SC On Demonetisation: 2016లో మోదీ సర్కార్ తీసుకున్న 'నోట్ల రద్దు'ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై తీర్పును సుప్రీం కోర్టు రిజర్వ్ చేసింది. అంతకుముందు రూ.1000, రూ.500 నోట్లను రద్దు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి సంబంధించిన అన్ని రికార్డులను సమర్పించాలని కేంద్ర ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ RBI)ను ఆదేశించింది. సుప్రీం ఆదేశాలకు సమాధానంగా సంబంధిత రికార్డులను సీల్డ్ కవర్‌లో సమర్పిస్తానని అటార్నీ జనరల్ ఆర్.వెంకటరమణి తెలిపారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 2016 నవంబరు 8న రూ.500, రూ.1,000 నోట్లను రద్దు చేసినట్లు ప్రకటించారు. దీనిని వ్యతిరేకిస్తూ అనేక పిటిషన్లు సుప్రీం కోర్టులో దాఖలయ్యాయి. నోట్ల రద్దు చేసి ఆరేళ్లు గడిచిపోయినా ప్రభుత్వ నిర్ణయం చెల్లుబాటుపై సవాలు చేయడానికి అవకాశం ఉందని పిటిషనర్ తరఫు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. కార్యనిర్వాహక ఆదేశాల ద్వారా కరెన్సీ నోట్లను రద్దు చేసే అధికారం ప్రభుత్వానికి లేదని వాదించారు.
విచారణ
ఈ పిటిషన్లపై జస్టిస్ ఎస్‌ఏ నజీర్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం కొంతకాలంగా విచారణ జరిపింది. అయితే నోట్ల రద్దు నిర్ణయంపై న్యాయ సమీక్ష అవసరం లేదని గత విచారణ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం వాదించింది.
అంతకుముందు ప్రభుత్వ విధానాలపై విచారణ చేయొచ్చా లేదా అనే అంశంపై తమకు అవగాహన ఉందని సుప్రీం పేర్కొంది.
" ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాలపై న్యాయసమీక్ష విషయంలో ఉన్న లక్ష్మణ రేఖ గురించి మాకు అవగాహన ఉంది. అయితే నోట్ల రద్దు సమస్య 'అప్రస్తుతం'గా మారిందా లేదా అన్న అంశంపై తుది నిర్ణయానికి రావాల్సిన అవసరం ఉంది. 'నోట్ల రద్దు' నిర్ణయానికి ఎలా వచ్చారు, ఇందుకోసం ఎలాంటి కసరత్తు చేశారనే విషయాన్ని పరిశీలించాలి. న్యాయవాదుల వాదనలు వినాలి. "