China Covid Restriction:
ఆంక్షలకు మినహాయింపులు..
చైనా ప్రభుత్వానికి జీరో కొవిడ్ పాలసీ పెద్ద తలనొప్పే తెచ్చి పెట్టింది. ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దాదాపు 10 రోజులుగా అక్కడ ఏదో ఓ నగరంలో ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. రోజురోజుకీ చైనా పౌరులకు అంతర్జాతీయంగా మద్దతు పెరుగుతోంది. జిన్‌పింగ్ ప్రభుత్వంపై అసహనమూ ఎక్కువవుతోంది. ఈ క్రమంలోనే...చైనా కీలక నిర్ణయాలు తీసుకుంది. కరోనా కఠిన ఆంక్షల్ని పక్కన పెట్టేసి క్రమంగా వాటికి మినహాయింపులు ఇచ్చే పనిలో పడింది. "ఆంక్షలను సరళతరం చేస్తున్నాం" అని ప్రకటించింది. చైనా నేషనల్ హెల్త్ కమిషన్ చేసిన ప్రకటన ఆధారంగా చూస్తే...PCR టెస్టింగ్ విషయంలో ఇప్పటి వరకూ ఉన్న నిబంధనలకు కాస్త మినహాయింపులు ఇవ్వనున్నారు. లాక్‌డౌన్‌లను కూడా క్రమంగా తొలగించనున్నారు. సివియర్ సింప్టమ్స్ లేని బాధితులు ఇంట్లోనే ఐసోలేట్ అయ్యేందుకు అవకాశం కల్పించ నున్నారు. పబ్లిక్ బిల్డింగ్స్‌లోకి వెళ్లాలంటే ఇప్పటి వరకూ చైనా పౌరులు తమ ఫోన్‌లో గ్రీన్ కోడ్‌ను అధికారులకు చూపించాల్సి వచ్చేది. ఇప్పుడా అవసరం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే...నర్సింగ్ హోమ్స్, వైద్య సంస్థలు, పాఠశాలల్లో మాత్రం ఈ నిబంధన కొనసాగనుంది. లక్షణాలు లేని, స్వల్పంగా ఉన్న బాధితులను బలవంతంగా క్వారంటైన్‌లోకి తీసుకెళ్లడమూ ఇకపై ఉండదని వెల్లడించింది. "లక్షణాలు లేని బాధితులు హోమ్ ఐసోలేషన్‌లో ఉండొచ్చు. లేదంటే ప్రభుత్వం కల్పించిన క్వారంటైన్ సౌకర్యాన్నైనా వినియోగించు కోవచ్చు" అని ప్రభుత్వం తెలిపింది. స్కూల్స్, హాస్పిటల్స్, నర్సింగ్ హోమ్స్‌లో ఇప్పటి వరకూ భారీ స్థాయిలో PCR టెస్ట్‌లు నిర్వహించారు. ఇకపై ఈ సంఖ్యను తగ్గించనున్నారు. అంతే కాదు. ఓ రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి వెళ్లే వాళ్లు కొవిడ్ సర్టిఫికేట్ చూపించాల్సిన అవసరం లేదని వెల్లడించింది.
వైరల్ వీడియో..
ఇటీవలే చైనాలోని ఓ వీడియో వైరల్ అయింది. చైనాలో కొవిడ్ ఆంక్షలు ఎంత కఠినంగా ఉన్నాయో..వాటిపై ప్రజలు ఎంత వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారో ప్రపంచమంతా గమనిస్తూనే ఉంది. వైరస్ కట్టడికి ఇలాంటి రూల్స్ తప్పవని ప్రభుత్వం చెబుతున్నా...ఇవి మరీ హద్దు దాటుతున్నాయని మండి పడుతున్నారు ప్రజలు. అయితే...ఈ రూల్స్ ఎంత స్ట్రిక్ట్‌గా ఉంటాయన్నది వినడమే కానీ...ఎప్పుడూ చూడలేదు. కానీ...అక్కడి ప్రభుత్వ నియంతృత్వ వైఖరిని తెలియజేసే వీడియో ఒకటి వైరల్ అయింది. కొవిడ్ సోకిన వ్యక్తి క్వారంటైన్‌లో ఉండేందుకు నిరాకరించగా...వైద్య సిబ్బందిన ఆ వ్యక్తిని లాక్కుని తీసుకెళ్లిన వీడియా సంచలనమవుతోంది. పీపీఈ కిట్స్ వేసుకున్న ఇద్దరు..ఆ వ్యక్తిని బలవంతంగా పట్టుకుని తీసుకెళ్లారు. ఎంత వద్దని బాధితుడు అరుస్తున్నా కూడా పట్టించుకోలేదు. హంగ్‌జోవూలో జరిగిందీ ఘటన. దీనిపై తీవ్ర వ్యతిరేకత రావడం వల్ల అధికారులు స్పందించారు. "బాధితుడికి క్షమాపణలు చెప్పాం. ఆ సిబ్బందినీ మందలించాం" అని చెప్పారు.
కానీ.. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. సోషల్ మీడియాలో నెటిజన్లు చైనా ప్రభుత్వంపై తీవ్రంగా మండి పడుతున్నారు. ఇలాంటి నియంతృత్వ విధానాలు మార్చుకోవాలని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.