Himachal Pradesh Election 2022 Date: హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. నవంబర్ 12న పోలింగ్ జరగనుంది. డిసెంబర్ 8న ఫలితాలు వెలువడనున్నాయి. ఈ మేరకు దిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (సీఈసీ) రాజీవ్ కుమార్ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించారు. 


హిమాచల్ ప్రదేశ్‌లో మొత్తం 68 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఒకే విడతలో ఎన్నికలు జరపనున్నట్లు ఈసీ ప్రకటించింది. హిమాచల్ ప్రదేశ్ శాసనసభ గడువు 2023, జనవరి 8తో ముగియనుంది.


కీలక తేదీలు



  • నామినేషన్లకు చివరి తేదీ: అక్టోబర్ 25

  • నామినేషన్ల పరిశీలన: అక్టోబర్ 27

  • నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ: అక్టోబర్ 29

  • పోలింగ్ తేదీ: నవంబర్ 12

  • ఓట్ల లెక్కింపు, ఫలితాలు: డిసెంబర్ 8


తక్షణమే ప్రవర్తనా నియమావళి అమలులోకి వస్తుందని రాజీవ్ కుమార్ తెలిపారు. ఎన్నికలు జరిగే రాష్ట్రాలు ఆరోగ్య మంత్రిత్వ శాఖ నిర్దేశించిన కొవిడ్-19  నిబంధనలను అనుసరించాలని సీఈసీ కోరారు. 


2017లో


2017లో జరిగిన హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 68 స్థానాలకు గాను 44 చోట్ల భాజపా గెలిచింది. దీంతో భాజపా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కాంగ్రెస్‌ కేవలం 21 అసెంబ్లీ స్థానాలను మాత్రమే గెలుచుకోగలిగింది. సీపీఐ(ఎం) ఒక స్థానాన్ని గెలుచుకోగా, ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో భాజపా విజయం సాధించడంతో జై రామ్ ఠాకూర్‌ను పార్టీ అధిష్ఠానం రాష్ట్ర ముఖ్యమంత్రిగా నియమించింది.


ABP- C ఓటర్ సర్వే


హిమాచల్‌ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలపై ఇటీవల ABP News,C Voter ఒపీనియన్ పోల్ నిర్వహించింది. ABP News- C Voter Opinion Poll 2022 ప్రకారం...2017తో పోల్చి చూస్తే హిమాచల్‌లో భాజపా ఓటు షేర్ కాస్త తగ్గనుంది. ఈ ఏడాది ఓటు షేర్ 45.2%గా ఉండగా 2017లో ఇది 48.8%గా నమోదైంది. ఇక మిగతా పార్టీల సంగతి చూస్తే కాంగ్రెస్‌ ఓటు శాతం 33.9%గా అంచనా వేసింది. గత ఎన్నికలతో పోల్చితే ఇది 8% తక్కువ. ఆమ్‌ ఆద్మీ పార్టీ (AAP) ఓట్ షేర్ 9.5%గా నమోదవుతుందని అంచనా వేసింది. ఈ సర్వే ప్రకారం భాజపానే మరోసారి అధికారంలోకి రానుంది. కాషాయ పార్టీ 37-45 సీట్లు సాధిస్తుందని ABP-C Voter సర్వే స్పష్టం చేసింది. 


కాంగ్రెస్‌కు 21-29 స్థానాలు వచ్చే అవకాశముంది. ఆప్‌ కేవలం ఒక్క సీట్‌కే పరిమితం కావచ్చని వెల్లడించింది. ఇక సీఎం అభ్యర్థిగా మరోసారి జైరామ్ ఠాకూర్ ఉండాలా లేదా అన్న విషయంలోనూ సర్వే జరిగింది. ఇందులో 31.7% మంది జైరామ్ ఠాకూర్‌కు మద్దతుగా నిలిచారు. ఇక రెండో అభ్యర్థిగా కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ పేరు వినిపించింది. ఆయనకు 19.5% ఓట్లు లభించాయి. కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ప్రతిభా సింగ్ ముఖ్యమంత్రి రేసులో మూడో అభ్యర్థిగా ఉన్నారు. ఆమెకు 15% మంది మద్దతు పలికారు. 9.5% మంది ఆప్‌నకు చెందిన అభ్యర్థే ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకుంటున్నారని ABP News, C Voter సర్వే వెల్లడించింది.