COVID-19 Compensation:
పెండింగ్‌లోనే అప్లికేషన్లు..
కొవిడ్ కారణంగా తల్లిదండ్రుల్ని కోల్పోయి అనాథలైన చిన్నారులకు పరిహారం ఇవ్వాలని సుప్రీం కోర్టు రాజస్థాన్ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. రెండు వారాల్లోగా చెల్లింపులు పూర్తి కావాలని తేల్చి చెప్పింది. జస్టిస్ ఎమ్ఐర్ షా, జస్టిస్ సుధాన్షు ధులియాతో కూడిన ద్విసభ్య ధర్మాసనం మరి కొన్ని వ్యాఖ్యలు చేసింది. ఎక్స్‌గ్రేషియా కోసం వచ్చిన దరఖాస్తులను ఎందుకు తిరస్కరించారో స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీకి వివరించాలని ఆదేశించింది. ఈ అప్లికేషన్లను పరిశీలించి నాలుగు వారాల్లోగా ఏదో ఓ నిర్ణయం తీసుకోవాలని రాజస్థాన్ స్టేట్ లీగల్ సర్వీస్
అథారిటీకి సూచించింది. "పరిహారం కోసం వచ్చిన దరఖాస్తులను పెండింగ్‌లో ఉంచటంపై కచ్చితంగా దృష్టి సారించాల్సిందే. కొవిడ్ కారణంగా తల్లిదండ్రుల్ని కోల్పోయి అనాథలైన మిగతా చిన్నారులకూ పరిహారం తప్పకుండా దక్కాల్సిందే. రెండు వారాల్లోగా ఇది పూర్తి కావాలి" అని ధర్మాసనం తేల్చి చెప్పింది. దీనిపై రాజస్థాన్ ప్రభుత్వం స్పందించింది. మొత్తం అనాథలు 718 మంది కాగా...వారిలో 191 మందికి
పరిహారం అందజేసినట్టు వెల్లడించింది. తల్లిదండ్రులు ఆత్మహత్య చేసుకోవటం వల్ల చిన్నారులు అనాథలైన విషయాన్నీ ప్రభుత్వం ప్రస్తావించింది. జిల్లా స్థాయిలో 9,077 అప్లికేషన్లు వచ్చాయని, వీటిలో 551 పెండింగ్‌లో ఉన్నాయని, 8047 మందికి పరిహారం చెల్లించామని ప్రభుత్వం తెలిపింది. 479 అప్లికేషన్లు తిరస్కరించినట్టు వివరించింది. అంతకు ముందు సుప్రీం కోర్టులో రాజస్థాన్ ప్రభుత్వంపై పిటిషన్ దాఖలైంది. ఆ సమయంలోనే సర్వోన్నత న్యాయస్థానం ప్రభుత్వంపై మండి పడింది. "ఎవరికీ దానం చేయటంలేదు" అంటూ ఆగ్రహించింది. అడ్వకేట్ గౌరవ్ కుమార్ బన్సాల్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. 2021లో ఇచ్చిన ఆదేశాల మేరకు..రాజస్థాన్ ప్రభుత్వం అనాథ చిన్నారులకు రూ.50,000 పరిహారం అందించటం లేదని అందులో పేర్కొన్నారు.
దుర్వినియోగం కాకూడదు..
ఈ ఆదేశాలను ఎంత వరకు పాటించారో తెలియజేయాల్సిందిగా...స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీస్ నుంచి వివరణ కోరారు పిటిషనర్. రూ.50 వేల పరిహారాన్ని ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టడంపై సుప్రీం కోర్టు ఆగ్రహంగా ఉంది. ఈ డబ్బుని దుర్వినియోగం అవకూడదని చెప్పింది. ఏ ప్రభుత్వమైనా సరే నిర్దేశిత పరిహారాన్ని అనాథ చిన్నారులకు అందజేయటంలో ఎలాంటి జాప్యం చేయకూడదని గతంలోనే గట్టిగా చెప్పింది.
పరిహారం ఇందుకే అందట్లేదా..?
మొదటి వేవ్ కన్నా సెకండ్ వేవ్ సమయంలో మరణాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఆ సమయలో దేశంలో స్మశానాల దగ్గర పరిస్థితి అందరితోనూ కన్నీరు పెట్టించింది. అన్ని రాష్ట్రాల్లోనూ మరణాల సంఖ్య సాధారణం స్థాయి కన్నా ఎన్నో రెట్లు ఎక్కువగా ఉన్నట్లుగా తేలింది. అయితే ఆ మరణాలన్నీ కరోనా మరణాలు కిందకు కాలేదు. ప్రభుత్వాలు కరోనా మరణాలను తక్కువ చేసి చూపించడానికి సాధారణ మరణాలుగా చెప్పేందుకు ప్రయత్నించాయి. ఈ కారణంగా ఇప్పుడు కరోనా బారిన పడి చనిపోయినా వారి కుటుంబాలకు సాయం అందడం కష్టంగా మారనుంది. ఒక్క కరోనా కారణంగానే చనిపోరు. అప్పటికి శరీరంలో ఉన్న వివిధ అనారోగ్య సమస్యలకు కరోనా తోడైతే చనిపోతారు. అత్యధిక మందిలో జరిగింది ఇదే. కానీ మరణాల నమోదు విషయంలో కార్డియాక్ అరెస్ట్ అని.. మరొకటి అని రాసి మరణ ధృవపత్రాలు జారీ చేశారు. ఈ కారణంగా కరోనాతో చనిపోయిన కొన్ని లక్షల మందికి పరిహరం అందడం గగనంగా మారనుంది.
Also Read: Himachal Pradesh Election 2022 Date: హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల