'' అని చెప్పారు. 


తనకు ఈ సినిమా సెకండ్ డెబ్యూ అని దర్శకురాలు గౌరి రోణంకి తెలిపారు. తనకు అవకాశం ఇవ్వడంతో పాటు హీరో మాధవ్ మీద నమ్మకం ఉంచినందుకు నిర్మాతకు థ్యాంక్స్ చెప్పారు. ఇది యూత్ ఫుల్, కలర్ ఫుల్ సినిమా అని తెలిపారు. త్వరలో కథానాయికతో పాటు ఇతర నటీనటుల వివరాలు వెల్లడిస్తామన్నారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం : రామ్, కళా దర్శకత్వం : కిరణ్ కుమార్ మన్నె, కూర్పు : విప్లవ్, సంగీతం : అనూప్ రూబెన్స్, నిర్మాత : జేజేఆర్ రవిచంద్, రచన & దర్శకత్వం : గౌరి రోణంకి.